ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌పూర్: బిడ్డతో సహా దంపతులను పాశవికంగా హతమార్చాడో దుండగుడు. అనంతరం బాధితుల బంధువులకు ఫోన్ చేసి తాను చేసిన దురాగతాన్ని వివరించాడు. ఆ తర్వాత హత్య చేయడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ ఓ లేఖను ఘటనాస్థలంలో వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాయ్‌పూర్‌కు చెందిన మంజు శర్మ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం రవి శర్మతో వివాహం జరిగింది. వీరికి ఓ బిడ్డ ఉంది. కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవి శర్మ ఇంట్లోకి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. రవి, మంజులపై పాశవికంగా దాడికి పాల్పడి వారిని హతమార్చాడు. అనంతరం వారి బిడ్డను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ముగ్గురికి నిప్పంటించి తగులబెట్టాడు. అనంతరం మంజు తల్లికి ఫోన్ చేసి.. ‘నీ కూతురు, అల్లుడు మంటల్లో తగులబడుతున్నారు. వచ్చి చూసుకో.. చేతనైతే కాపాడుకో’ అని చెప్పాడు.
ఈ క్రమంలో ఆమె పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే మంజు కుటుంబం దహనమైపోయింది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. బాధితుల ఇంటి గోడలపై రక్తపు మరకలు కనుగొన్నట్లు తెలిపారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొన్నారు. రవి, మంజు కాళ్లూ-చేతులను తాళ్లతో కట్టేసి.. హత్య చేసిన తర్వాత నిందితుడు వారిని దహనం చేశాడని వెల్లడించారు. మృతదేహాల వద్ద ఓ లేఖ కనుగొన్నామని.. అందులో మంజు వ్యక్తిత్వం మంచిది కాదని.. ఆమె కారణంగా తన సోదరుడు చనిపోయాడని.. అందుకే ఆమె కుటుంబాన్ని హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడన్నారు. కాగా ఘటన జరిగినప్పటి నుంచి మంజు మాజీ భర్త పరారీలో ఉన్నాడని.. ఇందులో అతడి ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment