సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రా భివృద్ధి నినాదంతో చేపట్టనున్న పోరాటాలకోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంలో సీపీఎం నాయకత్వం నిమగ్నమైంది.
ఐక్య వేదిక ఏర్పాటుకు సీపీఎం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రా భివృద్ధి నినాదంతో చేపట్టనున్న పోరాటాలకోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంలో సీపీఎం నాయకత్వం నిమగ్నమైంది. మహాజన పాదయాత్ర సందర్భంగా పార్టీకి దగ్గరైన ఆయా సామాజిక శక్తులు, వ్యక్తులు, సంస్థలు, మేధావులతో ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియను కొనసాగి స్తోంది. ప్రధానంగా వామపక్షాలు, సామాజిక సంఘాలను కలుపుకొని ఐక్య వేదికను ఏర్పాటు చేయాలనే దిశలో ప్రాథమిక కసరత్తును నిర్వహిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నందున, ఆ లోగా రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు ఏ మేరకు సాధ్యమనే దానిపై కూడా ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే ప్రజాగాయకుడు గద్దర్, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య, చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్ తదితరులతో ఒక విడత సంప్రదింపులు నిర్వహించింది.