ఒంగోలు: చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారు.. కానీ ఆ ఉన్నతాధికారి తన హోదాను మరచి వ్యవహరించారు. కలెక్టరేట్‌లో ఒక ఉన్నతాధికారి కారిడార్‌లో వెళ్తుండగా మరో విభాగం కార్యాలయ అటెండర్ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్ లేచి సెల్యూట్ కొట్టకపోవడంతో సదరు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్ పనిచేసే విభాగం ఉన్నతాధికారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోదిస్తూ ఎక్కడికెళ్లారంటూ హూంకరించారు. 10.40 గంటలు దాటినా ఎందుకు రాలేదంటూ మహిళా అధికారులను సంబోధించిన తీరుకు అక్కడివారు అవాక్కయ్యారు.
అటెండర్‌ను చూపిస్తూ ‘‘వీడికి పనీపాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెలరోజుల జీతం కోత వేయండి’’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయితే సదరు విభాగానికి చెందిన మహిళా అధికారిణి ఒకరు అప్పటికే అధికారిక విధుల్లో ఉండగా మరో ఉన్నతాధికారి విజయవాడలో ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఇవేమీ గమనించకుండా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణం ఆ ఉన్నతాధికారిని అటెండరు గుర్తించి సెల్యూట్ కొట్టకపోవడమేనన్న చర్చ నడుస్తోంది. చివరకు అక్కడకు వచ్చిన విజిటర్స్‌ను సైతం మీకు ఇక్కడేం పని అంటూ భగ్గుమన్నారు. ఈ సన్నివేశం ఇలా జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మరో విభాగపు ఉద్యోగిపైనా మండిపడ్డారు.
నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా మధ్యగుండా వెళతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ఉద్యోగి నీళ్లు నమిలాడు. చివరకు ఆ తంతును గమనిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా ఐడీ కార్డు చూపించాలని, లేకుంటే ఇక్కడనుంచి వెళ్లాలంటూ హెచ్చరించడం కొసమెరుపు. ఇటీవల జరుగుతున్న సమావేశాలన్నింటిలో ఇదే విధంగా ఆయన దూషణలకు దిగుతున్నారంటూ ప్రభుత్వ విభాగాల్లోని పలువురు అధికారుల మధ్య చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment