
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు ముందడుగు పడింది. ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వర్చువల్ ఐడీ(వీఐడీ)ని యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. పౌరుల వ్యక్తిగత గుర్తింపు లేదా ధ్రువీకరణ సమయంలో ఇకపై ఆధార్ బదులు వీఐడీని వెల్లడిస్తే సరిపోతుంది. ఈ విధానం జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది.
బీటా వర్షన్‌లో తెచ్చిన వీఐడీని ప్రస్తుతానికైతే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వీఐడీని జనరేట్ చేసుకోవాలి. ఆధార్ 12 అంకెల సంఖ్య కాగా దీనిలో 16 అంకెలుంటాయి. బ్యాంకింగ్, బీమా, మొబైల్ లాంటి సేవలు అందించే సంస్థలకు ఆధార్ బదులు వీఐడీని చెబితే సరిపోతుంది. జూన్ 1 నుంచి అన్ని సంస్థలు వీఐడీని తప్పనిసరిగా అంగీకరించాలంది.
ఆధార్ చట్టం న్యాయబద్ధమైనదే: కేంద్రం
ఆధార్ న్యాయమైన, హేతబద్ధ చట్టమేనని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గోప్యతా హక్కుపై కోర్టు ఇచ్చిన తీర్పుకు అది లోబడి ఉందని పేర్కొంది.