నడిరోడ్డుపై గడ్డం గీయించుకున్న చెవిరెడ్డి
చంద్రగిరి: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గత రెండు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆయన గురువారం ఉదయం దీక్షా శిబిరం వద్ద నడి రోడ్డుపై కూర్చుని గడ్డం గీయించుకున్నారు.
చెవిరెడ్డితో పాటుగా వైఎస్‌ఆర్ సీపీ నేతలు చంద్రగిరిలోని నాయీ బ్రాహ్మణులచే షేవింగ్ చేసుకుంటుండగా సమైక్య వాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు చిప్ప చేత బట్టుకుని అడుక్కు బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును మార్చేందుకు ఎన్నెన్నో మాయ మాటలు చెప్పి ఎలాగోలా హైదరాబాదుకు తరలించడం జరిగిందన్నారు. రాయలసీమ వాసులు ఆ సమయంలో అడ్డుచెప్పకుండా రాజధాని మార్పుకు అంగీకరించడమే కాకుండా ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా వెళ్లిన వారంతా కోట్లాది రూపాయలు వెచ్చించి హైదరాబాదును అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం వరకు హైదరాబాదు నుంచి వస్తుందన్నారు.
రాష్ట్ర విభజనకై తెలంగాణలో సాగిన ఉద్యమం పెట్టుబడి దారుల జేబు నుంచి పుట్టుకొచ్చిన ఉధ్యమమని, సీమాంధ్రలో జరుగుతున్న పోరు ప్రజల గుండెల నుంచి పుట్టుకొచ్చిందన్నారు. నిజానికి తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజలు సమైక్య రాష్ట్రంను కోరుతున్నా వారి మాటలు బయటకు రానీయకుండా అక్కడి రాజకీయ నేతలు తొక్కిపెట్టి ప్రజలు అందరూ తెలంగాణను కోరుకుంటున్నట్లు తెరపైకి తీసుకు వస్తున్నారని చెప్పారు. సీమాంధ్రలో సమైక్య వాదాన్ని రాజకీయ నేతల కంటే ముందుగా ప్రజలు వినిపిస్తున్నారని చెప్పారు.
ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో నేతలు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నియాదవ్, ఎద్దుల చంద్ర శేఖర్‌రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, నంగా బాబు రెడ్డి, గోవిందరెడ్డి, మల్లం చంద్ర మౌళిరెడ్డి, పట్టాభిరెడ్డి, మస్తాన్‌లతో పాటుగా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.