
అరవింద్ కేజ్రీవాల్
ఆదిత్య హృదయం
నమ్మండి.. నమ్మకపోండి, నేను అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించడం ప్రారంభిస్తున్నాను! గతంలో తాను పదే పదే దూషించిన, నిందలు మోపిన పలువురు వ్యక్తులకు ఇప్పుడు కేజ్రీవాల్ వరుస క్షమాపణలు చెబుతుండటం గుర్తించదగిన పరిణామం. కేజ్రీవాల్ తన తప్పును ఏమాత్రం అంగీకరించలేరని నేను భావించిన మాట నిజం. కాని కేజ్రీవాల్ ఆ పనిచేశారు. అదీ ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు... అనేకసార్లు క్షమాపణ చెప్పడం మరీ విశేషం.
మనలో చాలామందికి, క్షమాపణలు చెప్పడం అనేది అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి. బహిరంగంగా క్షమాపణలు వ్యక్తపర్చడం మరీ కష్టమైన పని. అందులోనూ మీరు సుపరిచితులై ఉండి క్షమాపణ చెబితే అది విస్తృతంగా జనంలోకి పోతుందన్న ఆలోచనే మీ వెన్నులో వణుకు తెప్పించే పరిస్థితిలో క్షమాపణ చెప్పడం విశేషమైనది. ఇలాంటి స్థితిలోనూ కేజ్రీవాల్ అంతపనీ చేశారు. తాను తీవ్ర ఆరోపణలు గుప్పించిన ముగ్గురు ప్రముఖుల్లో ప్రతి ఒక్కరికీ తాను ఇప్పుడు క్షమాపణ చెప్పారు.
వాస్తవానికి క్షమాపణ అనేది చాలా చిన్న పదం. కానీ ఆ పదాన్ని ఉపయోగించడానికి మన అహం చాలావరకు అనుమతించదు. క్షమాపణ చెప్పాలంటే మనం చాలా పెద్దవారిమని, సీనియర్లమనీ, కీలకమైనవారిమనీ లేదా సామాజికంగా అధికులమనే ఆలోచనలు మనకు వస్తుంటాయి. అందుకనే మనం తప్పు చేశామని గ్రహింపు కలిగినప్పటికీ, తప్పుచేయలేదనే మనం నటిస్తుంటాం. పైగా అదేమంత పెద్ద విషయం కాదనేలా వ్యవహరి స్తుంటాం. మన వ్యాఖ్యల ద్వారా ఇతరులకు మనం కల్గించిన బాధను, అలా వ్యాఖ్యానించడం ద్వారా మనం ఎదుర్కొనాల్సిన సంకట పరిస్థితిని కూడా మనం లెక్కబెట్టం.
ఇప్పుడు, తానెదుర్కొంటున్న పరువు నష్టం కేసులనుంచి ఏదోవిధంగా బయటపడటానికి కేజ్రీవాల్ తన గత వ్యాఖ్యలపట్ల క్షమాపణ చెప్పడానికి సిద్ధపడి ఉండవచ్చునని నాకు తెలుసు. పరువు నష్టం కేసుల్లో కొన్నింటిలో కేజ్రీవాల్ దొరికిపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఆ కేసుల్ని ఎదుర్కోవడంలో మనకు సంక్రమించే ఆర్థిక ఖర్చు అపరిమితం కావచ్చు. అయినా సరే, క్షమాపణ చెప్పే దమ్ము కేజ్రీవాల్‌కి ఉందన్న వాస్తవాన్ని ఇవేవీ పక్కదారి పట్టించలేవు.
దీనితో పోలిస్తే, మనలో చాలామందికి క్షమాపణ చెప్పే బలమైన వ్యక్తిత్వం ఉండకపోవచ్చు. నావరకు అయితే నేను కచ్చితంగా క్షమాపణ చెప్పే విభాగంలో ఉండను గాక ఉండను. నేను సందర్భవశాత్తూ సారీ చెప్పి ఉండవచ్చు కానీ నిజంగా క్షమాపణ చెప్పవలసిన సందర్భంలో నేను అరుదుగా మాత్రమే ఆ పని చేసి ఉంటాను. సన్నిహితంగా ఉండే, బాగా తెలిసిన వ్యక్తులకు క్షమాపణ చెప్పడం నాకు మరీ కష్టంగా ఉంటుంది. నాకు తెలిసిన వ్యక్తులకు క్షమాపణ చెప్పాలంటే నోరు రాకపోవచ్చు. పైగా అది చాలా కష్టంగా అనిపిస్తుంది కూడా. నా విషయంలో అయితే అలా క్షమాపణ చెప్పడం జరగదు.
అయినా సరే.. సారీ చెప్పడం పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తుందనే చెప్పాలి. అలా చెబితే ఎదుటి పక్షాన్ని అది నిరాయుధం చేస్తుంది, మిమ్మల్ని అత్యున్నత నైతిక శిఖరంపై కూర్చుండబెడుతుంది. మీరు సంబంధిత వ్యక్తులకు మీ వ్యాఖ్య ద్వారా కలిగించిన బాధను కాస్త తగ్గించే అవకాశాన్ని కూడా మీ క్షమాపణ కల్పిస్తుంది. మీరు నిజాయితీగా క్షమాపణ చెప్పలేదనిపించినప్పటికీ ఒకసారి క్షమాపణ అందుకున్న వ్యక్తి దాన్ని ఆమోదించకపోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
నిజానికి, మీ సొంతతప్పులు సృష్టించిన తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులనుంచి బయటపడేందుకు క్షమాపణ చెప్పడం అనేది తెలివైన ఎత్తుగడ. బహుశా ఢిల్లీ ముఖ్యమంత్రి మనసులో ఇదే ఉండవచ్చు. కానీ అసలు విషయం ఏదంటే ఆయన క్షమాపణ పనిచేసింది. కేజ్రీవాల్ చెప్పిన క్షమాపణను ఆమోదించకపోవడం దయారాహిత్యం అని ప్రత్యర్థులకు తెలుసు మరి. ఏదేమైనా ఒక స్వల్పమాత్రపు వివరణతో దీన్ని ముగించనివ్వండి. అరవింద్ కేజ్రీవాల్ కేవలం పశ్చాత్తాపం మాత్రమే వ్యక్తపరిచారు. నితిన్ గడ్కరీ కేసుకు సంబంధించి తాను సారీ అనే పదం ఉపయోగించలేదు. అయితే పశ్చాత్తాపాన్ని కూడా మనం క్షమాపణగా ఆమోదిస్తాం. అయినా, బాధాకరమైన వాస్తవాన్ని చెప్పి ఎవరినైనా బాధించిన సందర్భంలో కూడా మనం పశ్చాత్తాపం ప్రకటించినప్పటికీ క్షమాపణ చెప్పడం జరగలేదు.
ఒక స్థాయిలో ఇది వివాదాస్పద అంశమే కావచ్చు. క్షమాపణ చెప్పకుండానే కేజ్రీవాల్ తాను క్షమాపణ చెప్పినంత అభిప్రాయాన్ని కలిగించారు. మరోవైపున ప్రతి ఒక్కరూ ఆయన క్షమాపణ చెప్పారని అంగీకరించారు. అదే సమయంలో కేజ్రీవాల్ తన స్థాయిని కాస్త తగ్గించుకున్నారంటూ ఆయన పార్టీలో చాలామంది నిరాశ చెందారు. మొత్తంమీద చెప్పాలంటే, మీరేం అర్థం చేసుకున్నారన్నదే ముఖ్యం కానీ మీరేం చెప్పారు అన్నది ముఖ్యం కాదని ఈ ఉదంతం నిరూపిస్తోంది. అయితే క్షమాపణ చెప్పడం మీ ఉద్దేశం కాకపోయినట్లయితేనే అది చాలా చెడ్డ విషయం.
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net