
స్కూటీ కటౌట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీలు కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ
మండలి ఆవరణలో ప్లకార్డులతో బీఆర్‌ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. స్కూటీల ఆకారంలో ఉన్న ప్లకార్డులతో సభ ఆవరణకు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీ నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.
‘ప్రియాంకగాందీ.. స్కూటీలు ఎక్కడ?’అంటూ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు నినాదాలు చేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద కవిత మాట్లాడుతూ కల్యాణమస్తులో భాగంగా తులం బంగారం ఇవ్వలేమన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పనిచేస్తోందన్నారు.
సమస్యలకు కేంద్రంగా తెలంగాణ..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్లీ సమస్యలకు కేంద్రంగా మార్చుతోందని శాసనమండలి బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ సభలో తామిచ్చిన హామీలు అమలు చేయలేమని స్వయంగా వారే ఒప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.