వైభవంగా వసంతోత్సవాలు | Sakshi
Sakshi News home page

వైభవంగా వసంతోత్సవాలు

Published Mon, May 6 2024 9:10 AM

వైభవం

ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం క్షేత్రంలో అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు స్వామికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం దిగువ అహోబిలంలో వసంత మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి తిరుమంజనం, అర్చన, నవకళశ పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవారిని కొలువుంచి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

ప్రశాంతంగా ‘నీట్‌’

కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్‌టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశాంతంగా ముగిసింది. ఎన్‌టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఇండస్‌, ఏ క్యాంపులోని మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్‌, మదర్‌ థెరిస్సా ఫార్మసీ కాలేజీ, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీ, సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కాలేజీ, శ్రీలక్ష్మీ స్కూల్‌ (సంసిద్ధ్‌), అథెనా స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 4,944 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పేర్లు రిజిస్టర్‌ చేసుకోగా.. 4,838 మంది హాజరయ్యారు. 106 మంది గైర్హాజరయ్యారు. ఎన్‌టీఏ నిబంధనల మేరకు క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు.

సెగలు..భగభగలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో

అత్యధిక ఉష్ణోగ్రతలు

కర్నూలు(అగ్రికల్చర్‌)/మహానంది: ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది వరకు 46 డిగ్రీల వరకే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది గరిష్టంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది కర్నూలులో గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి 45.9 డిగ్రీలకు చేరింది. ఉదయం పూట గాలిలో తేమ 60 నుంచి 70 శాతం, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం ఉండాలి. గాలిలో తేమ శాతం కనిష్టస్థాయికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఆదివారం నంద్యాలలో 45.8, సంజామలలో 45.4, కోవెలకుంట్లలో 44.7, బేతంచెర్లలో 44.5, ఎమ్మిగనూరులో 44.6,సి.బెళగల్‌లో 45.3, కల్లూరులో 44.8, కోసిగిలో 44.6, గూడూరులో 43.2, హొళగుందలో 43.7,కౌతాళంలో 44, మంత్రాలయంలో 41.4, పెద్దకడుబూరులో 43.2, బనగానపల్లెలో 43, డోన్‌లో 44.2, మహానందిలో 43.7, పాణ్యంలో 41.8, రుద్రవరంలో 41.3 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వైభవంగా వసంతోత్సవాలు
1/1

వైభవంగా వసంతోత్సవాలు

Advertisement
Advertisement