సంస్కృతి, సంప్రదాయాలకు, పురాణాలు, చరిత్రకు, ఆలయాలు, ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు నెలవుగా, విభిన్న వర్గాల సమూహారంతో, మాతృ భాషాభిమానం మెండుగా నిండిన తమిళావని వేదికగా చైనా, భారత్ దేశాల అగ్రనేతలు జిన్‌పింగ్, మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మామల్లపురం (మహాబలిపురం)ను సందర్శించారు. ఇక్కడి చరిత్రను మోదీ వివరించగా, జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. తమిళ సంప్రదాయానికి అద్దం పట్టే రీతిలో పంచెకట్టుతో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, చెన్నైలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆహ్వానాలు పలుకుతూ, అభిమానాన్ని చాటుకున్నారు.