
PAK VS ENG 2nd Test Day 3: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. చారిత్రక సిరీస్‌పై కన్నేసింది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి జోరుమీద ఉన్న స్టోక్స్ సేన.. రెండో టెస్ట్‌పై కూడా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 6 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్.. నాలుగో రోజు లంచ్ సమయానికే ఆట ముగించే అవకాశం ఉంది.
మరో పక్క ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పాకిస్తాన్‌కు సైతం అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు మరో 157 పరుగులు చేస్తే, సిరీస్ సమం చేసుకునే అవకాశం ఉంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ (60), సౌద్ షకీల్ (54 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. షకీల్‌తో పాటు ఫహీమ్ అష్రాఫ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్, ఆండర్సన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (108) సెంచరీతో చెలరేగగా.. బెన్ డకెట్ (79) అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4, జహీద్ మహమూద్ 3, నవాజ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు చాపచుట్టేయగా.. ఇంగ్లండ్ 281 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన అబ్రార్ అహ్మద్.. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 10 వికెట్ల ఘనత సాధించాడు.