సాక్షి, నల్లగొండ: తెలంగాణలో తక్కువ సమయంలో రెట్టింపు వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌కు ఓటు వేశారని అన్నారు. మేధావులందరూ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.
కాగా, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ నల్గొండలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుస్తుంది. ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదు.
బీఆర్‌ఎస్ పార్టీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది. అదే పంథాను కాంగ్రెస్ అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా కొనలేదు.
బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. అవినీతి అక్రమాలకు సివిల్ సప్లై శాఖ అడ్డాగా మారింది. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద అవినీతి సివిల్ సప్లై శాఖలో జరిగింది. ఆ శాఖ నష్టాల్లో ఉండటానికి కారణం ఏంటి?. మధ్యవర్తిగా ఉన్న సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది. కొందరు కాంగ్రెస్ నాయకులు శాఖను అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయలు దండుకుని ఢిల్లీకి పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన కత్తి తీయడం లేదు. ఏ రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా ముట్టిందో బయట పెట్టాలి. సివిల్ సప్లై శాఖలో అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలి.
కృష్ణా జలాల విషయంలో చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు మోసం చేశారు. విద్యా, వ్యవసాయం, అన్ని రంగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాశనం చేసింది. మైనార్టీ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. రాములోరి అక్షింతలు, ప్రసాదాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ హేళన చేస్తోంది. ఓ వర్గానికి కొమ్ముగాస్తే బీజేపీ అడ్డుకుంటుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment