రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పని చేసేవాళ్లు మృతి చెందారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీయగా.. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఆ శబ్ధం వినిపించిందని.. కొన్ని ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని అంటున్నారు. భారీగా మంటలతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తోంది.
ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించింది. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల దేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయని, ఫ్యాక్టరీ లోపల 20 అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు.
కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడు ధాటికి గల కారణాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే మహారాష్ట్ర థానేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment