జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది.
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment