
Photo Courtesy: BCCI/IPL
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో మురిపించిన కమిన్స్ బృందం.. ఆ తర్వాత పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓడి హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది.
ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్.. ఐపీఎల్-2024 రన్నరప్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆరంభంలో బాగానే రాణించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ కేకేఆర్ క్రమంగా పుంజుకుంది.
దుమ్ములేపిన కేకేఆర్ బ్యాటర్లు
కెప్టెన్ అజింక్య రహానే (38), అంగ్‌క్రిష్ రఘువన్షీ(32 బంతుల్లో 50), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్).. ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Lighting up Eden Gardens with some fireworks 💥
Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏
5⃣0⃣ up for Iyer in the process!
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025
మూకుమ్మడిగా విఫలం
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2).. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్(2) మూకుమ్మడిగా విఫలమయ్యారు. నితీశ్ కుమార్ రెడ్డి (19), కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు.
ఫలితంగా కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘‘వికెట్ బాగానే ఉంది. కానీ మేమే సరిగ్గా ఆడలేకపోయాం.
తొలుత క్యాచ్‌లు వదిలేశాం. ఆఖర్లో పరుగులు సమర్పించుకున్నాం. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలి. సమీక్ష నిర్వహించి .. మరింత మెరుగైన ఆప్షన్ల కోసం ప్రయత్నించాలి.
ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ఓటమి
మా బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు విజయాలు సాధించారు. కానీ ఈసారి మాత్రం అలా జరుగలేదు. అయితే, ఫీల్డింగ్ తప్పిదాల వల్లే మేము భారీ మూల్యం చెల్లించాం. ఓవరాల్‌గా చూస్తే బౌలింగ్ మాత్రం ఫర్వాలేదు.
ఆరంభంలో క్యాచ్‌లు వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది. మేము కేవలం మూడు ఓవర్లే స్పిన్ వేశాం. బంతిపై మాకు అంతగా గ్రిప్ దొరకలేదు. అందుకే ఆడం జంపాను ఆడించలేదు. వరుస ఓటములు నిరాశపరిచాయి.
అయితే, ఈ విషయాన్ని తలచుకుని కుంగిపోవాల్సిన పనిలేదు. తదుపరి సొంత మైదానంలో ఆడబోతున్నాం. అది మాకు సానుకూలాంశం’’ అని కమిన్స్ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా సీజన్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత లక్నో చేతిలో ఐదు వికెట్ల తేడాతో, ఢిల్లీ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్
👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)
👉సన్‌రైజర్స్ స్కోరు: 120 (16.4)
👉ఫలితం: సన్‌రైజర్స్‌పై 80 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వైభవ్ అరోరా (3/29).
చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ