
న్యూఢిల్లీ: రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు వ్యతిరేకంగా నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘జైల్లో పడిన బాధలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవు’ అని కోర్టు తేల్చిచెప్పింది. జైలులో పడిన కష్టాలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవంటూ జడ్జీలు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్న వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయసమీక్షకు అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది.
ముకేశ్‌ను 8నెలలకు పైగా జైలులో ఉంచారన్న పిటిషనర్ తరపు లాయర్ వాదనలను కోర్టు అంగీకరించలేదు. రాష్ట్రపతి వేగంగా పిటిషన్‌ను తిరస్కరించారన్న ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌ను వేగంగా తిరస్కరించారన్న ముకేశ్ అభియోగాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పు పట్టారు. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయాల్లో ఆలస్యాన్ని విమర్శిస్తూ గతంలో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. క్షమాభిక్ష కేసుల్లో ఆలస్యం అమానవీయమైనదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం, హోం శాఖ ముకేశ్ తిరస్కరణకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ 4రోజుల్లో పూర్తిచేసినట్టు కోర్టు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్ ఇంత వేగంగా తిరస్కరణకు గురవడంలో ఇది రికార్డు అని కోర్టు తెలిపింది.
రాష్ట్రపతికి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్..
నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్యూరేటివ్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. వినయ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నారు. వినయ్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్.. వినయ్ పిటిషన్‌ను తానే స్వయంగా అందజేసినట్టు వెల్లడించారు.