India Open 2022: Satwik Rankireddy And Chirag Shetty Win Mens Doubles Title - Sakshi
Sakshi News home page

India Open 2022: సాత్విక్‌–చిరాగ్‌ జంట సంచలనం.. టైటిల్‌ సొంతం.. ప్రైజ్‌మనీ ఎంతంటే!

Published Mon, Jan 17 2022 7:48 AM | Last Updated on Mon, Jan 17 2022 10:59 AM

India Open 2022: Shuttler Satwik Rankireddy Chirag Shetty Won Doubles Title - Sakshi

సొంతగడ్డపై భారత షట్లర్ల అద్భుతం... రెండు పతకాలు

India Open 2022: బ్యాడ్మింటన్‌ సీజన్‌ తొలి టోర్నమెంట్‌లో ... అదీ సొంతగడ్డపై భారత షట్లర్లు అద్భుతం చేశారు. ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు టైటిల్స్‌ అందించారు. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి ద్వయం ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్‌ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ లో కీన్‌ యు (సింగపూర్‌)ను కంగుతినిపించి భారత యువస్టార్‌ లక్ష్య సేన్‌ విజేతగా అవతరించాడు.

ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్‌ జంట సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి 21–16, 26–24తో టాప్‌ సీడ్‌ ఎహ్‌సాన్‌–సెతియవాన్‌ జోడీ ని ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టికిది రెండో సూపర్‌ –500 స్థాయి టైటిల్‌ కావడం విశేషం. 2019లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.  

ఎహ్‌సాన్‌–సెతియవాన్‌ జంటతో 43 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం కీలకదశలో పట్టు కోల్పోకుండా ఓర్పుతో ఆడింది. తొలి గేమ్‌లో స్కోరు 13–13తో సమంగా ఉన్న దశలో సాత్విక్‌–చిరాగ్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో రెండు జోడీలు ప్రతి పాయింట్‌ కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు భారత జోడీనే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

గత నెలలో కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన లో కీన్‌ యుతో 54 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 24–22, 21–17తో గెలుపొంది కెరీర్‌లో తొలి సూపర్‌–500 టైటిల్‌ సాధించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో కాంస్యం నెగ్గిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌ ఫైనల్లో ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి గేమ్‌లో 19–20, 21–22 వద్ద రెండుసార్లు గేమ్‌ పాయింట్లను కాచుకొని గట్టెక్కిన లక్ష్య సేన్‌ రెండో గేమ్‌లో మాత్రం లో కీన్‌ యుపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్‌కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో భారత స్టార్‌ పీవీ సింధు 14–21, 21–13, 10–21 తో సుపనిద (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. 

చదవండి: IPL 2022: ధోని ‘గుడ్‌ బై’.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement