
ఒబేద్
ఒబేద్ ఉర్ రెహ్మాన్‌కు బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న ప్రముఖుల్ని హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన ఉగ్రవాది ఒబేద్ ఉర్ రెహ్మాన్‌కు బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇతడి స్వస్థలం పాతబస్తీ ఉప్పుగూడలోని గుల్షన్‌కాలనీ. 2012లో ఈ కుట్రను ఛేదించిన బెంగళూర్ పోలీసులు ఒబేద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో 18 మందిని అరెస్టు చేశారు.
ఆపై ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. వీరిలో 13 మందిని దోషులుగా తేలుస్తూ న్యాయస్థానం ఈ నెల 16నే తీర్పు వెలువరించినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మగ్బూల్ కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే ఇతడికి మహ్మద్ అక్రమ్‌తో పరిచయమైంది. అప్పటికే ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అక్రమ్ పాస్‌పోర్ట్ సంపాదించుకున్నా... వీసా లభించలేదు.
ఈ విషయం మగ్బూల్‌కు చెప్పడంతో హైదరాబాద్ వెళ్లి ప్రయత్నాలు చేయమని సలహా ఇచ్చాడు. వీసా దొరికే వరకు ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉద్యోగం, చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పాడు. నగరానికి చెందిన కొందరి సహాయం తీసుకోమని వారి పేరు, వివరాలు అందించాడు. ఈ రకంగా అక్రమ్ 2011లో సిటీకి వచ్చాడు. సౌదీ అరేబియాకు వీసా ప్రయత్నాల్లో ఉంటూనే సైదాబాద్ ప్రాంతంలో జ్యూస్ సెంటర్ నిర్వహించాడు.
ఒబేద్ సమీప బంధువు మక్సూద్ సైతం నాందేడ్‌కు చెందినవాడే కావడంతో ఇతడికి మగ్బూల్‌తో పరిచయం ఉంది. దీంతో సైదాబాద్‌లో జ్యూస్ సెంటర్ నిర్వహిస్తున్న అక్రమ్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మక్సూద్ ఒబేద్‌ను కోరాడు. ఇలా ఒబేద్, అక్రమ్‌ల మధ్య పరిచయం పెరిగింది. అక్రమ్ దాదాపు మూడు నెలల పాటు ఈ వ్యాపారం చేసినా ఇక్కడున్న రోజుల్లో ఎప్పుడూ ఉగ్రవాద భావాలు ప్రదర్శించలేదు.
బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఎట్టకేలకు వీసా లభించడంతో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఓ పాకిస్తానీతో ఏర్పడిన పరిచయం ఫలితంగా ఉగ్రవాద బాటపట్టాడు. ఆ తర్వాత ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా ఒబేద్‌ను కూడా ట్రాప్ చేసి తన దారిలోకి నడిపించాడు. సిటీకి చెందిన ముగ్గురు ప్రముఖుల్ని టార్గెట్ చేసిన ఈ మాడ్యుల్ వారి వివరాలను ఒబేద్ ద్వారా సేకరించింది.
ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఒబేద్ సహా మొత్తం 18 మందని అరెస్టు చేయగా... 13 మందిపై నేరం రుజువైంది. ఎన్‌ఐఏ కోర్టు ఒబేద్‌కు వివిధ సెక్షన్ల కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది.