TG: రైతులకు శుభవార్త.. మూడో విడతలో రుణమాఫీ నిధులు విడుదల | CM Revanth Reddy Released Two Lakhs Runa Mafi In Telangana | Sakshi
Sakshi News home page

TG: రైతులకు శుభవార్త.. మూడో విడతలో రుణమాఫీ నిధులు విడుదల

Published Thu, Aug 15 2024 4:46 PM | Last Updated on Thu, Aug 15 2024 5:27 PM

CM Revanth Reddy Released Two Lakhs Runa Mafi In Telangana

సాక్షి, వైరా: తెలంగాణలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు. 14.45లక్షల మంది రైతులకు మూడో విడతలో రుణాలను విడుదల చేశారు. ఇక, ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో రూ.12వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.

👉వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 140 కోట్ల మంది స్వేఛ్చావాయువులు పీల్చేలా కాంగ్రెస్‌ స్వాతంత్ర్యం తెచ్చింది. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్‌కు అడ్డా. వరంగల్‌ డిక్లరేషన్‌లో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్‌ మాట్టిచ్చారు. మే 6, 2022న రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. ఎనిమిది నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఈరోజు రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం.. చేశాం. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని చెప్పాం.. చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నాం. 

మేం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ ఓర్వలేకపోతుంది. బీఆర్‌ఎస్‌ బతుకు బస్టాండ్‌ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటు. సీతారామ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత మాది. 2026 కల్లా సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 3400 ఇళ్లను మంజూరు చేశాం. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇచ్చారు. ఆ గ్యారంటీలను అమలు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. 65వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు గాడిత గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి.  బీఆర్‌ఎస్‌ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం. 

👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేడు చరిత్రలో లిఖించదగిన రోజు. సాధ్యం కాదన్న రూ.2లక్షల రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. రుణమాఫీ చేయలేమని అందరూ అన్నారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. సంకల్పాన్ని నిజం చేశాం. కేసీఆర్‌ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే.. ఆ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేదు. సీఎం రేవంత్‌ ఆదేశించిన మరుక్షణమే రైతుల ఎకౌంట్లలోకి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ ఒక్కటే కాదు.. రైతుల సమస్యలపై కూడా దృష్టిపెట్టాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ శాఖకు నిధులు కేటాయించాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు మధ్య తేడాను చూడండి. 

రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు రుణమాఫీనే నిదర్శనం. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్‌ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కీలక అడుగులు వేస్తున్నాం. రూ.36వేల కోట్ల పెట్టుబడులను సీఎం తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా చేయాలని బీఆర్‌ఎస్‌ కుట్రలు చేసింది. ఇందిరాసాగర్‌ను రీడిజైన్‌ చేసి ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచారు. రూ.1000 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.23వేల కోట్లకు పెంచారు. డబ్బులు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. సీతారామ ప్రాజెక్ట్‌ కేసీఆర్‌ మానసపుత్రిక అని మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరాకు కూడా సీతారామ ప్రాజెక్ట్‌ నుంచి నీళ్లు ఇవ్వలేదు. దోపిడీ చేయడం కోసమే వాళ్లకు మానసపుత్రిక. గోదావరిపైనే ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌తో రూ.23వేల కోట్లకు అంచనాలు పెంచి దోపిడీ చేశారు. కాంగ్రెస్‌ ఎక్కువ ప్రాజెక్ట్‌లు కట్టిందా? బీఆర్‌ఎస్‌ ఎక్కువ కట్టిందా? అనే చర్చకు సిద్ధం. 

👉మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. తెలంగాణలో రైతులకు ఈరోజు పండుగ రోజు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నాలుగుసార్లు రుణమాఫీ చేస్తే మిత్తిలకు కూడా సరిపోలేదు. రూ.31వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకం. ఆరేళ్లలోనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఎంత ఖర్చు అయినా సరే మిగిలిన పనులు పూర్తి చేస్తాం.

👉మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్‌ ప్రారంభించుకోవడం సంతోషకరం. తెలంగాణలో మార్పు కోసమే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఎన్నికల కష్టాలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది.

👉మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.2లక్షలు రుణమాఫీ చేయలేదు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది. గతంలో సీతారామ ద్వారా బీఆర్‌ఎస్‌ ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. 
ఇందిర, రాజీవ్‌ ప్రాజెక్ట్‌లను రీడిజైన్‌ చేసి సీతారామ తెచ్చారు. సీతారామ ప్రాజెక్ట్‌ను పదేళ్లు సాగదీస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీతారామ పనులు వేగవంతం చేశాం. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేస్తాం.

👉మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని తీసుకొచ్చాం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తికి కట్టుబడి ఉన్నాం అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement