
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దీనస్థితిలో ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడు.. కనీసం తనకు తానుగా నడవలేకపోతున్నాడు. అడుగులు తడబడి కిందపడే సమయంలో పొరుగున ఉన్న వ్యక్తులు ఆసరా అందించడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ముంబై క్రికెటర్ వినోద్ కాంబ్లీ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు సహచర ఆటగాడు. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా కాంబ్లీకి కాలం కలిసిరాలేదు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు సైతం గతంలో వెల్లడించాయి.
ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా చిక్కుల్లో పడ్డ వినోద్ కాంబ్లీ ఇంకా కోలుకోలేదని తాజా వీడియో ద్వారా స్పష్టమవుతోంది. నరేంద్ర గుప్తా అనే ఇన్‌స్టాగ్రామ్ ఈ దృశ్యాలను షేర్ చేశాడు. ‘‘మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్యోగం ఏమాత్రం బాలేదు. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో తాను బాధపడుతున్నట్లు వినోద్ కాంబ్లీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నాడు. అనారోగ్యం వల్ల ఎన్నోసార్లు ఆస్పత్రిబారిన పడ్డాడు వినోద్.
హృదయ సంబంధిత వ్యాధులతో పాటు డిప్రెషన్‌తో అతడు బాధపడుతున్నాడు. త్వరలోనే అతడు కోలుకోవాలని.. అవసరమైన సాయం అతడి అందాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర గుప్తా పేర్కొన్నాడు. టీమిండియా తరఫున 1993- 2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 పరుగులు సాధించాడు. 2000 సంవత్సరంలో భారత్ తరఫున చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు.
ఇక నాటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 92 పరుగులు సాధించాడు. కాగా 2013లో వినోద్ కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. చెంబూరు నుంచి కారులో వెళ్తున్న సమయంలో హార్ట్ అటాక్ రాగా.. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ మరుసటి ఏడాదే ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా చితికిపోయినట్లు సమాచారం.