
అంతా.. ఆరంభ శూరత్వమే
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు చూస్తున్నారు
చెత్త రీసైక్లింగ్ కేంద్ర నిర్వహణ బాధ్యతను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు చూస్తున్నారు. రీసైక్లింగ్ బాధ్యతా వాళ్లదే. కేంద్రాన్ని ఎప్పటి నుంచి నిర్వహణలోకి తీసుకురావాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి చెత్తను గుంటూరు తరలిస్తారనే అంశమై మాకెలాంటి సమాచారం లేదు.
– అనూష, మున్సిపల్ కమిషనర్
‘కందుకూరులో చెత్త అనేదే లేకుండా చేస్తాం.. ఏ రోజు చెత్తను ఆ రోజే రీసైక్లింగ్ చేసి చెత్త నుంచి సంపదను సృష్టించే బాధ్యత నాది’.. అంటూ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఫిబ్రవరి 15న నిర్వహించిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. అదే సమయంలో దూబగుంట వద్ద ఏర్పాటు చేసిన చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్నీ ప్రారంభించారు. అయితే ఇది జరిగి 45 రోజులు దాటినా నేటికీ వినియోగంలోకి రాలేదు.
కందుకూరు: పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన చెత్త రీసైక్లింగ్ కేంద్రం నిరుపయోగంగా మారింది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త టన్నూ తొలగలేదు. దీంతో స్వచ్ఛ కందుకూరు అంటూ చేసిన ఆర్భాటం మాటలకే పరిమితమైందే తప్ప చేతల్లో ఏ మాత్రం కానరావడం లేదు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించిన రీసైక్లింగ్ కేంద్రం వినియోగంలోకి రాకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హడావుడి చేయడం మినహా ఎలాంటి ఉపయోగంలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తలనొప్పిగా సమస్య
కందుకూరు మున్సిపాల్టీకి ప్రస్తుతం చెత్త సమస్య తలనొప్పిగా మారింది. దీని పరిధిలో 25 మెట్రిక్ టన్నుల వరకు చెత్త నిత్యం పోగవుతోంది. అయితే దీన్ని నిల్వ చేసేందుకు సరైన డంపింగ్ యార్డు సౌకర్యం లేదు. పట్టణంలోని యర్రగొండపాళెం సమీపంలో గల యార్డు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి తీసుకెళ్లే పరిస్థితే లేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బయటే చెత్తను మున్సిపల్ కార్మికులు పడేస్తున్నారు. మరోవైపు నివాసాల మధ్యలో యార్డు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తకు నిప్పంటుకొని రోజుల తరబడి కాలుతుండటంతో ఆ ప్రాంతాలు పొగతో నిండిపోతున్నాయి. అక్కడి నుంచి తరలించాలనే ప్రతిపాదన ఎంతో కాలంగా ఉన్నా, స్థల సమస్యతో కార్యరూపం దాల్చడంలేదు.
టన్ను చెత్తనూ ప్రాసెస్ చేయలేదు
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ కందుకూరు పర్యటనకు ఫిబ్రవరిలో సీఎం వచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా కనిగిరి రోడ్డులోని దూబగుంట వద్ద చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు రూ.45 లక్షలను వెచ్చించి యంత్రాలనూ నెలకొల్పారు. నిర్వహణ బాధ్యతను కండి మినరల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించేలా ఒప్పందమూ కుదిరింది. నిత్యం 24 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. అయితే దీన్ని ప్రారంభించి ఇప్పటికి 45 రోజులు దాటుతున్నా, ఒక్క టన్ను కూడా ప్రాసెస్ చేసిన దాఖలాల్లేవు. ఫలితంగా యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి.
గుంటూరుకు తరలించేలా..?
కందుకూరులో ప్రారంభించిన చెత్త రీసైక్లింగ్ కేంద్రం వినియోగంలోకి వచ్చే పరిస్థితే లేదనే వాదనా వినిపిస్తోంది. ఫలితంగా ఇక్కడి నుంచి గుంటూరు తరలించి అక్కడే రీసైక్లింగ్ చేసేలా స్వచ్ఛాంధ్ర అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కందుకూరు నుంచి వాహనాల ద్వారా చెత్తను గుంటూరులోని కేంద్రానికి నిత్యం తరలించాలనే ప్రణాళిక అధికారుల పరిశీలనలో ఉంది. కేవలం సీఎం పర్యటన కోసమే కొన్ని యంత్రాలను అక్కడ పెట్టి, స్వచ్ఛ కందుకూరు అంటూ హడావుడి చేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలూ లేకపోలేదు.
వినియోగంలోకి రాని
చెత్త రీసైక్లింగ్ కేంద్రం
ఫిబ్రవరి 15న ఆర్భాటంగా
ప్రారంభించిన సీఎం
ప్రజాధనం వృథా
కందుకూరులో ఇదీ దుస్థితి

అంతా.. ఆరంభ శూరత్వమే