
మనీషా మృతదేహం తన బావిలో ఉందని తెలిసి అందరిలానే చుట్టూ నిలబడి చూశాడని, పైగా బావిలోకి ఎలా దిగాలో కూడా సలహాలిచ్చాడని
సాక్షి, బొమ్మలరామారం : ముగ్గురు ఆడపిల్లలను హతమార్చి ఏం ఎరుగనట్టు తమ మధ్యే తిరిగిన మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని గుర్తించలేకపోయామని హజీపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి గురించి విచారణలో వెల్లడవుతున్న విషయాలతో గ్రామస్థులు అవాక్కవుతున్నారు. అసలు శ్రీనివాస్ రెడ్డి గురించి అంతగా ఎవరికీ తెలియదని, అతను ఎక్కువగా ఊరిలో ఉండేవాడు కాదని, ఎవరితో అంతగా మాట్లాడేవాడు కాదని, ఇంత దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేదంటున్నారు. వరంగల్, కర్నూల్‌లో అతనిపై కేసులు నమోదైన విషయం కూడా తెలియదంటున్నారు. తొలుత శ్రావణి ఉదంతం బయటపడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి అందరిలానే ప్రవర్తించాడన్నారు. శ్రావణి మృతదేహం తన బావిలో ఉందని తెలిసి అందరిలానే చుట్టూ నిలబడి చూశాడని, పైగా బావిలోకి ఎలా దిగాలో కూడా సలహాలిచ్చాడని వాపోతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా?
శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? ఇంకెవరైన హస్తం ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యల సంఘటనలు పరిశీలిస్తే ఒక్కడి వల్ల సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒక్కడికి బావిలోకి దిగడం సాధ్యమే కాదు. ఐదేకరాల నిర్మానుష్య ప్రాంతం కావడం.. ఇక్కడ ఏం జరిగినా.. కనపడని, అరిచినా.. వినపడని నిర్మానుష్య ప్రాంతం కావడంతో శ్రీనివాస్ రెడ్డి తన నేరాలకు అనువుగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గరు అమయాక ఆడపిల్లలను బలి తీసుకున్న అతన్ని చంపేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.