రేప్‌ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు | Sakshi
Sakshi News home page

రేప్‌ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు

Published Mon, May 6 2024 5:50 AM

-

హుబ్లీ: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరిపిన ఘటన శనివారం అర్దరాత్రి సుతగట్టి గ్రామంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన సద్దాహుస్సేన్‌ నిందితుడు. ఇతను ఓ బాలికను ప్రేమ పేరుతో న మ్మించి గర్భవతిని చేసి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రులు నవనగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తుండగా సుతగట్టి గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. విద్యాగిరి సీఐ సంగమేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. వీరి రాకను గమనించిన సద్దాహుస్సేన్‌ పోలీసులపై చాకుతో దాడికి దిగాడు. దీంతో ఓ పోలీస్‌ గాయపడ్డాడు. సీఐ సంగమేశ్‌ నిందితుడి కాలికి షూట్‌ చేశాడు. గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించారు.

దింగాలేశ్వర స్వామిపై ఫిర్యాదు

హుబ్లీ: సిరహట్టి శ్రీ ఫక్కీరేశ్వర మఠం శ్రీ దింగాలేశ్వర స్వామిపై హుబ్లీ ఏపీఎంసీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కుమారస్వామి నవళగుంద పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న జిల్లాలోని నవళగుందలో జరిగిన స్వాభిమాని ఓటర్ల సమావేశంలో కుల, మతం పేరుతో వైరం కలిగేలా దింగాలేశ్వర స్వామి మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీజేపీకి డబుల్‌ డిజిట్‌ కూడా రాదు

హుబ్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అపూర్వ ఆదరణ వస్తోందని, ఈ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ కూడా చేరుకోలేదని మంత్రి దినేశ్‌ గుండూరావ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికలు సత్య, అసత్యానికి జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. బీజేపీ ఎప్పటికి రిజర్వేషన్లకు సానుకూలంగా లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భాగవత్‌ రాజ్యాంగం, రిజర్వేషన్ల గురించి మాట్లాడారన్నారు. రిజర్వేషన్లపై వారికి నమ్మకం లేదని ధ్వజమెత్తారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పే బీజేపీని ఇంటికి సాగనంపి ధార్వాడ లోక్‌సభకు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. ప్రహ్లాద్‌జోషి అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కర్ణాటకకు బీజేపీ ఏం చేసిందని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.

గర్భిణులు సకాలంలో

వైద్య పరీక్షలు చేసుకోవాలి

బళ్లారిఅర్బన్‌: గర్భిణులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రసవ సమయంలో వెంటనే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని డీహెచ్‌ఓ డాక్టర్‌.వై.రమేష్‌బాబు తెలిపారు. సమీపంలోని ఎమ్మిగనూరు గ్రామంలో ఓ గర్భిణి ఇంటికి వెళ్లి పరిశీలించారు. మాతా శిశు మరణాలు అరికట్టేందుకు సరైన మందులు వేసుకోవాలని, ఐరన్‌ మందుల సేవనం, బీపీ, హెచ్‌ఐవీ, రక్తహీనత తదితర అవసరమైన పరీక్షలను చేయించుకోవాలన్నారు. కాన్పులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో గర్భిణులు ఎక్కువగా పౌష్టికాహారం, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కంప్లి తాలూకా ఆరోగ్య పర్యవేక్షణ అధికారి డాక్టర్‌.అరుణ్‌, వైద్యాధికారి డాక్టర్‌, ఫరూక్‌, జిల్లా ఆరోగ్య విద్యాధికారి ఈశ్వర్‌ హెచ్‌ దాసప్పనవర, జిల్లా నర్సింగ్‌ అధికారి గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement