
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుతో లేకపోయినా తాము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సేవలు తమకు ముఖ్యమేనని.. అయితే, అతడి గైర్హాజరీలో కూడా తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియా తరఫున పునరాగమనం చేస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లో హిట్‌మ్యాన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా గురించి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పాండ్యా గాయపడితే అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరంటూ విలేకరులు అడిగారు.
ప్రతిసారీ నెగటివ్‌గానే ఎందుకు?
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ప్రతిసారీ ప్రతికూల అంశాల గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ‘అతడు గాయపడతాడు.. ఇతడికి గాయమవుతుంది.. అప్పుడెలా? ఇలా జరిగితే జట్టుకు కష్టమే’.. అనే మాటలు ఎందుకు?
సెలక్టర్లు, నాయకత్వ దళంలో ఇందుకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పలేం కదా! కానీ మా వ్యూహాలు మాకుంటాయి. పాండ్యా గాయపడ్డా మేము వరల్డ్‌కప్ సజావుగానే పూర్తిచేశాం.
అతడు గాయపడితే ఎలా అన్న ఆలోచన నాకు లేదు
టోర్నీ మూడు లేదంటే నాలుగో మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడనుకుంటా. ఆ తర్వాత కూడా మేము టోర్నీ ఆసాంతం మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి దాకా అజేయంగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు అతడు గాయపడితే ఎలా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు.
ఒకవేళ అతడు గాయపడినా ఏం చేయాలో మాకు తెలుసు. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటీ సమస్యా ఉండదు’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన పాండ్యా
తద్వారా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
బ్యాట్‌తో, బంతితో రాణించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వరల్డ్‌కప్-2024లో 144 పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 3/20తో రాణించి టీమిండియాకు విజయం అందించాడు. సౌతాఫ్రికా విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ల వికెట్లు తీసి రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ పాండ్యా ప్రధాన భూమిక పోషించాడు.
ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం అతడు వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాడు. కాగా ఫిబ్రవరి 6(గురువారం), ఫిబ్రవరి 9(ఆదివారం), ఫిబ్రవరి 12(బుధవారం)న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.
చదవండి: CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’