జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.హాజరు మాయాజాలానికి కాలం చెల్లినట్లే.
- సమస్తం ఆన్‌లైన్‌లోనే
- హాజరు మాయాజాలానికి తావులేదు
- వార్డెన్లకు ల్యాప్‌టాప్‌లు
- దసరా అనంతరం అమలు
నూజివీడు : జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.హాజరు మాయాజాలానికి కాలం చెల్లినట్లే. హాస్టల్‌లో ఉండే విద్యార్థుల హాజరును ఇక నుంచి బయో మెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న 10,500మంది విద్యార్థుల్లో 226మంది విద్యార్థులను మినహాయిస్తే అందరి ఆధార్‌కార్డు నంబర్లను అనుసంధానం చేశారు.
బయోమెట్రిక్ హాజరు విధానం దసరా సెలవుల అనంతరం నుంచి ప్రారంభం కానుంది. ఈ విధానంలో భాగంగా విద్యార్థుల వేలిముద్రలను తీసుకునే పరికరంను, ల్యాప్‌ట్యాప్‌లను జిల్లాలోని 105 వసతి గృహాల వార్డెన్లకు అందజేశారు. అలాగే ప్రతి హాస్టల్‌కు బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును తీసుకుంటున్నారు. ప్రతి రోజూ ప్రతి హాస్టల్ విద్యార్థుల హాజరు ఆన్‌లైన్ చేయడంతో హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు నిమిషాల వ్యవధిలో చేరుతుంది. దీంతో ఇప్పటివరకు కొనసాగుతున్న హాజరు మాయాజాలానికి ఇక నుంచి తెరపడనుంది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పూర్తిగా తగ్గిపోనుంది.
విద్యార్థుల హాజరు ఇలా తీసుకుంటారు....
వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఆధార్ నంబర్లను ఇప్పటికే సేకరించి అనుసంధానం చేశారు. దీంతో వార్డెన్లకు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లో ఆ విద్యార్థుల వేలిముద్రలు, ఫొటోలు నిక్షిప్తం చేసి ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వార్డెన్లు హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల వేలిముద్రలను వేలిముద్రల సేకరణ మిషన్‌తో సేకరిస్తారు. వారి సేకరణ పూర్తయిన తరువాత వార్డెన్లు కూడా తమ వేలిముద్రలను వేయాల్సి ఉంటుంది. ఇలా ఎంతమంది వేలిముద్రలైతే సరిపోతాయో అంతమంది విద్యార్థులు హాస్టల్‌లో ఉన్నట్లు లెక్క. హాజరును బట్టి, ఆ రోజు మెనూ ప్రకారం బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు తదితరాలన్నీ ఎంతెంత పరిమాణంలో వాడారనేది కూడా అప్పటికప్పుడే ల్యాప్‌టాప్‌లో చూపించడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ చూపుతుంది.
జిల్లాకు 105ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు...
సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 145 వసతి గృహాలుండగా 50మంది కంటే తక్కువ విద్యార్థులున్న 40 వసతి గృహాలను మినహాయించి, మిగిలిన 105 వసతి గృహాలకు ల్యాప్ టాప్‌లను, బయోమెట్రిక్ మిషన్లను అందజేశారు.
విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటే ఇబ్బందే...
జిల్లాలో చాలా వసతి గృహాల్లో వందమంది విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రతి రోజూ రెండు పూటలా వేలి ముద్రలు స్వీకరణ పెద్ద ప్రహసనంగా మారనుంది. వందమంది విద్యార్థులున్న వసతి గృహంలో 17నిమిషాల సమయం తీసుకుంటుంది. నూజివీడులోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో 311మంది విద్యార్థులున్నారు. దీనికి కేవలం ఒకేఒక్క ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మిషన్ ఇచ్చారు.
వీళ్లందరి వేలిముద్రలు తీసుకోవాలంటే రెండు గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న వసతి గృహాలకు మరొక ల్యాప్‌ట్యాప్ ఇచ్చినట్లయితే సౌకర్యంగా ఉంటుంది.