-
'నిజాయితీ'..! ఒక రాజు.. అంతు చిక్కని రోగంతో..
అనగనగా ఒక రాజు. అతనో అంతు చిక్కని రోగంతో బాధపడసాగాడు. తానింక ఎన్నో రోజులు బతకనని అతనికి అర్థమైంది. అందుకే తను బతికుండగానే.. రాజ్యానికి నిజాయితీపరుడైన యువరాజును ఎన్నుకోవాలనుకున్నాడు. మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి.. యువరాజు ఎంపిక విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, దాన్ని నాటమని చెప్పి.. పదిరోజుల తర్వాత మొలకెత్తిన ఆ మొక్కను తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి యువరాజు అవుతాడు’ అని సెలవిచ్చాడు రాజు. ‘అలాగే రాజా..’ అంటూ అందరూ ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్లి మట్టి కుండల్లో వేశారు.పది రోజుల తర్వాత వాళ్లంతా ఆ మట్టికుండలను తీసుకుని రాజుగారి కొలువుకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. రాజు అందరి కుండలను పరిశీలించి.. ఖాళీ కుండ తెచ్చిన మహేంద్రనే యువరాజుగా ప్రకటించాడు. ఆ మాట విన్న మిగతా యువకులంతా విస్తుపోయారు. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి ‘రాజా! మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో వారే కదా యువరాజు! మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి. పోటీ మా మధ్యనే ఉండాలి. కానీ విత్తనమే మొలకెత్తని మహేంద్రను యువరాజుగా ఎలా ప్రకటిస్తారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. వాటి నుంచి మీ అందరి కుండల్లోకి మొక్కలు ఎలా వచ్చాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు రాజు. ఆ ఎదురు ప్రశ్నకు ఆ యువకులంతా బిత్తరపోయారు. తాము చేసిన మోసాన్ని రాజు గ్రహించాడని వాళ్లకు తెలిసిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నారు! వాళ్లంతా రాజు ఇచ్చిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను నాటారు. అందుకే అవి మొలకెత్తి ఏపుగా పెరిగాయి. మహేంద్ర మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్నే వేశాడు. అందుకే అది మొలకెత్తలేదు.అతని నిజాయితీని మెచ్చిన రాజు.. ఆ రాజ్యానికి సమర్థుడైన పాలకుడు మహేంద్రనే అని అతన్నే యువరాజుగా ప్రకటించాడు. తదనంతర కాలంలో ఆ రాజ్యానికి మహేంద్ర రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజలకు ఏ లోటూ రానివ్వకుండా పాలన సాగించాడు. – పుల్లగూర్ల శీర్షికఇవి చదవండి: 'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. -
పాతకాలం వుడెన్ వస్తువులే.. అయినా ఇంత అందంగా!
రీసైక్లింగ్ అనేదిప్పుడు గృహాలంకరణలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. కలపే కాదు ఫ్యాబ్రిక్ కూడా అందులో భాగమైంది. రీసైకిల్ వుడెన్ ఫర్నిచర్‌తోపాటు పాతకాలం వుడెన్ వస్తువులు కొద్దిపాటి మార్పుచేర్పులతో అద్భుతమైన షోపీసెస్గా అమరిపోతున్నాయి.ఇంట్లోని రకరకాల ఫ్యాబ్రిక్స్ కూడా! పలు కళాత్మక రూపాలుగా కొలువుదీరి ఇంటి హోదాను.. విలువను పెంచుతున్నాయి. ఇలా రీసైక్లింగ్ మెటీరియల్‌తో విండో బ్లైండ్స్ నుంచి ఆరుబయట అలంకారాల వరకు ప్రతీదాంట్లోనూ మనదైన సృజనను చూపించవచ్చు.విండోస్‌కి జూట్, ఆకులతో అల్లిన చాపలను ఉపయోగించవచ్చు. వెదురుతో చేసిన రకరకాల వస్తువులు, ఫర్నిచర్‌ను బాల్కనీలో అమర్చుకోవచ్చు. వీటివల్ల ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యామనే ఆనందమూ మిగులుతుంది.ఇవి చదవండి: అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు -
'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా..
ఆమెతో బోసుకి చిత్రంగా పరిచయం అయింది. ఒక సాయంత్రం, అతని ఇంటికి కొద్ది దూరంలో, ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. అతనిని ఆపి, ఒక డజను అరటిపండ్లు కొనమని అడిగింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒక్క రోజు కనిపించక పొతే ఆపి మరీ ‘ఏంటి బొత్తిగా నల్లపూస అయ్యావు?’ అనడిగేసేది. ఆ గదమాయింపులో అతనికి ఏదో ఆత్మీయత కనిపించేది.బోసు మొదటి అంతస్తులోని తన పోర్షన్‌కి వెళ్ళి తలుపు తెరిచాడు. భుజమ్మీద నుంచి ఆఫీస్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్న దివాన్ మీద పెట్టాడు. అరటిపండ్లు ఉన్న బాగ్, పులిహోర ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటకి వచ్చాడు.వీధి చివరి వరకు నడిచిన తర్వాత, ఎదురుగా వస్తున్న ఆమెను గుర్తించాడు. పీలగా, బలహీనంగా ఉన్న ఆమె అతని వైపు వచ్చింది. బోసు కదలలేదు. కానీ ఆవిడ అతని ముందు అలాగే నిలబడి ఉంది. కొన్ని సెకన్ల పాటు! ఆమె ముఖం అభావంగానే ఉంది. ఆమె చూపులు అతని చేతిలో ఉన్న బాగ్ మీద పడ్డాయి. అంతే ఆమె ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో బోసుకు తెలుసు. అందుకే అతను ఆ చేతిని పట్టుకున్నాడు. ఆమె చూపులు మటుకు అతడు పట్టుకున్న గుడ్డ సంచిపైనే ఉన్నాయి.‘ఇదిగో మీ అరటిపండ్లు’ బోసు అన్నాడు. ‘ఓ! మళ్ళీ అడగకుండానే తెచ్చావు’ అంది ఆమె. బోసు ‘ఎస్’ అంటూ అభిమానంగా నవ్వాడు. ఎందుకో తెలియదు కానీ ఆమెతో గడపడం అతనికి చాలా ఇష్టం. ఎవరో అన్నట్లు కొన్నింటికి లాజిక్కులు ఉండవు. ఆమె తోడు కోసం కింద భాగం ఇంటిని అద్దెకు ఇచ్చింది. ఆమెకు వంట చేసుకోవడం కుదరకపోవడంతో, పనివాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళు కారాలు ఎక్కువేయడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఎక్కువ పండ్లు మాత్రమే తింటోంది. వాటిల్లో అరటిపండ్లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రోజూ ఆఫీసు నుండి వచ్చాక బోసు.. ఆమెతో కలసి వాకింగ్‌కి వెళ్ళేవాడు. ఆ వాకింగ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆమె తన వ్యక్తిగత వివరాలను కొన్ని అతనికి చెప్పింది. ఆమె ఒక టీచర్. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగింది. ఆమెకు సుడోకు అంటే ఇష్టం.‘నేను మీ కోసం ఇంకోటి తెచ్చాను’ అంటూ బోసు మళ్ళీ బ్యాగ్ తీశాడు. ‘అదేంటో?’ ఆమె ముఖం చిన్నపిల్లలా అయోమయంగా కనిపించింది.‘అప్పుడెప్పుడో మీరు పిజ్జా తినాలనుంది అన్నారుగా! తెచ్చాను’ బోసు చెప్పాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించి, ‘థాంక్యూ.. థాంక్యూ’ సంబరపడిపోయింది.అయితే బోసుకి నిరాశగా అనిపించింది. తానేమి ఆశించాడు? ఉద్వేగంతో గెంతుతుందనా? ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుందనా? కొన్నిసార్లు ఆఫీస్ వేళల్లో అతని మనస్సు ఆమె వైపు మళ్లుతుంది. అయితే ఇవేమీ తెలియని ఆమె తన ప్రపంచంలో తానుంటుంది. నిజానికి ఆమె నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.కొన్నిసార్లు ఆమెను కలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తాడు. ఆమె ఒంటరిగా ఉంటోంది. బోసు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నాడో అతనికే తెలియదు. తెలియకుండానే అనుబంధం పెంచుకున్నాడు. ఏదో తెలియని పాశం ఆమె వైపు సూదంటు రాయిలా లాగుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలని బోసు చాల తహతహలాడుతున్నాడు. అడిగేతే బావుంటుందా? తననూ మగవాళ్లందరిలో ఒకడిగా జమకట్టి.. తనతో స్నేహం మానేస్తే..! ఆ ఆలోచనే భరించలేకపోయాడు. కాని అతని కుతూహులం నస పెడుతూనే ఉంది.. ఆమె కథ ఏమై ఉండొచ్చు? అని! అయితే ఈమధ్యనే ఆమె గురించి ఒక విషయం తెలిసింది. అప్పటి నుంచి మనిషి మనిషిగా లేడు. తన వస్తువును తనకు కాకుండా చేస్తున్న ఫీలింగ్. ఒక రకమయిన పొసెసివ్‌నెస్ వచ్చేసింది.రెండు రోజులుగా ఆమెను కలవలేదు. ఆ రోజు ఆదివారం.. ఆఫీస్‌కి సెలవు. దానికి తోడు పెద్ద వాన. కిటికీలోంచి ముత్యాల సరాలులా పడే వానని చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చింది. ఆమెకి బాగా జబ్బు చేసిందని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనిషి నీరసించి ఉంది. అసలే బక్కపల్చటి మనిషి.. ఈ రెండు రోజుల అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసినట్టుంది. దగ్గరగా వెళ్ళి సన్నగా పుల్లలా ఉన్న చేయి పట్టుకుని ఆప్యాయంగా అడిగాడు ‘ఎలా ఉంది? నాకు కబురు పంపిస్తే వచ్చేవాడిని కదా! నేను నీకేమీ కానా?’ అంటూ.ఆ ప్రేమకి అభిమానానికి కరిగిపోయింది ఆమె. అదేం కాదననట్లు తల అడ్డంగా ఊపింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. ‘కాసేపు కింద గార్డెన్‌లోకి వెళదాం. నాకు ఇక్కడ ఊపిరి ఆడటం లేదు’ అంది.‘సరే’ అని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ సాయంకాలం.. వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య బోలెడు కబుర్లు దొర్లాయి. ఆమె బలహీనమైన చేయి అతని చేతిలో ఉంది.‘నేను పెళ్ళి చేసుకోలేదు!’ ‘మీకు పెళ్ళయిందా? మీ వాళ్ళంతా ఎక్కడున్నారు?’ కాసేపటి క్రితం బోసు అనాలోచితంగా అడిగిన ఆ ప్రశ్నకు ఇప్పుడు జవాబు ఇచ్చింది.ఆశ్చర్యపోయాడు బోసు. మరి తను ఆ రోజు చూసిందేమిటి? ఆ దృశ్యాలు తనకిప్పటికీ గుర్తున్నాయి. ఆమె ఆ పిల్లలను కలుసుకోవడం గురించి ఎందుకు చెప్పటం లేదు? ఆమె ఎప్పుడైనా అలా చెప్పిందా, లేదా తను ఊహించుకున్నాడా? ఆమె డిమెన్షియాతో బాధపడుతోందా? అని మథనపడుతూనే ‘మరి ఆ పిల్లలు?’ అడిగాడు అప్రయత్నంగానే! ‘వాళ్ళు నావాళ్ళు కాదు’ అని చెప్పి వెంటనే ‘అంటే నా పిల్లలే, కానీ నేను వాళ్ళకి బయోలాజికల్ మదర్ని కాను’ అన్నది.బోసుకి గందరగోళంగా అనిపించింది, ‘మీరు వారిని దత్తత తీసుకున్నారా? క్లారిటీగా చెప్పండి’ బతిమాలుతున్నట్టుగా అడిగాడు.ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ, ‘ఎక్కడయినా కూర్చుందాం. నా కాళ్ళు లాగుతున్నాయి’ అన్నది. ‘ఓ! సారీ.. పదండి’ అంటూ దగ్గరే ఉన్న బెంచ్ వైపు కదిలారు. ‘నేను ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేను’ బెంచ్ మీద కూర్చుంటూ చెప్పింది. ‘అయ్యో సారీ.. నాకు తట్టనే లేదు’ నొచ్చుకుంటూ అన్నాడు. ఇద్దరూ ఒక్క క్షణం మౌనం వహించారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె, ‘వారు నా పిల్లలే.. కానీ నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని కాను’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘స్కూల్ టీచర్‌గా పనిచేసే దాన్ని. అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవారు. నాకెందుకో పెళ్ళి అనే బంధం మీద ఇష్టం యేర్పడలేదు. దాంతో నా తల్లిదండ్రులు చాలా అసంతృప్తి చెందారు. ఆ కాలంలో ఒంటరిగా బతుకుతున్న స్త్రీని మీరు ఊహించుకోవచ్చు. నేను పెళ్ళి చేసుకుని, సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ కోరిక.కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను వారిని ఏమనలేకపోయాను. అసలు పెళ్ళి మీద నాకు దృష్టే లేదు. ఏదో చెయ్యాలనే తపన. పెళ్ళి చేసుకుంటే చేయలేను. నా ఈ ఆలోచన మా పేరెంట్స్‌కి అర్థంకాలేదు. ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయాను’ ఆయాసం రావడంతో కాసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది,‘రోజూ స్కూల్ నుండి ఇంటికొచ్చాక.. మా ఏరియా చుట్టుపక్కలంతా చుట్టొస్తుండేదాన్ని. అలా నడుస్తున్నప్పుడు ఒక మురికివాడను చూశాను’ అంటూ ఆమె కళ్ళు మూసుకుంది. ‘ఏమైందప్పుడు?’ బోసు ఆత్రుతగా అడిగాడు.‘హు..?’ అంటూ ఆమె అయోమయంగా అతని వైపు తిరిగింది. ‘అదే మీ సాయంత్రం నడకలో ఒక మురికివాడలోకి వచ్చానని చెబుతున్నారు’ బోసు గుర్తుచేశాడు.‘ఆ.. అవును.. మురికివాడలో ఒక గుడిసె బయట.. ఒక మగ మనిషి, ఓ ఆడ మనిషి తీవ్రంగా కొట్టుకుంటున్నారు. మిగతావాళ్ళంతా నవ్వుతూ, ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళను వారిద్దామనుకునే లోపల అక్కడ వినిపించిన కొంతమంది పిల్లల ఏడుపులు నన్ను ఆపేశాయి. అయిష్టంగానే వెనక్కి తిరిగాను. ఆ ఆడమనిషి ఆ పిల్లలను చెత్త కుప్ప మీదకు తోసేసింది. ఆమె మనసులోని దరిద్రమేదో ఆమె చేత ఆ పని చేయించి ఉండవచ్చు. ఏమైనా వాళ్ళు ఆమె పిల్లలు!తల్లిదండ్రులను భయంతో చూస్తున్నారు. ఏం జరుగుతుందో బహుశా.. వాళ్ళకు తెలుసు కాబోలు’ అని చెబుతూ ఆమె ఆపేసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటూ మౌనం వహించింది. ఆమె చెప్పిన కథలోని శకలాలు బోసును ఆశ్చర్యపరచాయి. అతను కూడా ఆందోళన చెందాడు. ఆమె తన గతం చెప్పటం అయిపోయిందా లేక కొనసాగిస్తుందా? అతనికి వేచి ఉండే ఓపిక లేదు. కానీ వినాలనే కుతూహలం అతను వేచి ఉండేలా చేసింది. బోసు టైమ్ చూసుకున్నాడు.. దిక్కులు చూశాడు. ఆమె తిరిగి చెప్పడం ఎప్పుడు మొదలుపెడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఆవె కళ్ళు తెరిచింది. హమ్మయ్య అనుకున్నాడు బోసు. ‘నేను మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాను. అదే దృశ్యం రిపీట్ అయింది. కానీ ఈసారి ఆ ఆడమనిషి తన పిల్లలను కొడితే నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చేసుకున్నాను కూడా. పిల్లల్ని కొట్టొద్దని ప్రాధేయపడ్డాను. ఆమె వినలేదు. అయితే ఆ బస్తీలో వాళ్ళు మటుకు ‘ఇది వీళ్ళు రోజూ ఆడే నాటకమే. మీరు పట్టించుకోకండి’ అని చెప్పారు. నా కన్సర్న్ అంతా ఆ అమాయకమైన పిల్లల గురించే.కొన్ని రోజుల తర్వాత.. ఒకసారి నేను స్కూల్‌కి వెళుతూండగా ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించారు. మనసు చివుక్కుమంది. స్కూల్‌కి ఆలస్యమవుతున్నా.. వాళ్ళను వదిలి ముందుకు వెళ్ళలేకపోయాను’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ‘నేను ఆ పిల్లల దగ్గరకు వెళ్ళడం నాకిప్పటికీ గుర్తుంది. అంత చిన్న పిల్లలని ఆ తల్లిదండ్రులు అలా ఎలా రోడ్డు మీద వదిలేశారని ఆశ్చర్యపోయాను. అప్పుడే తెలిసింది. వాళ్ళంతా అనాథలని! దగ్గరలోని ఒక రెస్టారెంట్ నుండి వాళ్ళకు కావలసినవి తెచ్చిపెట్టాను. ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ.. వాళ్ళు నాతో సన్నిహితంగా మెదిలేలా అలవాటు చేశాను’ అంటూ బోసు వైపు చూసింది.‘తర్వత ఏమైంది?’ ఉత్కంఠగా అడిగాడు బోసు. అచ్చు రాత్రిపూట.. తన అమ్మమ్మను కథ చెప్పమని అడిగే చిన్న పిల్లవాడిలా! ‘నేను వాళ్ళను నా అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాను.’బోసు ఆమె వైపు చూశాడు. ఆమె భుజాలు వంచి.. కళ్ళు మూసుకునుంది. ‘తర్వాత?’ అడిగాడు అదే ఉత్కంఠతో! కళ్ళు తెరుస్తూ ఆమె బోసు వైపు తిరిగి ‘వాళ్ళు నాతోనే ఉన్నారు’ చెప్పింది నెమ్మదిగా. బోసులో అయోమయం.. ‘వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళ పిల్లలను మీరెలా తెచ్చుకున్నారు? వాళ్ళు అనుమతించారా? దత్తత గురించి మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా?’ఆమె.. అతని నుండి కళ్ళు తిప్పుకుని, ముడుచుకున్న తన చేతులను చూసుకుంటూ ‘నేను వారి తల్లిదండ్రులతో మాట్లాడలేదు. అసలు మళ్ళీ ఆ బస్తీకే వెళ్ళలేదు’ అని చెప్పింది స్థిరంగా. ‘అంటే కిడ్నాప్ చేశారా వాళ్ళను? చెప్పకుండా తీసుకెళ్ళడమంటే అదే కదా?’ విస్తుపోతూ బోసు. ‘ఎంతమందిని తెచ్చారు?’ తేరుకుని అడిగాడు. ‘ఒక పన్నెండు మందిని! వాళ్ళకు ఒక హోమ్ ఏర్పాటు చేశాను. అది వాళ్ళిల్లు. కుక్, కేర్‌టేకర్‌ని పెట్టాను. చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు’ చెప్పింది. ‘అయినా సరే.. అది కిడ్నాప్’ అంటూ గట్టిగా అరిచాడు బోసు. మళ్ళీ వెంటనే ‘కాదు.. కాదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో!’ సాలోచనగా అన్నాడు. ఆమె వణుకుతూ మెల్లగా లేచింది. బోసు అలాగే నిశ్చేష్టుడై ఉన్నాడు.‘నేను ఇంక ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు రోజూ రాత్రి ఫోన్ చేస్తారు’ అంటూ అడుగులు వేసింది. ఆ మాటకి బోసు ఈ లోకంలోకి వచ్చాడు. గబుక్కున బ్యాగ్ తీసి ఆమెకు ఇచ్చాడు.‘థాంక్యూ మై డియర్ బాయ్’ అంటూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది. ‘నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడు ఉన్నాడు గ్రానీ..’ అంటూ ఆమె బుగ్గలు పుణికాడు బోసు. ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి బోస్‌ని చూసి నవ్వింది. ఆ పెద్దామె చేయి పట్టుకుని ముందుకు నడిపించసాగింది. పెద్దావిడ వెళుతూ వెళుతూ వెనక్కితిరిగి బోసును చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.బోసుకి ఆమెను చూసినప్పుడల్లా ఏదో అనుబంధం లాగుతున్నట్టనిపిస్తుంది. బహుశా.. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని అమ్మమ్మ , నాన్నమ్మలని ఆవిడలో చూసుకుంటూ ఉండొచ్చు. అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ పోయారు. అలా అమ్మమ్మ పరిచయమే లేకుండా పోయింది. తన అయిదవ ఏట నానమ్మ పోయింది. అలా నానమ్మ జ్ఞాపకమూ మిగల్లేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుతో అమ్మానాన్నలకూ దూరంగానే ఉన్నాడు. అంత బాండింగ్ లేదు.వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు తనకు అతిగా అనిపించేవి. అందుకే వాళ్ళ నుంచి ప్రైవసీ కోరుకున్నాడు. సొంతూళ్ళో ఉద్యోగం వచ్చినా ఇలా ఇంకో ఊరికి మార్పించుకుని వచ్చాడు. అతని తల్లిదండ్రులు కొడుకు కోసం మొహం వాచిపోయున్నారు. ఉండబట్టలేక ఫోన్లు చేస్తే.. విసుక్కుంటాడు. పొడిపొడిగా మాట్లాడి సెకన్లలో కాల్ ముగించేస్తాడు. వాళ్ళెప్పుడు రమ్మన్నా వెళ్ళకుండా సాకులు వెదుక్కుంటుంటాడు. అలాంటి తనకు ఆ ఎనభై ఏళ్ల ఆ వృద్ధురాలు కనువిప్పు కలిగించింది. అనాథల కోసం అవివాహితగా మిగిలిపోయింది. వాళ్ళకు అమ్మ అవడం కోసం తన కుటుంబాన్ని వదులుకుంది.ఫోన్ మోగుతోంది. పనిలో ఉన్న శ్యామల గబగబా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ‘హెలో..’ అంది. ‘ఎవరూ?’ అని ఆత్రంగా అడుగుతూ ఆమె భర్త శ్రీనివాస్ వచ్చాడు. ‘హుష్..’ అని భర్తకు సైగ చేసింది. ‘వాడేనా?’ కుతుహులం పట్టలేక గుసగుసగా అడిగాడు శ్రీనివాస్. కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా అవునన్నట్టుగా తలూపింది. ‘ఎలా ఉన్నావు నాన్నా?’ ఫోన్ మాట్లాడుతూ అక్కడే టేబుల్ మీదున్న బోసు ఫొటోను ప్రేమగా స్పృశించింది శ్యామల. – మణి వడ్లమానిఇవి చదవండి: 'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై.. -
'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై..
శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు. అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు. మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు. చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయనఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...! -
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్‌లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్‌కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్‌లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్‌ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..) -
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
అసాధారణమైన దృశ్యాలు కానీ.. శాస్త్రం తేల్చలేని సంఘటనలు కానీ.. ఎప్పటికీ మిస్టరీలుగానే మిగులుతాయి.మహారాష్ట్ర, శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో కూడా అలాంటి మిస్టరీనే దాగి ఉంది. ఆ దర్గాలో ఉన్న ఓ 90 కేజీల రాయి.. కేవలం పదకొండు మంది చూపుడు వేళ్ల మీద నిలబడిపోతుంది. ఆ తర్వాత గాల్లోకి తేలుతుంది.‘దర్వేష్ అలీ సాహెబ్’ అనే ఒక ముస్లిం సాధువు.. ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి.. కొంత కాలం అక్కడే జీవించి, అక్కడే సజీవ సమాధి అయ్యారనేది స్థానికుల కథనం. నిజానికి ఆ దర్గాను ముస్లిమ్‌ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా హిందువుల్లో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని, అందుకు దర్వేష్ స్వామి ఆశీస్సులు ఉండాలని.. మొక్కుబడులు కట్టి, స్వామి పేరిట ప్రతి ఏడాది ఒక పొట్టేలును విడిచిపెడతారు. సంవత్సరం పాటు దాన్ని మేపి, ఉర్సు సందర్భంగా ఆ మొక్కు చెల్లించుకుంటారు. ఈ దర్గాను ‘దర్శెల్లి’ అని కూడా పిలుస్తారట. స్థానిక హిందువులు ఎంతో భక్తితో ఈ దర్గా స్వామి పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. అందుకే అక్కడ ఎక్కువగా దర్శం,దర్శెల్లి అనే పేర్లు వినిపిస్తుంటాయి. ఈ అనవాయితీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొక్కితే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది.ఇక ఆ రాయి విషయానికి వస్తే.. అది చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ చేతి వేళ్ల సాయంతో ఆ బండ ఎలా గాల్లోకి లేస్తుంది? అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కండలు తిరిగిన ఆజానుబాహులు కొందరు ఆ బండను బలవంతంగా లేపి.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పదకొండు మంది కలసి.. ‘దర్వేష్ అలీ బాబా’ నామాన్ని భక్తితో జపిస్తూ ఆ బండరాయిని లేపితే.. కేవలం వేళ్లపైనే.. అది తేలికగా పైకి లేస్తుంది. ఇది ఎలా సాధ్యమో నేటికీ మిస్టరీనే!సంహిత నిమ్మన (చదవండి: -
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ఎట్సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్ అంతా కూడా వాళ్ల యాక్టింగ్ టాలెంటే! కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్లో వీళ్లిప్పుడు రణ్వీర్ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్.. స్టయిలిస్ట్ ఈశా భన్సాలీదే!ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్ అండ్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్ కూడా! తన ఎక్స్పరిమెంట్స్ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్ స్టెప్ని గుర్తు తెచ్చుకుంది. ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్ రావు సెల్యులాయిడ్ మీద అపియర్ అయ్యాడు. ఆడియెన్స్ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్ రావు న్యూ లుక్స్ అజయ్ దేవ్గణ్నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్ స్టయిలిస్ట్ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. రాజ్‌కుమార్ రావును మించిన చాలెంజ్ అది. అజయ్ దేవ్గణ్కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్ పర్సనాలిటీకి వైట్ జీన్స్, చెక్స్ బ్లేజర్ కాంబినేషన్ కాస్ట్యూమ్ని డిజైన్ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్ అటెన్షన్ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.ఈశా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానాకు ఫ్యాషన్ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి! ఆ కాంబినేషన్ ఆఫ్ జర్నీ ఇంకా కొనసాగుతోంది!‘ఆడవాళ్లకు స్టయిలింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్.. రెడ్‌కార్పెట్ కోసం ఫీమేల్ స్టార్స్‌కి స్టయిలింగ్ చేయాలనుకోండి.. గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్ షూస్ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్ టై, లేపల్ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్.. ఓ మై గాడ్.. ఎన్ననీ! ఆయుష్మాన్ ఖురానాతో ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్ స్టయిల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను మినిమలిజమ్ని ఇష్టపడతాను. నా స్టేట్మెంట్ పీస్ ఒక్కదానితో నా ఎంటైర్ లుక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎలెక్టిక్ అన్నమాట!’ --ఈశా భన్సాలీ -
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్లు, హెయిర్ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్ ట్రీట్మెంట్ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.ఈ డివైస్.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్లో నీళ్లతో పాటు.. సీరమ్ లేదా లోషన్ వంటివి మిక్స్ చేసి బటన్ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్ చేసిన హెయిర్ స్టైల్ సెట్ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! (చదవండి: -
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
అంటర్కాటికాలో ఉన్న ‘మౌంట్ ఎరిబస్’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇది బంగారు ధూళిని ఎగజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 12,448 అడుగుల ఎత్తున ఉంది. ఇది ప్రతిరోజూ ఎగజిమ్మే ధూళిలో దాదాపు 80 గ్రాముల వరకు బంగారు ఉంటోంది. దక్షిణధ్రువ ప్రాంతంలో మంచుతో నిండి ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని తొలిసారిగా 1841లో బ్రిటిష్ నావికాదళం అధికారి జేమ్స్ క్లార్క్ రాస్ కనుగొన్నాడు.అంటార్కిటికాలో 138 అగ్నిపర్వతాలు ఉన్నా, వాటిలో ఎరిబస్, డిసెప్షన్ ఐలండ్ అగ్నిపర్వతాలు మాత్రమే క్రియాశీలమైనవి. తొలిసారి గుర్తించే నాటికి ఎరిబస్ అగ్నిపర్వతం నిద్రాణంగానే ఉన్నా, 1972 నుంచి ఇది పొగను, ధూళిని ఎగజిమ్ముతూ క్రియాశీలంగా మారింది.ఈ అగ్నిపర్వతం అడుగున దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వెలువడే వాయువులు పైకి ఎగజిమ్మేటప్పుడు వెలువడే ధూళితో పాటు అడుగున ఉన్న బంగారం కూడా కరిగి బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళిలో బంగారం బయటపడటం చాలా అరుదని కొలంబియా యూనివర్సిటీలోని లామెంట్–డోహర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త కోనర్ బేకన్ చెబుతున్నారు. (చదవండి: మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!) -
మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!
పూలు ఘుమఘుమలాడటం సహజం. మరి పూలకు మిలమిలలు ఎక్కడివని కోప్పడిపోకండి. రాత్రివేళ మిణుగురుల్లా మిలమిల మెరిసే పూలను ఒక శాస్త్రవేత్త సృష్టించాడు. అమెరికా ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిటూనియా మొక్కలకు జన్యుమార్పిడి చేసి, పిటూనియా పూలు మిణుగురుల్లా మిలమిలలాడేలా చేశాడు.అమెరికన్ కంపెనీ ‘లైట్ బయో’లో పనిచేస్తున్న డాక్టర్ కీత్ వుడ్ అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని సాధించాడు. మాలిక్యులర్ అండ్ కెమికల్ బయాలజీలో విస్తృత పరిశోధనలు సాగిస్తున్న డాక్టర్ కీత్ వుడ్, తొలుత పొగాకు మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టాడు. పొగాకు మొక్క చిన్నది కావడంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. తర్వాత పీటూనియా మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టి, అద్భుత ఫలితాలను సాధించాడు. పీటూనియా మొక్క ఎదిగిన తర్వాత దానికి పూసే పూలు రాత్రివేళ అచ్చంగా మిణుగురుల్లా మిలమిలలాడుతూ కనిపించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘లైట్ బయో’ కంపెనీ పెరటి తోటల్లో పెంచుకునేందుకు వీలుగా రాత్రివేళ మిలమిల వెలుగులు వెదజల్లే పీటూనియా మొక్కలకు ‘ఫైర్ ఫ్లై పీటూనియా’గా నామకరణం చేసి, వాటిని అమ్మడం ప్రారంభించింది. అమెరికన్ జనాలు ఈ మిణుగురు పూలమొక్కలను ఎగబడి మరీ కొంటున్నారు. (చదవండి: చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!) -
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
వేసవి అంటే వేడి.. ఉక్కపోత.. పచ్చళ్లు.. అప్పడాలు, వడియాలు, మల్లెపూలు, మామిడిపళ్లు! కానీ తూనీగల్లాంటి పిల్లలకు మాత్రం వేసవంటే అచ్చంగా సెలవులడ్లు.. స్కూలు, హోమ్‌వర్క్, క్రమశిక్షణ నుంచి కొంతకాలం ఆటవిడుపు. ఇంతకాలం వారంలో వచ్చే ఒక ఆదివారం లేదా రెండవ శనివారంతో కలసి వచ్చే రెండురోజుల సెలవులతో సరిపెట్టుకున్న పిల్లలకు దాదాపు నలభై అయిదు రోజుల సెలవులు ఎంత సంబరం కలిగించే విషయమో కదా!. సెలవల్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఎండా తప్పించుకోవచ్చు. మన విలువైన సెలవుల కాలాన్ని సద్వినియోగమూ చేసుకోవచ్చు. అందుకే ఈ సెలవుల్ని మరుసటి ఏడాదికి ఒక మరపురాని జ్ఞాపకంగా, మళ్లీ రొటీన్లో పడేందుకు ఒక రీచార్జ్‌గా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.సుమారు ఇరవై ముప్పై ఏళ్ల కిందటి వరకు ‘వేసవి సెలవులు’ ఎంత గొప్పగా ఉండేవనీ! పిల్లలూ పెద్దలూ కూడా వేయికళ్లతో ఎదురు చూసేలా ఉండేవి. ఎండాకాలం సెలవుల్లో గ్రామీణ ప్రాంతం వారు పట్టణాలకు, పట్టణాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మమ్మ, నాయనమ్మలు ఇతర బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. ఇందులో భాగంగా రకరకాల శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాల పద్ధతులు, అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే వీలుంటుంది. దాని ద్వారా పిల్లల్లో అనుభవ జ్ఞానం కలుగుతుంది. వీటన్నింటినీ ఆనాటి పిల్లలు ఎటువంటి నిర్బంధమూ లేని స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో హాయిగా ఆస్వాదించేవారు. ఆటపాటల విషయంలో కూడా నాటి వేసవి సెలవుల తీరే వేరు. ఊరి చివరి చెరువులు, బావుల్లో ఈత కొట్టడం, కోతికొమ్మచ్చి ఆడటం, సీమ చింతకాయలు, బాదం కాయలు ఏరుకుని తినడం, మామిడి తోటలలో చెట్లకు కాసిన కాయలకు రాళ్లేసి కొట్టడం, రాలిన కాయలను కోసుకుని ఉప్పూకారం అద్దుకుని తినడం, తాటిముంజెలను జుర్రడం, ఆనక ఆ తాటిబుర్రలను బండిలా తయారు చేసుకుని ఈడ్చుకుంటూ వీధుల వెంబడి తిర గడం.. ఇవిగాక ఆరుబయట కబడ్డీ, క్రికెట్, నేలా బండాలాంటి ఆటలు హాయిగా ఆడుకోవడం. వీటన్నింటి వల్లా మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి శారీరక వ్యాయామమూ లభించేది. దాంతో కరకరలాడే ఆకలి పుట్టి, చద్దన్నాలనీ, చింతకాయపచ్చళ్లనీ చూడకుండా పెద్దవాళ్లు పెట్టినదంతా వద్దనకుండా కడుపునిండా తిని సెలవులు అయిపోయి తిరిగి స్కూళ్లు, కాలేజీలు తెరిచేసరికి నిగనిగలాడుతూ నున్నగా తయారయేవాళ్లు. ఆటలేగాక ఆయా కాలాలలో లభించే మామిడి, పనస, ఈత, జామ వంటి పళ్లు స్వయంగా సేకరించుకుని అందరూ కలసి కాకెంగిలి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తినడంలో కూడా చెప్పలేని అనుభూతి, ఆనంద ఆరోగ్యాలు సొంతమయ్యేవి.ఇక రాత్రివేళ ఆరుబయట అందరూ కూర్చుని రోజంతా చేసిన అల్లరిపనులు నెమరువేసుకుంటూ కలసి అన్నాలు తినడం, ఆ తరువాత డాబాల మీదనో ఆరు బయట మంచాల మీదో పిల్లలంతా కబుర్లాడుకోవడంతో పాటు తాతయ్యలు, మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు. నాటి పిల్లలు భేదాభిప్రాయాలు, అరమరికలూ లేకుండా కలసిమెలసి ఉండేవారు. ఒకవేళ ఏమన్నా చిన్నా చితకా తేడాలు, మాట పట్టింపుల్లాంటివి వచ్చినా పెద్దలు వెంటనే బుజ్జగించి బుద్ధి చెప్పేవారు. ఆచరణతో జీవించే నాటి తరం పెద్దలంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం ఉండేది. ఒక చక్కని దృక్పథంతో భయభక్తులతో ‘పరిధులు గల స్వేచ్ఛ’తో పరమానంద భరితమైన బాల్యం అనుభవించేవారు ఆనాటి పిల్లలు. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి వేసవి సెలవులు కేవలం ‘ఆటవిడుపు వినోదాలకే’ కాకుండా విలువైన నైతిక భావాలు నింపే రోజులుగా కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు..?ఇప్పుడు నానమ్మలు, అమ్మమ్మలు, ఇతర పెద్దలూ దాదాపు కనిపించడం లేదు. అన్నిచోట్లా దాదాపు న్యూక్లియర్ కుటుంబాలే! పిల్లలకు సుద్దులు చెప్పవలసిన తాతలూ, బామ్మలూ వంటి పెద్దలు వృద్ధాశ్రమాలలో మూలుగుతున్నారు. ఈ పరిస్థితులలో వాళ్లకు కథలూ కాకరకాయలూ చెప్పేవారే ఉండరు కాబట్టి, కనీసం వాళ్లు ఆడియో కథలైనా వినేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కథలు చక్కటి ఊహాకల్పనకు, తద్వారా సృజనకు ప్రాణం పోస్తాయి. ఎందుకూ పనికిరారనుకున్న రాజుగారి కుమారులు విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథల ద్వారానే ప్రయోజకులయ్యారని మనం చదువుకున్నాం. అందువల్ల వీలయినంత వరకు ఏదో ఒకలా వారి చేత పుస్తకాలు చదివించడం లేదా కథలు వినేలా చేయడం మంచిది. పిల్లలూ.. ఊరికెళుతున్నారా? వేసవైతే పల్లెకు వెళ్తుంటారు చాలామంది. సాధారణంగా పల్లెటూరి వాతావరణానికి, పట్నాలు, నగరాల వాతావరణం, జీవనశైలికీ చాలా తేడా ఉంటుంది. పట్టణాలూ, నగరాలూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగానే నిద్ర లేస్తుంటాయి. గ్రామీణ వాతావరణం మాత్రం అందుకు విరుద్ధం. రాత్రిపూట తొందరగా పడుకుని, తెల్లవారు ఝాముకల్లా నిద్రలేచి.. పొలం పనులు, ఇంటిపనులు చేసుకుంటారు. మీరు పల్లెటూళ్లకు వెళితే అక్కడా బద్ధకంగా బారెడు పొద్దెక్కాక లేవద్దు. వీలయినంత తొందరగా నిద్రలేవండి. పొలం పనులకు పెద్దలు వెళ్తుంటారు కదా. వారితోబాటు మీరూ వెళ్లండి. వాళ్లు చేసే పనులు శ్రద్ధగా చూడండి. దుక్కి దున్నడం, పొలాలకు నీళ్లు పట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులనూ గమనించండి. మీరు వెళ్లే దారిలో ఏయే పంటలున్నాయో, మొక్కలున్నాయో, చెట్లున్నాయో.. ఏ పంటకు ఎంతకాలం పడుతుందో, ఏ మొక్కకు ఏయే పూలూ, పండ్లు వస్తాయో తెలుసుకోండి.చెట్ల ఆకులను, కొమ్మలను పరిశీలించండి. వాటి పై ఏయే పక్షులున్నాయో చూడండి. వాటి కూతలను అనుకరించండి. మీరు చూసిన వాటి వివరాలన్నీ ఇంటికొచ్చాక ఒక డైరీలోనో, నోట్బుక్లోనో రాయండి. పక్షి రెక్కలెలా ఉన్నాయో, ఏయే రంగులలో ఉన్నాయో రాసుకోండి, వీలయితే వాటి బొమ్మలనూ వేయండి. చెట్ల పేర్లు, వాటి ఆకుల ఆకారం, వాటి సైజు వివరంగా రాయండి.ఇంట్లో పనులను, వంట చేసే పద్ధతిని గమనించండి. మీ సందేహాలను పెద్దవాళ్లనడిగి తీర్చుకోండి. ఆ వివరాలన్నీ నోట్ చేసుకోండి. పెద్దల సమక్షంలో ఆ పనులన్నింటినీ ప్రయత్నించండి. అన్నం తిన్న తరువాత కాసేపు పడుకుని సాయంత్రం బయటికెళ్లి కొత్త స్నేహాలను కలుపుకోండి. కొత్త కొత్త ఆటలను నేర్చుకోండి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తమామల చేత కథలు చెప్పించుకుని వినండి. పాటలు పాడే వాళ్ళను పాడమనండి. వాటన్నింటినీ నేర్చుకోండి. అన్నీ పుస్తకంలోకి ఎక్కించడం మాత్రం మరవకండి. మిగిలిన సమయాల్లో దొరికిన పుస్తకమల్లా చదవండి. మీ తోటివాళ్లతో మీరు చూసిన సినిమా, ఊళ్ళ విశేషాలను పంచుకోండి. వాళ్ళ విషయాలనూ అడిగి తెలుసుకోండి. దూరంగా ఉన్న స్నేహితులకి ఈ విషయాలతో ఉత్తరాలు రాయండి. మీరు చదివిన, విన్న కథలను, అలాగే సినిమాలనూ ఇతరులకు చెప్పండి. సొంత భాషలో వాటిని తిరిగి రాయండి. అలా చేస్తే మీరు విన్న, కన్న విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా విషయాలను చెప్పడం అలవడు తుంది. భాష, భావప్రకటనల మీద పట్టు వస్తుంది. ఆసక్తి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. బొమ్మలు వేయగలిగిన వాళ్ళు.. సెలవుల్లో చూసిన విశేషాలను బొమ్మలుగా వేయండి, కథలు రాయండి.పెద్దలూ.. ఇలా చేయండి!బోధనా మాధ్యమాలు మాతృభాషేతరం కావడం వల్ల పిల్లలు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన ‘అమ్మ భాషలోని బాల సాహిత్య’ సొగసులను ప్రత్యక్షంగా అందుకోలేక ఎంతో నష్టపోతున్నారు. విలువైన చదువులు విద్యార్థులకు సార్థకత చేకూర్చాలంటే చదువు అనే ప్రధాన పంటలో అంతర్గత పంటగా ఉండాల్సిన ‘నైతిక విద్యా విలువలు’ భావిపౌరులకు అత్యవసరంగా అందించాలి. అందులో ప్రధానం పుస్తక పఠనం. దాన్ని అలవర్చడానికి వేసవి సెలవులను మించిన వేదిక లేదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ల ఆత్మకథలు, నీతి కథలు వంటివి పిల్లల చేత చదివించండి. వాళ్లు ఏం అర్థం చేసుకున్నారో సమీక్షలు రాయమనండి. లేదంటే వినిపించమనండి. అలా వినిపిస్తున్నప్పుడు వాటిని రికార్డ్ చేసి ఒక పాడ్‌కాస్ట్ చానెల్‌ను క్రియేట్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్న వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. తద్వారా వచ్చిన ప్రశంసలు పిల్లల్లో కొత్త ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. వాళ్ల ఆలోచనా శక్తి, ఊహాశక్తి మెరుగవుతుంది. సైన్స్ మీద ఆసక్తి ఉన్న పిల్లల చేత సైన్స్ ప్రయోగాలు చేయించండి. తెలుగు, ఇంగ్లిష్ భాషల పదసంపదను పెంచుకునేలా వాళ్ల చేత పజిళ్లు నింపించండి. తార్కిక జ్ఞానం కోసం సుడోకు లాంటివి పూర్తి చేయించండి. పర్యావరణ స్పృహ కోసం వాళ్లు ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడండి. జంతువులతో పక్షులతో సమయాన్ని గడిపేలా ప్లాన్ చేయండి. టెర్రస్ మీద లేదా పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలమొక్కల పెంపకం వంటి విషయాల్లో మెలకువలు నేర్పించండి. అలాగే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే సమయం వేసవి సెలవులే! సంగీతం, డాన్స్, పెయింటింగ్, డ్రాయింగ్ నేర్పించడం, కుట్లు, అల్లికలు, కాగితాలతో బొమ్మల తయారీ(ఓరిగామి), ఎండిన ఆకులు, క్లాత్‌తో బొమ్మలు చేయించండి. వీటివల్ల పిల్లల్లో సృజనతోపాటు మానసిక వికాసం కలుగుతుంది.ప్రాక్టికల్‌గా జీవించడంజీవితంలో ఎదగడానికి చదువు ఒక ఆసరా మాత్రమే! దాంతోపాటు తెలుసుకోవలసిన ప్రాక్టికల్ పాఠాలు చాలా ఉంటాయి. 13 ఏళ్లు నిండిన పిల్లలు తమ చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను తెలుసుకునేందుకు అర్హులు అవుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి వాళ్లకు చెప్పవచ్చు. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్పాలి. డబ్బు విలువ, పొదుపు అవసరాల గురించి తెలియజేయాలి. ఆర్థిక లావాదేవీలను ఆధునిక టెక్నాలజీ ఎంత మేడ్ ఈజీ చేసినా బ్యాంకు, దాని పనితీరు గురించి పిల్లలకు ప్రాక్టికల్‌గా చూపించాలి. అందుకే బ్యాంకుకు వెళ్లేటప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. అక్కడ డబ్బు ఎలా డిపాజిట్ చేస్తారు, ఎలా విత్ డ్రా చేస్తారు. చెక్ బుక్ అంటే ఏంటి, డీడీ ఎలా తీస్తారు.. వంటి ప్రాథమికాంశాలను చూపించాలి. పిల్లల పేరిట ఇచ్చే బ్యాంక్ అకౌంట్స్ వివరాలను తెలుసుకుని వాటిని ఓపెన్ చేయించి, ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే మంచిది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్‌బ్యాంక్ తర్వాత తిరిగి ఆ స్థాయిలో సేవలు అందిస్తున్నది పోస్టాఫీసులే! కాబట్టి పిల్లలను పోస్టాఫీసుకూ తీసుకువెళ్లి అక్కడి పని విధానంపైనా అవగాహన కలిగించాలి. అలాగే పోస్టాఫీసులో ఉండే పొదుపు పథకాల గురించి తెలియజెబుతూ వారికి అక్కడ పొదుపు ఖాతా తెరిచి, వారంతట వారే తమ పాకెట్ మనీని తమ ఖాతాలో జమ చేసుకునేలా చేయాలి.అన్ని పనులూ.. అందరికీఇంకో విషయం.. పిల్లలకు ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఇంటి పని, వంటపని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే! వారిని గారాబం చేయడంతోపాటు పనులపై అవగాహన కూడా కలిగించడం అవసరం. తద్వారా భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా ఏ పని కోసమూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా చేసుకోగలుగుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆటవిడుపుపిల్లలు ఎంత ఆడుకుంటే అంత ఉల్లాసం కలుగుతుంది. అందుకే వారిని బాగా ఆడుకునేలా చేయాలి. ఇండోర్ గేమ్స్ ద్వారా కేవలం మాన సికోల్లాసమే కలిగితే, ఔట్‌డోర్ గేమ్స్ వల్ల శారీరక ఉల్లాసం కూడా చేకూరుతుంది. ఆటలాడిన పిల్లలు మంచి తిండి తిని బలంగా తయారవుతారు. శారీరక బలం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చెట్టుకు చెంబుడు నీళ్లు.. పిట్టకు చారెడు గింజలుపిల్లలకు భూతదయ అంటే ఏమిటో తెలియజెప్పాలి. ఎండుతున్న చెట్లకు కాసిని నీళ్లు పోయడం, ఆహారం, నీళ్లు సంపాదించుకునే ఓపిక లేక రెక్కలు వేలాడేసి ప్రాణాలు కోల్పోయే అల్ప జీవుల కోసం కాసిని గింజలూ, నీళ్లూ అందించేలా అలవాటు చేయడం వల్ల వారిలో హెల్పింగ్ నేచర్ పెరుగుతుంది. ఫ్యామిలీ బడ్జెట్‌పై అవగాహనపిల్లలకు కుటుంబ ఖర్చుల విషయం తెలియడం ఇష్టపడరు చాలామంది తల్లిదండ్రులు. ఆర్థికంగా తమకు ఎంత కష్టం ఉన్నా, దానిని పిల్లలకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. దానివల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల కుటుంబ అవసరాలకు ఎంత ఖర్చవుతుంది, తమకు ఎంత ఆదాయం వస్తుంది అనే రెండు అంశాలనూ బేరీజు వేసుకుని దానిని సమతుల్యం చేయడం ఎలాగో వారికి నేర్పించాలి. అందుకు ఈ వేసవి సెలవులనే ఆసరా చేసుకోవడం బెటర్. నేటి వేసవి ‘శిక్ష’ణ కార్యక్రమాలుకాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా గత పదేళ్లుగా వేసవి సెలవుల్లోనూ మార్పులొచ్చి పడ్డాయి. లక్షణాలతోపాటు లక్ష్యాలు మారిపోతున్నాయి. అప్పట్లో వేసవి సెలవులు పిల్లలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నీ ఇస్తే ఇటీవలి కాలంలో వస్తున్న వేసవి సెలవులు మొక్కుబడి ‘శిక్ష’ణల సెలవులుగా తయారయ్యి ‘సమ్మర్ కోచింగ్’ పేరుతో వేసవి సెలవులు సైతం పాఠశాలల పనిదినాలను తలపింపజేస్తున్నాయి.పిల్లల అభిప్రాయాలను, ఆకాంక్షలనూ ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఆలోచనా విధానాన్ని, ఆకాంక్షలను, పిల్లల బంగారు బాల్యానికి బలంగా రుద్ది, ‘వేసవి శిక్ష’ణా కార్యక్రమాలకు అంకితం చేసేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. దాంతో పిల్లలు యాంత్రిక జీవనవిధానానికి అలవాటు పడి, సెలవులను కూడా క్షణం తీరికలేకుండా గడపవలసి వస్తోంది. సమ్మర్ కోచింగ్ పేరుతో ఏమాత్రం శారీరక శ్రమలేని ఆటలు, కేవలం ఇళ్లకే పరిమితమైన, బుర్రలు వేడెక్కే కంప్యూటర్ గేమ్స్.. అవి కూడా వినోదం కోసం కాక పరీక్షల్లో మార్కుల గుడ్లు పెట్టేందుకు మాత్రమే పనికి వచ్చేలా ఉంటున్నాయి. ఫలితంగా ఆటల ద్వారా రావాల్సిన ఐక్యతాభావం స్థానంలో గెలుపే లక్ష్యం అన్న అనారోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది. దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే! పిల్లల బాల్యాన్ని లాగేసుకునే హక్కు ఎవరికీ లేదు, ఉండదు. ఎలా ఉండాలో... ఎలా ఉండకూడదో నేర్పించాలిఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడంతో పాటు సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా పిల్లలకు అవగాహన కలిగించాలి. పిల్లలు విద్యాపరంగా అత్యున్నత స్థాయిలో ఉండాలి అని ఎలా అశిస్తున్నారో అలాగే సామాజికంగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించాలి. మన భావి తరానికి కావాల్సింది గొప్ప వ్యక్తులే కాదు, మంచి వ్యక్తులు కూడా. మానవత్వం నిండిన మనుషులు అత్యవసరం, చదువులు మార్కుల కోసమే కాదు పిల్లల్లోని ప్రవర్తనా మార్పుల కోసం కూడా అని గుర్తించాలి. ఈ కాలపు వేసవి సెలవులు సాయపడాలని కోరుకుందాం. ∙డి.వి.ఆర్ భాస్కర్ -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్‌లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్‌ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్‌తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్‌లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్‌కి ప్రసిద్ధి. -
రాతల్లో నిజాయితీ: రామేశంగారు మాకు..
రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు. బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు! ‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. ‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను. అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని! రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని! బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని! ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’ అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది. ‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. ‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు. రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా. ‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. ‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను. ‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.ఆ రోజు.. బ్యాంక్‌లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్‌ఫోన్ మోగింది. రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను! ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది. కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడిందీ లేదు! ‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు. భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు! మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’ ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు. ‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు.. ‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు. అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.మాట్లాడాలనిపించలేదు! ‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు! ‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్‌ఫోన్ తీసుకున్నాను. ‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్! మీ మ్యారేజ్‌ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు! కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు! మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు! ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు! మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను! తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ -
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్‌లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్‌ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్‌తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్‌లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్‌లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్‌లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్‌ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్‌లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్‌తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్‌లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.బయోజెనిక్ కార్బన్ ఎక్స్‌ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ.. -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్‌లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్‌తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్‌గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్‌లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్‌చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్‌ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్‌తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్‌ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్‌తోనే డ్రెస్సింగ్‌ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్‌గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్‌ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి వేగంతో..!
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు.. నాటౌట్.. 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 నాటౌట్..25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు..28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్..ఇలా ఐపీఎల్–2024లో ఈ బ్యాటర్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సుడిగాలి వేగంతో చెలరేగిపోతున్న అతని ఆటతీరు అభిమానులను అలరిస్తోంది. సింగిల్స్‌తో కాకుండా సిక్సర్లతోనే స్కోరుబోర్డును పరుగెత్తిస్తున్న ఆ శైలి ఈ సీజన్లో అతనికి కొత్త ఫ్యాన్స్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోల్‌కతాతో మ్యాచ్‌లో 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మైదానంలో అన్ని వైపులకు అతను బాదిన ఎనిమిది సిక్సర్లు ఔరా అనిపించాయి.ఐపీఎల్ ప్రతి ఏటా కొంత మంది కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లీగ్‌లో తమ జట్టు ఓవరాల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా కొందరి అద్భుత ప్రదర్శన ఫ్రాంచైజీ క్రికెట్‌కు కొత్త ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక ఆటగాడే శశాంక్ సింగ్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అతను ప్రదర్శిస్తున్న సంచలన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ వేలం సమయంలో తన ప్రమేయం లేకుండానే వివాదంలో నిలిచి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఈ ఛత్తీస్‌గఢ్ ఆటగాడు ఇప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు.గత ఏడాది డిసెంబర్ 20న ఐపీఎల్–2024 సీజన్లో మిగిలిన స్థానాల కోసం వేలం జరిగింది. వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ ‘శశాంక్ సింగ్’ అనే పేరు ప్రకటించింది. అయితే ఏ ఫ్రాంచైజీ నుంచి కూడా స్పందన రాలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయారు. ఆపై మళ్లీ ‘శశాంక్ సింగ్’ అనే పేరు వినిపించింది. అప్పటి వరకు వరుసగా యువ ఆటగాళ్లను తీసుకుంటూ పోతున్న పంజాబ్ కింగ్స్ యజమానులు కూడా ప్యాడిల్ ఎత్తి తమ ఆసక్తిని ప్రదర్శించారు.రూ. 20 లక్షల కనీస విలువకు ఇతర జట్లేవీ ముందుకు రాకపోవడంతో శశాంక్‌ను పంజాబ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అనూహ్యంగా పంజాబ్ యజమాని ప్రీతి జింటా తమకు ఈ ఆటగాడు అవసరం లేదంటూ వేలం నిర్వాహకులకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీరు ఆలస్యం చేశారంటూ మల్లికా సాగర్ స్పష్టం చేసేసింది. దాంతో బలవంతంగా, కాస్త నిరాశగా శశాంక్‌ను పంజాబ్ తీసుకుంది.దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక యువ ఆటగాడిని ఇలా అవమానపరుస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. చివరకు కింగ్స్ యాజమాన్యం పలు రకాలుగా వివరణ ఇస్తూ తమ జట్టులోకి ఆహ్వానించింది. అయితే తాము వద్దనుకున్న ఆటగాడు ఎంత విలువైనవాడో సీజన్ సాగిన కొద్దీ యాజమాన్యానికి తెలిసొచ్చింది. శశాంక్ సింగ్ మాత్రం అన్నింటికీ ఒకే ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తూ మైదానంలో దూసుకుపోయాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ..బలమైన నేపథ్యం ఉన్నా..‘నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎవరైనా అంటే అవి ఆర్థికపరమైన కష్టాలే కానవసరం లేదు. గెలుపు దారిలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు పట్టుదలగా నిలబడితేనే ముందుకు వెళ్లగలం’ అని శశాంక్ సింగ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎందుకంటే శశాంక్ తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు).ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 1996 వరల్డ్ కప్ సమయంలో ఐదేళ్ల వయసున్న శశాంక్‌కు తొలిసారి క్రికెట్లో ఓనమాలు నేర్పించారు. అప్పటికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు. శశాంక్ పుట్టిన భిలాయ్ మధ్యప్రదేశ్‌లోనే ఉంది. చిన్న వయసులోనే ఆటలో చురుకుదనం చూపించిన శశాంక్ మధ్యప్రదేశ్ అండర్–15, అండర్–17 జట్ల తరఫున ఆడాడు. ఇక సీనియర్ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం శశాంక్ కెరీర్ గతి తప్పేలా చేసింది.తనకు ముంబైకి బదిలీ కావడంతో కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లారు. నిజానికి ముంబైలో ఉంటే మంచి శిక్షణ లభిస్తుందని, ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన సానుకూల రీతిలోనే ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్లాక అంచనా తప్పి అంతా తలకిందులైంది.దేశవాళీలో అవకాశాలు దక్కినా..ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా.. లీగ్‌లతో మొదలు పెట్టి శశాంక్ అన్ని రకాల గుర్తింపు పొందిన టోర్నీలలో ఆడాడు. అప్పటినుంచే అతనికి దూకుడైన, విధ్వంసక ఆటగాడిగా, భారీ సిక్సర్లు కొట్టేవాడిగా గుర్తింపు వచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా ఉండే అతని టెక్నిక్‌తో శశాంక్ పరుగుల వరద పారించాడు. ఒక లీగ్ మ్యాచ్‌లో అతను ఒక్కరోజే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దాంతో 2014–15 సీజన్లోనే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.ఆ తర్వాత ఇదే జోరులో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం కూడా ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ సమయంలో జట్టులో ఉన్న రహానే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్, శార్దూల్ ఠాకూర్, సిద్దేశ్ లాడ్ వంటి స్థానిక ఆటగాళ్లను దాటి తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పాటు శశాంక్‌ను అంతా ముంబైకి చెందని ‘పరాయివాడు’గా చూడటం మొదలైంది.దాంతో ప్రదర్శన ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇస్తే నాలుగు మ్యాచ్‌లలో ఆడించకుండా కూర్చోబెట్టసాగారు. దాంతో నాలుగేళ్ల పాటు జట్టుతో ఉన్నా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఇది శశాంక్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది.పంజాబ్ జట్టు యజమాని ప్రీతీ జింతాతో.. పట్టుదలతో పైకి లేచి..‘అది నాకు కష్టకాలం. అయితే నేను ఎవరినీ నిందించలేదు. విమర్శలు చేయలేదు. నా ఆటపై నాకు నమ్మకముంది. ఇది నా కెరీర్ కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, మీ సహకారం అవసరం లేదని కూడా నాన్నకు స్పష్టంగా చెప్పా. అందుకే జట్టు మారాలని నిర్ణయించుకున్నా’నని చెబుతూ శశాంక్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి మారాలని నిర్ణయించుకున్న తర్వాత దేశవాళీలో పుదుచ్చేరిని ఎంపిక చేసుకొని ఒక సీజన్ పాటు ఆడాడు. కానీ అది మరీ బలహీన జట్టు కావడంతో తాను ఆశించిన ఫలితం దక్కలేదు.చివరకు తనకు సరైంది తన రాష్ట్రమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ కోచ్ దేవేంద్ర బుందేలా సలహా మేరకు టీమ్‌లోకి వచ్చిన శశాంక్ 2019–20 సీజన్లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. దాంతో తన కెరీర్లో ఏదో సాధించిన సంతృప్తి. గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో మణిపూర్‌తో మ్యాచ్‌లో 150 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన శశాంక్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే అతనికి మరింత సంతృప్తినిచ్చిన విజయం నాలుగేళ్ల క్రితం విజయ్ హజారే ట్రోఫీలోనే వచ్చింది. ముంబై జట్టులో తనతో కలసి ఆడిన పలువురు క్రికెటర్లు అన్నివైపుల నుంచి స్లెడ్జింగ్ చేస్తుండగా కీలక ఇన్నింగ్స్ ఆడి తొలిసారి ముంబైపై 5 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించడం అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఐపీఎల్లో ఆలస్యంగా..ఈ ఏడాది ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్న శశాంక్ ప్రయాణం ఇక్కడా గొప్పగా సాగలేదు. 2017 నుంచి 2021 మధ్య ఢిల్లీ, రాజస్థాన్ జట్లతో ఉన్నా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు 2022లో సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లో 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ప్రదర్శన తర్వాత కూడా అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.గత సీజన్లో అయితే ఆడే చాన్సే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దక్కిన ఆపర్చునిటీని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోతూ ధనాధన్ బ్యాటింగ్‌తో లీగ్‌పై తనదైన ముద్ర వేశాడు. ‘నా కొడుకు జీవితంలో కొత్త వెలుగు వచ్చేందుకు బాగా ఆలస్యమైంది. ఇది నన్ను నిరాశపరచే అంశం’ అంటూ తండ్రి బాధపడినా.. తనకు అలాంటి చింత ఏమీ లేదని, ప్రతికూలతలను దాటి తాను వచ్చిన స్థాయి పట్ల సంతృప్తిగా ఉన్నానని శశాంక్ చెప్పుకున్నాడు.కొన్నేళ్ల క్రితం క్రికెట్లో పరిస్థితులు చూసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినా.. ఆటపై ప్రేమ కుదురుగా ఉండనీయక మళ్లీ అతను బ్యాట్ పట్టేలా చేసింది. 32 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానాన్ని ఆశించే విషయంలో ఏమీ చెప్పలేకపోయినా.. అతని ఆట చూస్తే ఏదోరోజు అద్భుతం జరగవచ్చని మాత్రం అనిపిస్తోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్రత్త! -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్‌పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్‌ను స్కూల్‌కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్ళారు. పేరెంట్స్‌తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్‌లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్‌లో హింసాత్మక ప్రోగ్రామ్‌లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్‌లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్‌లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్‌ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్‌లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్‌లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్‌లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టమాట రేటు.. మిర్చి ఘాటు
నేడు అక్కడక్కడా వర్షాలు
తొలి ఫలితం పుట్టపర్తిదే!
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
14 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశం
‘108’లో ప్రసవం
అతిసారం నివారణకు చర్యలు చేపట్టాలి
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
డీఆర్ కాలనీలో చోరీ
తప్పక చదవండి
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్
- ఛత్తీస్‌గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
Advertisement