అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
దుత్తలూరు: విద్యుదాఘాతానికి గురై వెంగమాంబ దేవస్థాన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి నర్రవాడలో జరిగింది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. నర్రవాడకు చెందిన ఉదయగిరి సురేష్ (38) వెంగమాంబ పేరంటాలు ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
సోమవారం రాత్రి ఆలయానికి సమీపంలో ఉన్న కొబ్బరికాయల దుకాణం వద్ద నిర్వాహకులు వెల్డింగ్ పనులు చేయిస్తున్నారు. ఆ సమయంలో సురేష్ అక్కడున్న ఇనుప పైపును పట్టుకుని వెల్డింగ్ పనుల్ని చూస్తున్నాడు. అనుకోకుండా ఆ పైపునకు విద్యుత్ సరఫరా కావడంతో సురేష్ షాక్‌కు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు.
108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సురేష్ మృతిచెందినట్లు నిర్ధారించారు. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. మంగళవారం ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయి ంచి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.