‘సర్వే’ షాకులు! | Government schemes survey shock | Sakshi
Sakshi News home page

‘సర్వే’ షాకులు!

Published Sat, Jun 9 2018 3:37 AM | Last Updated on Sat, Jun 9 2018 9:05 AM

Government schemes survey shock - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలకు ప్రజాసాధికార సర్వేలో వివరాల నమోదును తప్పనిసరి చేయటంతో పలువురు మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్యూమరేటర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. 

2016 జూలైలో ప్రజాసాధికార సర్వేను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డులు, ఫించన్లు, పేదల ఇళ్లు, డ్వాక్రా రుణాలు తదితరాలు పొందేందుకు వివరాల నమోదును తప్పనిసరి చేసింది. ఎన్యూమరేటర్లు వచ్చిన సమయంలో కొంత మంది ఇంట్లో లేకపోవడంతో సర్వేలో పేర్లను నమోదు చేయలేదు. మరికొన్ని చోట్ల ఎన్యూమరేటర్లే వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. సర్వేలో పేర్లు నమోదు కానివారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించారు.

పట్టణాల్లో ప్రజల తిప్పలు
మున్సిపల్‌ కార్యాలయాల సర్కిళ్లు, డివిజన్‌ కార్యాలయాల వద్ద ఒకరిద్దరు మాత్రమే ఎన్యూమరేటర్లు అందుబాటులో ఉండటంతో పట్టణాల్లో వివరాలు నమోదు కోసం వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేర్ల నమోదుతోపాటు  మార్పులు, చేర్పులు కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లకు నెట్‌ కనెక్షన్‌ సరిగా ఉండక వివరాలు నమోదు కావటం లేదు.

ఫించన్లకూ సర్వేతో లంకె
సర్వే సమాచారం అసంపూర్తిగా ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవని అధికారులు చెబుతున్నారు. సర్వే జరిగిన తర్వాత జనన, మరణాల కారణంగా తేడా వచ్చినా అసంపూర్తి సర్వేగానే పరిగణిస్తున్నారు. ప్రజాసాధికార సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదిక ఉన్నవారికే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తున్నారు. ఫించన్లకు కూడా సర్వే వివరాలతో ముడిపెట్టటంతో పలువురు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

4.35 కోట్ల మంది వివరాల నమోదు
ప్రజాసాధికార సర్వే పూర్తయిందని, 4,35,19,037 మంది పేర్లను నమోదు చేసుకున్నారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామాల్లో 3,19,85,700 మంది, పట్టణాల్లో 1,15,33,337 మంది సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వేలో ఇంకా నమోదు చేయించుకోని వారు మున్సిపల్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వాలని సూచించారు.

చనిపోయిన వారి వివరాలూ నమోదు చేయాలట
నా భర్త రంగారావు ఏడాది క్రితం చనిపోయాడు. కొత్తగా మంజూరైన రేషన్‌కార్డు తీసుకునేందుకు వెళ్తే ప్రజాసాధికార సర్వే వివరాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. భర్త చనిపోయిన విషయాన్ని సాధికార సర్వేలో నమోదు చేయించాలన్నారు. సత్యనారాయణపురం సర్కిల్‌ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగి ఎన్యూమరేటర్‌ వద్ద వివరాలు నమోదు చేయించుకున్నా. నవనిర్మాణ దీక్ష అంటూ అధికారులు ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. ఇక కొత్త రేషన్‌ కార్డు ఎప్పుడు వస్తుందో? – నారాయణమ్మ (సింగ్‌నగర్, విజయవాడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement