
జాతీయ స్థాయిలో స్పందిస్తున్న భిన్న రంగాల ప్రముఖులు
పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడవద్దంటూ పిలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. విద్యార్థుల నిరసనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వారికి మద్దతుగా సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, భిన్న రంగాల ప్రముఖులు గొంతు కలుపుతున్నారు. దీనితో హెచ్‌సీయూ భూముల అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మారుస్తోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం..: హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా సినీహీరో రాంచరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. ‘‘జంతువులు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? మనం చెట్టును ఎక్కడ తిరిగి నాటుతున్నాం? దీనిపై మీ భవిష్యత్తు ప్రణాళికను పంచుకోండి. అటవీ ప్రాంతాన్ని నిర్మూలించిన తర్వాత ఏం చేయబోతున్నారు’అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టారు. ప్రముఖ నటి సమంత కూడా ఈ అంశంపై స్పందించారు.
గచ్చిబౌలిలో జీవవైవిధ్యమున్న భూమిని ధ్వంసం చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందంటూ.. పర్యావరణ ప్రభావాలపై ఓ ఆంగ్లపత్రిక నివేదికను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. ఇది మంచిది కాదు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు అండగా నిలుస్తాను. భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ నిరసన తెలపాలి’’అని పిలుపునిచ్చారు.
ఇక.. ‘‘పర్యావరణ భవిష్యత్తు కోసం విద్యార్థులు గళం విప్పుతున్నారు. యువతకు సుస్థిరమైన రేపటికి అవకాశం కల్పిoచేవి ఐటీ పార్కులు కాదు, అరణ్యాలే. జీవవైవిధ్యాన్ని పణంగా పెట్టి చేసేది అభివృద్ధి కాదు వినాశనం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో కంచ ఫారెస్ట్‌ను కాపాడండి’’అని బాలీవుడ్ నటి దియా మీర్జా పేర్కొన్నారు. వీరితోపాటు నటి ఈషా రెబ్బా, బిందు మాధవి కూడా విద్యార్థులకు మద్దతుగా ప్రకటనలు చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ నేరుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

టీవీ, సోషల్ మీడియా ప్రముఖులు సైతం..
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, నటి రష్మీ గౌతమ్ తదితరులతోపాటు పలువురు టీవీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. చాలా మంది నెటిజన్లు తమ ఇన్‌స్ట్రాగామ్ పోస్టుల్లో ‘ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’వంటి నినాదాలను షేర్ చేస్తున్నారు.