ఇంటింటికీ పోల్‌ చిట్టీలు | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ పోల్‌ చిట్టీలు

Published Sun, May 5 2024 4:05 AM

ఇంటింటికీ పోల్‌ చిట్టీలు

భానుపురి (సూర్యాపేట): మరో తొమ్మిది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వంద శాతం పోలింగ్‌ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఇంటింటికీ పోల్‌ చిట్టీల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు పోల్‌ చిట్టీలను అందజేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 90.02 శాతం చిట్టీల పంపిణీ పూర్తయింది. ఈనెల 8వ తేదీ వరకు పోల్‌చిట్టీ ఇచ్చేందుకు అవకాశముంది. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో 76.35 శాతం చిట్టీలను అందించగా.. మిగతా చోట్ల 90 శాతానికి పైగానే పంపిణీ చేశారు.

ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని..

ఓటు హక్కును వినియోగించుకునే వారికి పోల్‌చిట్టీలు ఉపయోగకరంగా ఉంటాయి. గతంలో పోలింగ్‌కు ముందురోజు రాజకీయ పార్టీల నాయకులు తమ గుర్తులతో కరపత్రాలను పంపిణీ చేయగా.. ఈ పత్రాలు ఓటర్లకు సరిగా అందకపోవడంతో ఓటు ఎక్కడ ఉన్నది.. పోలింగ్‌ కేంద్రం ఎక్కడ.. అసలు ఓటు ఉందా.. లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయేది. దీంతో ఓటర్లు చాలా ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పోల్‌చిట్టీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఓటర్ల సమాచారంతో పాటు సంబంధిత బీఎల్‌ఓ పేరు, ఫోన్‌ నంబర్‌, పోలింగ్‌ కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలు, పోలింగ్‌ రోజున పాటించాల్సిన నిబంధనలు ఇందులో పొందుపర్చారు.

జిల్లాలో పది లక్షలకు పైగా ఓటర్లు..!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 9.85 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు 10.02 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. నూతనంగా 14,050 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరందరికీ ఈ పోల్‌చిట్టీలను పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఈనెల 8వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఇప్పటికే జిల్లాలో 90.02 శాతం పోల్‌ చిట్టీలు పంచారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో 95.39 శాతం మంది ఓటర్లకు, కోదాడ పరిధిలో 92.65శాతం మంది ఓట ర్లకు, సూర్యాపేటలో 76.35 శాతం, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో 95.97 శాతం మంది ఓటర్లకు చిట్టీలు చేరాయి. మరో 97,787 మంది ఓటర్లకు అందాల్సి ఉంది.

ఫ ఇప్పటికే 90.02 శాతం ఓటర్లకు చేరిన చిట్టీలు

ఫ 8వ తేదీ వరకు పంపిణీకి గడువు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement