రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను దారుణంగా వంచించాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెబితే.. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడం ఏమిటని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఏమైనా చంద్రబాబు నాన్నగారి సొత్తా? అత్తగారి సొత్తా? అని నిప్పులు చెరిగారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కు అంటూ విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ప్యాకేజీ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ఎండగట్టారు