
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో 43వేల భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది చరిత్రాత్మకమైన గెలుపని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో నవరత్నాల పథకాలకు ప్రభుత్వం తగినన్నినిధులు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి రాగా ఆయన కుప్పం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.