కూటమి కుట్రలపై న్యాయ పోరాటం | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలపై న్యాయ పోరాటం

Published Thu, Apr 3 2025 12:24 AM | Last Updated on Thu, Apr 3 2025 12:24 AM

కూటమి కుట్రలపై న్యాయ పోరాటం

కూటమి కుట్రలపై న్యాయ పోరాటం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అధికార పార్టీ చేస్తున్న కుట్రలపై న్యాయ పోరాటం చేస్తానని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో మైనింగ్‌కు సంబంధించి ఫిబ్రవరి 12, 14వ తేదీల్లో వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిపై చార్జీషీట్లు పెట్టి ఫిబ్రవరి 16వ తేదీన తనను నిందితుడిగా చేర్చారన్నారు. తాను ఈ కేసుపై 19వ తేదీన హైకోర్టును ఆశ్రయించానన్నారు. 24వ తేదీన కోర్టు ముందస్తు బెయిల్‌ ఇస్తూ పోలీసులకు సహకరించాలని సూచించిందన్నారు. అప్పటి నుంచి తనను ఏ అధికారి పిలవడం, విచారించడం కానీ జరగలేదన్నారు. అలాంటప్పుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో తాను అప్రూవర్‌గా మారారంటూ తనపై ఓ ఎలక్ట్రానిక్‌ ఛానల్‌ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. తాను అప్రూవర్‌గా మారుతున్నట్లు అధికారులు, పోలీసులకు చెప్పినట్లు, ఎవరి పేరునైనా చెప్పినట్లు వారి దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే బయట పెట్టాలన్నారు. అప్పటి మైనింగ్‌ డీడీ శ్రీనివాస్‌కుమార్‌, ప్రస్తుత డీడీ బాలాజీనాయక్‌లకు ఈ కేసుపై అసలు స్పష్టతే లేదన్నారు. పొంతన లేని నోటీసులతో తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డికి మైనింగ్‌ డీడీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చి రూ.7.56 కోట్లు పెనాల్టీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత బాలాజీనాయక్‌ తన పేరును కూడా చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. విద్యాకిరణ్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు బనాయించారన్నారు. అసలు ఓనరే లేని మైన్స్‌లో అక్రమాలు జరిగాయని కేసు పెట్టడం దారుణమన్నారు. ఓనర్‌ లేనప్పుడు ఆ భూమి ప్రభుత్వానిదని, అందులో ఖనిజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మైనింగ్‌ అధికారులదేనన్నారు. అయితే అధికారులు స్పష్టత లేకుండా వెంట వెంటనే ఫిర్యాదులు మార్చి మార్చి చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మాజీ మంత్రి కాకాణి నియోజకవర్గంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తామేదో చేశామని బురదజల్లే ప్రయత్నం తప్ప ఇందులో వాస్తవాలు ప్రజలందరికీ తెలుసన్నారు. అప్రూవర్‌గా మారితే ఏ1గా తనను ఎందుకు చేరుస్తారని ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు చేయడం మానాలన్నారు. రాజకీయ పరంగా ఎవరెటు పోతే ఎందుకులే అనే మనస్తత్వం తనది కాదని, విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చానన్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయం చేసే క్రమంలో 8 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. కచ్చితంగా ఈ కేసులో ఏ1గా పెట్టడం రాజకీయమేనని, ఊరికే పార్టీలు మారే తత్వం తనది కాదన్నారు.

కేసుపై మైనింగ్‌ అధికారులకే

స్పష్టత లేదు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement