మిల్లర్లు చెప్పిందే రేటు | Officials ignore the Millers Syndicate | Sakshi
Sakshi News home page

మిల్లర్లు చెప్పిందే రేటు

Published Mon, Apr 7 2025 4:42 AM | Last Updated on Mon, Apr 7 2025 4:42 AM

Officials ignore the Millers Syndicate

పదిరోజుల కిందట సన్నాలకు క్వింటాల్‌కు రూ. 2,600... ఇప్పుడు రూ. 2,200 

ఏపీ నుంచి వస్తున్న ధాన్యం, వాతావరణ పరిస్థితులతో భయపడుతున్న రైతులు  

గత్యంతరం లేక, వేచి ఉండలేక తక్కువ ధరకే మిల్లర్లకు అమ్మకం 

మిల్లర్ల సిండికేట్‌ను పట్టించుకోని అధికారులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మిల్లర్లు సిండికేట్‌గా మారి ధాన్యం ధర తగ్గించేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మిల్లులున్న మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లో వారు చెప్పిందే రేటుగా సన్నధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 150కి పైగా మిల్లుల్లో పది రోజుల కిందటే కొనుగోళ్లు ప్రారంభమైనా, ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రం సన్న ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదు. 

జిల్లాలో సన్న ధాన్యం కోసం 75 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, మూడు రోజుల క్రితం ఐదు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. వాటిల్లోనూ ఇంకా కొనడం లేదు. దీంతో రైతులు మిల్లుల్లోనే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. పది రోజుల కిందట మిల్లర్లు సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.2,600 వరకు ధర చెల్లించినా, ఇప్పుడు ధాన్యం ఏపీ నుంచి అధికంగా వస్తుండటంతో ఇక్కడ ఒక్కసారిగా ధర తగ్గించేశారు. క్వింటాల్‌కు రూ.2,200లోపే చెల్లిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.  

ఒక్కసారిగా పోటెత్తడంతో ధర తగ్గింపు 
ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా వర్షం పడితే ధాన్యం తడిచిపోతుందనే భయంతో రెండు రోజులుగా రైతులు ధాన్యం ట్రాక్టర్లతో మిల్లులకు పోటెత్తారు. అదే అదనుగా వివిధ రకాల కొర్రీలు పెడుతూ ధర తగ్గించేశారు. మద్దతు ధర గ్రేడ్‌–ఏ రకానికి (సన్న ధాన్యం) రూ.2,320గా ప్రభుత్వం నిర్ణయించింది. ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.2,320 మద్దతు ధరతోపాటు రూ.500 చొప్పున బోనస్‌ వస్తుంది. ఈ లెక్కన రైతుకు క్వింటాల్‌కు రూ.2,820 ధర లభిస్తుంది. 

అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాలంటే రోజుల తరబడి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టాల్సి వస్తుంది. ధాన్యంలో తేమ 17 శాతం వరకు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు చేయడంతోపాటు బోనస్‌ చెల్లిస్తుంది. ఈ క్రమంలో వర్షం పడి ధాన్యం తడిచిపోతే ఇక అంతే సంగతులు. పైగా జిల్లాలో ప్రభుత్వ పరంగా సాధారణ రకం ధాన్యం కొనుగోళ్లలోనే వేగం పుంజుకోలేదు. ఇక సన్నధాన్యం కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. ఈ బాధలన్నీ పడలేక రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. 

పచ్చ గింజ, పేరు పేరుతో ధర తగ్గింపు 
నాగార్జునసాగర్‌ ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లాలో బోరుబావుల కింద సాగు చేసిన రైతులు మిర్యాలగూడ మిల్లుల్లో అమ్ముకునేందుకు నిత్యం వందల ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొస్తున్నారు. పది రోజుల కిందట ధాన్యం తక్కువగా రావడంతో కావేరి, చింట్లు, చిట్టిపొట్టి, హెచ్‌ఎంటీ వంటి రకాల ధాన్యం క్వింటాల్‌ ధర రూ.2,600వరకు చెల్లించారు. 

ఇప్పుడు ధాన్యం రాక పెరగడంతో మిల్లర్లు సిండికేట్‌ అయ్యారు. ఏ రోజుకు ఆరోజు వారే ధర నిర్ణయించి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఏ మిల్లుకు వెళ్లినా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ధాన్యం పచ్చిగా ఉందని, తాలు ఉందని, ఎక్కువ డ్రై అయ్యిందంటూ కొర్రీలు పెడుతూ రూ.2,200లకు మించి చెల్లించడం లేదు.  

ఏపీ నుంచి జోరుగా వస్తున్న ధాన్యం 
కోదాడ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, హాలియా ప్రాంతాల్లోని మిల్లులకు ఏపీలోని నంద్యాల, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి సన్న ధాన్యం లారీలు పెద్ద ఎత్తున వస్తున్నట్టు తెలిసింది. అందువల్లే మిల్లర్లు ధర తగ్గించేసి కొనుగోళ్లు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాకు రాకుండా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించి వదిలేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఏపీ నుంచి ధాన్యం రావడంతో ధాన్యం ధర తగ్గించారని, ఫలితంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.  

ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు
వరికి గిట్టుబాటు ధర రావడం లేదు. పదేళ్లలో ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు. 12 ఎకరాల్లో చింట్లు సాగుచేశా. క్వింటాల్‌కు రూ.2,140లే చెల్లించారు. అకాల వర్షాల భయంతో మిల్లులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.  – కలారి లింగయ్య, అన్నారం 

ఐదారు మిల్లులు తిరిగా..
ఏ మిల్లు వద్దకు వెళ్లినా కొర్రీలే. మేం పండించిన చింట్లు బాగానే ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు. తక్కువ ధరకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొనమని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులకు ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. 
– లావూరి లింగా, వాచ్యాతండా 

ఏదో కారణంతో తగ్గిస్తున్నారు 
నాకున్న నాలుగు ఎకరాల్లో చింట్లు పండించా.పచ్చిగా ఉంటే పచ్చిగా ఉన్నాయని, డ్రైగా ఉంటే ఎక్కువ డ్రై అయ్యాయని చెప్పి ధర తగ్గిస్తున్నారు. గత్యంతరం లేక క్వింటాకు రూ.2,200కే అమ్ముకున్నా.  – కోడిరెక్క ప్రవీణ్, శెట్టిపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement