ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట | Sakshi
Sakshi News home page

ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట

Published Mon, May 6 2024 9:10 AM

ప్రతి

ఐదేళ్లలో తలుపుతట్టిన

సంక్షేమ పథకాలు

సచివాలయం, విలేజ్‌ క్లీనిక్‌,

రైతు భరోసా కేంద్రాలతో మారిన

రూపురేఖలు

వలంటీర్ల సేవలతో సరికొత్త చరిత్ర

లంచాలతో పనిలేదు,

ఆఫీసుల మెట్లు ఎక్కే పనిలేదు

కర్నూలు నుంచి బేతంచెర్ల మధ్య

‘సాక్షి’ రోడ్‌ షో

దయం 6.30 గంటలు. కర్నూలు నగరంలోని సెంట్రల్‌ ప్లాజా నుంచి నంద్యాల రోడ్డుకు వెళ్తుంటే కార్పొరేషన్‌ పరిధిలో కేసీ కెనాల్‌ పక్కనే ఏర్పాటు చేసిన హాకర్స్‌ జోన్‌ వద్ద వీధి వ్యాపారుల కోలాహలం కనిపించింది. ఏమ్మా.. వ్యాపారం ఎలాగుందని చౌడమ్మ అనే మహిళను ప్రశ్నించగా ఎంతో సంతోషంగా చాలా బాగుంది సార్‌ అని చెప్పింది. గతంలో తోపుడుబండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ, ఎండకు ఎండుతూ వానకు నానుతూ చానా కష్టాలు పడ్డామంది. ఇప్పుడు యా బాధ లేదు. హాయిగా నీడ పట్టున వ్యాపారం చేసుకుంటున్నామంది. ప్రభుత్వం నుంచి ఏమైనా మేలు జరిగిందా? అని ప్రశ్నిస్తే.. పిల్లలకు అమ్మ ఒడి, తల్లికి పింఛను, తనకు ఇంటి స్థలం ఇచ్చారని తెలిపింది. పక్కనున్న వ్యాపారులదీ ఇదే మాట. ఎక్కడికీ పోయే పని లేకుండా అన్ని పథకాలు ఇంటి వద్దకే వస్తున్నాయని సంబరపడ్డారు. అక్కడి నుంచి తాండ్రపాడు మీదుగా నేషనల్‌ హైవే చేరుకున్నాం. ‘ఆరులైన్ల సూరత్‌ హైవే’ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలా.. నన్నూరు మీదుగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్డు చేరుకున్నాం. టీడీపీ ప్రభుత్వం రూ.38కోట్లు ఖర్చు చేసి హడావుడిగా ప్రారంభోత్సవం చేసినా, ఒక్క విమాన సర్వీసు నడపలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తిం చేసింది. ప్రస్తుతం వైజాగ్‌, చైన్నె, బెంగళూరుకు సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుండి ముందుకెళ్తే 90శాతం పూర్తయి చివరి దశలో ఉన్న జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ప్లాంటు కన్పించింది. ఈ ప్రాంతంలో 10,900 ఎకరాలను ప్రభుత్వం మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తోంది. సిగాచీ, ఆర్‌పీఎస్‌ లాంటి పరిశ్రమలు రాబోతున్నాయి. మారుతి–సుజుకికి కూడా ఫార్మా కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. అక్కడి నుండి హుస్సేనాపురం చేరుకున్నాం. పాణ్యం నియోజకవర్గం. ఊళ్లోకి వెళ్లగానే రచ్చకట్టపైన కొందరు పడుకుని సేద తీరుతున్నారు. అందరూ రైతులే. ఏమన్నా! ఎన్నికల పరిస్థితి ఇలా ఉందని మాట కలిపాం. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వంల ఎవరికీ ఎలాంటి కష్టం లేదు. ఎన్ని పథకాలు వస్తున్నాయో కూడా చెప్పలేం. వలంటీర్లు వస్తున్నారు, వేలిముద్రలు వేయించుకుంటున్నారు.. డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి. ఎవ్వరికీ లంచం ఇచ్చే పనిలేదు, యాడికీ పోయే పనిలేకుండా అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి.. ఇంతకంటే ఏం కావాల..’ అని వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయనే మళ్లీ కల్పించుకొని ఊర్లనే సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రి ఏర్పాటు చేసినారని.. శానా మంచి జరిగిందన్నారు.

అక్కడి నుండి ఊళ్లోకి వెళ్లాం. రామలక్ష్మి అనే పెద్దావిడను పలకరించాం. ఏం పెద్దమ్మా.. రాజకీయం ఎలా ఉందని అడిగితే ‘మంచి సేసినోడికే అండగా ఉండాలయ్యా. లేదంటే పాపం!’ అని సెప్పింది. ఆమె ఇంటి ఎదురుగా తోపుడు బండిపై బట్టలు ఐరన్‌ చేస్తున్న నాగలక్ష్మిని పలకరించాం. ఆమెదీ అదే మాట. అలాగే ముందుకెళ్లాం.. మద్దమ్మ అనే ముసలావిడతో మాట్లాడితే.. గతంలో పించిని కోసం వెళ్లి శానా అవస్థలు పడేటోళ్లమంది. కూడు నీళ్లు లేకుండా ఆఫీసు కాడా ఉండాల్సి వచ్చేదంది. ఇప్పుడు నిద్ర మంచానే వచ్చి అవ్వా ఇదిగే నీ పించిను డబ్బులంటూ వలంటీర్లు చేతిలో పెడుతున్నారు. మాలెక్క ముసిలోళ్లకు శానా మంచి సేసినాడు నాయనా అంది. అక్కడి నుంచి తిరిగి హైవేకు వచ్చి సోమయాజులపల్లెకు పోయినాం. రాములమ్మ అనే వృద్ధురాలిని పలకరించాం. ‘భర్త చనిపోయాడు. పింఛన్‌ వస్తోంది. చేయూత వస్తోంది. ఈ డబ్బులతోనే అద్దె ఇంట్లో బతుకుతున్నా. ఇదీ లేకపోతే నా పరిస్థితి ఏంటయ్యా! ఆ మహానుభావుడి సలవే! అంది.

పాలనపై స్పష్టత

అక్కడి నుండి వెంకటాపురం వెళ్లాం. ఎండకు చెట్టుకింద అరుగుపై పది మందికి పైగా పడుకున్యారు. మేం వెళ్లగానే అంతా లేచి కూర్చన్యారు. వారితో కాసేపు మాట్లాడాం. రేపు ఒకటో తారీఖు.. పింఛన్‌ రావాల. ఇంతకు ముందు ఇంటికి తెచ్చిస్తుండ్రి. ఇప్పుడు ఆ నిమ్మగడ్డ రమేశ్‌, చంద్రబాబు చేసిన పనికి అకౌంట్లలో వేస్తారంట అని వెంకటేశ్వర్లు అనే రైతు బండిపై కూర్చుని వ్యంగంగా అన్యాడు. దీంతో రోజువారీ మార్పులతో పాటు పాలన, విధానపరమైన నిర్ణయాలపై పల్లె ప్రజలకు ఎంత స్పష్టమైన అవగాహన ఉందో స్పష్టమైంది. ఇంతలోనే వెంకట్రాముడు అనే మరో రైతు మాట్లాడుతూ మా ఊరంతా మంచిగా ఉంటామయ్యా! ఓట్లు వచ్చినప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్లు వేసుకుంటారు. మాకు ఎవరు మంచి చేసింటే వాళ్లకే ఓటు వేస్తాం అన్యారు.

నంద్యాల జిల్లా ప్రజల మాట ఇదే..

అక్కడి నుండి నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం బేతంచెర్ల మండలం గోరుమానుకొండ చేరుకున్నాం. అక్కడ విశ్వేశ్వరి, నాగమ్మ అనే ఇద్దరు మహిళలతో మాట్లాడాం. ఇద్దరి బిడ్డలకు అమ్మఒడి వస్తోంది. డ్వాక్రా రుణాలు సున్నా వడ్డీతోనే తీసుకుంటున్నారు. అనారోగ్యం వస్తే పక్కనే ఉన్న ఆస్పత్రికి వెళుతూ సంతోషంగా ఉన్నాం. బడి, సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రి ఒక్కమాటలో చెప్పాలంటే మా ఊరు మారింది.’ అని సంబరపడ్డారు. అక్కడి నుండి బేతంచెర్లకు బయలుదేరాం. దారిలో యూరోపియన్‌ మోడల్‌ భవనాలు కన్పించాయి. మహాత్మజ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్‌ స్కూలు, కాలేజీ. విదేశాల్లో ఉన్నట్లు అన్పించింది. రూ.36కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ తరగుతులు మొదలవుతాయి. అక్కడి నుంచి కాస్త ముందుకుపోతే మరో యూరోపియన్‌ మోడల్‌ నిర్మాణాలు. రూ.8కోట్లతో ఓ ఐటీఐ కాలేజీ, పక్కనే రూ.4కోట్లతో ఎంఎస్‌ఎంఈ శిక్షణ కేంద్రం. బహుశా రాష్ట్రంలో ఇలాంటి అద్భుత కట్టడాలు ఎక్కడ లేవు అన్పించింది.

ప్రతి నోటా..  ఊరూరా ఇదే మాట
1/3

ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట

ప్రతి నోటా..  ఊరూరా ఇదే మాట
2/3

ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట

ప్రతి నోటా..  ఊరూరా ఇదే మాట
3/3

ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట

Advertisement
Advertisement