
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటికి వెళ్లారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని మరోసారి ఆయనకు నోటీసులు అందజేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని తెలిపారు.
కాగా పేపర్ లీకేజీ వ్యవహారంలో గతంలో ఆయనకు మొదటిసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 24న తమ ముందు హాజరు కావాలని కోరారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. సిట్ విచారణకు బండి సంజయ్ హాజరు కాని నేపథ్యంలో.. ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సిట్ అధికారులు.
తనకు నోటీసులు అందలేదని, మీడియాలో వచ్చిన వార్తల మేరకు స్పందించానని బండి సంజయ్ పేర్కొన్నారు. సిట్ విచారణపై నమ్మకం లేదన్న ఎంపీ.. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదని తెలిపారు. తనకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం ఇస్తానని.. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.