
‘దేవిశ్రీ ప్రసాద్ సినిమా ప్రారంభంలో చిన్నపాటి భయం ఉండేది. కానీ, సినిమా చూశాక హ్యాపీగా ఉంది. మూడు పాత్రల మధ్య జరిగిన అసాధారణ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయన్నదే చిత్రకథ’’ అని మనోజ్ నందం అన్నారు. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందిని చిత్రం ‘దేవి శ్రీ ప్రసాద్’. యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న విడుదల కానుంది. మనోజ్ నందం మాట్లాడుతూ– ‘‘గతేడాది నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి, 25 రోజుల్లో పూర్తిచేశాం.
అయితే చిన్న నిర్మాతలు, సమస్యల వల్ల విడుదల ఆలస్యమైంది. వెంకటేష్‌గారికి మా సినిమా నచ్చడంతో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. సినిమాటోగ్రాఫర్ ఫణి మంచి విజువల్స్ అందించారు. సంగీత దర్శకుడు కమ్రాన్‌గారు నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. నా మరో చిత్రం ‘మనసైనోడు’ నవంబర్‌లో రిలీజవుతుంది. ‘వీరభోగ వసంతరాయులు’లో మంచి పాత్ర చేస్తున్నా. మహేశ్‌బాబుగారి సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది’’ అన్నారు.