ఖజానాకు భూమ్‌ | TGIIC Lands Are Key to Govt Revenue: Telangana | Sakshi
Sakshi News home page

ఖజానాకు భూమ్‌

Published Sat, Apr 12 2025 1:41 AM | Last Updated on Sat, Apr 12 2025 1:42 AM

TGIIC Lands Are Key to Govt Revenue: Telangana

రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్నిసమకూర్చడంలో కీలకంగా టీజీఐఐసీ భూములు

నంబర్‌ 1 లక్షన్నర ఎకరాల పారిశ్రామిక ల్యాండ్‌ బ్యాంకుతో టాప్‌లో తెలంగాణ

తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు  

నిధులు అవసరమైనప్పుడల్లా టీజీఐఐసీ భూముల వైపే ప్రభుత్వాల చూపు 

వేలం, కేటాయింపుల ద్వారా రూ.వేల కోట్లు సమకూర్చుకుంటున్న వైనం 

2014–23 మధ్యకాలంలో 811 ఎకరాల వేలం ద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయం 

2023లో కోకాపేట, ఖానామెట్‌ భూముల ద్వారా దాదాపు రూ.3 వేల కోట్ల రాబడి 

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల తాకట్టు ద్వారా రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ! 

ఇవే భూముల వేలం ద్వారా రూ.30 వేల కోట్ల వరకు నిధుల సమీకరణకు ప్రతిపాదన  

రాష్ట్రంలో వివాదాస్పదం అవుతున్న భూముల వేలం, కేటాయింపులు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యధికంగా పారిశ్రామిక ల్యాండ్‌ బ్యాంక్‌ను కలిగిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ).. రాష్ట్ర ఖజానాకు బంగారు బాతులా మారింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో సర్కారుకు కల్పతరువులా ఉపయోగపడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం వంటి రిజర్వు బ్యాంకు నిబంధనల పరిధిలోకి రాకుండా రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో టీజీఐఐసీ భూములు అత్యంత కీలకంగా మారుతున్నాయి.

నిధులు అవసరమైనప్పుడల్లా పారిశ్రామిక అభివృద్ధి పేరిట టీజీఐఐసీ భూముల వేలం వైపు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టుతో టీజీఐఐసీ ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల రుణం సమకూర్చినట్లు అధికార వర్గాల సమాచారం. అంతకుముందు కూడా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇటీవలి కాలం వరకు టీజీఐఐసీ భూముల ద్వారా రూ. వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వాలు సమకూర్చుకోవడం గమనార్హం. 

సొంతగా, హెచ్‌ఎండీఏతో కలిసి..: తెలంగాణ ఆవిర్భావం మొదలుకుని 2023 వరకు టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి  రూ.21 వేల కోట్లు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ కొన్నిసార్లు సొంతగా, మరికొన్ని సందర్భాల్లో హెచ్‌ఎండీఏతో కలిసి భూములు వేలం వేయడంతో పాటు పరిశ్రమలకు భూముల కేటాయింపులు జరిపింది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా వివిధ సందర్భాల్లో 811 ఎకరాలను వేలం వేయడం లేదా కేటాయింపుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి పేరిట.. 
    హైదరాబాద్‌ పరిసరాల్లోని కోకాపేట, ఖానామెట్‌ భూములు వేలం వేయడం ద్వారా రూ.10 వేలు కోట్లు సమీకరణ లక్ష్యంగా 2019లో సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు 2023లోనే జరిగిన భూముల వేలం ద్వారా రూ.2,729 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల అభివృద్ధి కోసం ఈ భూములను వేలం వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. వేలం ద్వారా సమకూరిన నిధులను రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు కోసం వెచ్చించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.  

400 ఎకరాల తనఖాతో.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలి సర్వే నంబరు 25(పి)లోని 400 ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ చేసింది. రైతు భరోసా ఇచ్చేందుకు ఈ నిధులు వెచ్చిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత తాకట్టులో ఉన్న ఇవే భూములను అభివృద్ధి చేసి వేలం వేయడం ద్వారా రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల మేర నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలే తాజాగా పెద్దయెత్తున వివాదానికి కారణమయ్యాయి. 

టాప్‌లో టీజీఐఐసీ  
పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని అనేక రాష్ట్రాలు మౌలిక సదుపాయాల సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో టీజీఐఐసీ ఏర్పాటైంది. అయితే దేశంలోని ఇతర సంస్థలతో పోల్చుకుంటే టీజీఐఐసీ వద్ద అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు ఉన్నట్టు సమాచారం. ల్యాండ్‌ బ్యాంకు పరంగా చూస్తే తెలంగాణ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (ఎంఐడీసీ– 48,437 ఎకరాలు), తమిళనాడు (సిప్‌కాట్‌– 48,198 ఎకరాలు) ఉన్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థలు గణనీయంగా ల్యాండ్‌ బ్యాంక్‌లను కలిగి ఉన్నాయి.  

మేడ్చల్‌ –సిద్దిపేట జోన్‌లో ఏకంగా 42,431 ఎకరాలు 
    టీజీఐఐసీ పరిధిలో సైబరాబాద్, మేడ్చల్‌–సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, పటాన్‌చెరు, శంషాబాద్, యాదాద్రి, ఖమ్మం, వరంగల్‌..ఇలా తొమ్మిది పారిశ్రామిక జోన్లు ఉన్నాయి. అయితే ఒక్క మేడ్చల్‌– సిద్దిపేట జోన్‌లోనే ఏకంగా 42,431 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ లెక్కల ప్రకారం తెలంగాణలో 71,613 ఎకరాల్లో ఐటీ, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 53,550 ఎకరాల్లో ఐటీ, ఐటీ అనుబంధ సేవలకు చెందిన సంస్థలు ఉన్నాయి. 2,634 ఎకరాల్లో ఎల్రక్టానిక్స్, హార్డ్‌వేర్‌ సంస్థలు, మరో 10,039 ఎకరాల్లో రక్షణ, ఏరోస్పేస్, ఆహార ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్‌ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement