
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు జిల్లా రాజకీయం సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. కృష్ణానది జలాల అంశాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య కాకపుట్టిస్తున్నాయి. కృష్ణాబేసిన్ పరివాహక ఆయకట్టుకు నీటిని అందించిన ఘనత తమదేనని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకొని లబ్ధి పొందిన టీఆర్‌ఎస్ తిరిగి అదే ప్రచారంతో ముందుకెళుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు పాలమూరును పచ్చగా చేస్తామని చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్, బీజేపీలు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తుండగా, తాము అధికారంలోకి వస్తే జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. ఇక గట్టు ఎత్తిపోతల, నారాయణపేట–కొడంగల్ పథకాల విషయంలో టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
మాటల యుద్ధం షురూ!
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రాజెక్టులను చూపించే ఓట్లడుగుతోంది. ఇటీవల నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలోనూ ఈ అంశాన్నే కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలోని 16 సీట్లలో టీఆర్‌ఎస్ గెలిచి, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తే.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వాలని నీతిఆయోగ్ కేంద్రానికి సూచించినా.. బీజేపీ ప్రభుత్వం నయాపైసా ఎందుకివ్వలేదని, కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇక ఈ ప్రాజెక్టులన్నీ తమ ఘనతేనని, తమ హయాంలో చేపట్టినవేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. ఇదే అంశంతో ఇప్పటికే మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ అభ్యర్థి మల్లు రవి ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా ప్రకటిస్తామని ప్రచారం చేస్తున్నారు.
ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ, ఎన్నికల ముందు హడావుడిగా మొదలు పెట్టిన గట్టు ఎత్తిపోతల ఎందుకు ముందుకు పోవడం లేదని మల్లు రవి ప్రశ్నిస్తున్నారు. ఇక మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణ సాగునీటి విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి. పాలమూరులోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడం, షాద్‌నగర్ నీటి అవసరాలను తీర్చే ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఇక ఈ నెల 29న జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సైతం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏదైనా హామీ ఇస్తారా? అన్నది కీలకం కానుంది. వీటితోపాటే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలను పక్కనపెట్టి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగం చేయడంతో నారాయణపేట డివిజన్‌లోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల భూములకు చుక్కనీరు అందని పరిస్థితి తలెత్తుతుందనే అంశాన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌ను ఓడించాలని విపక్షాలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయి.
పాలమూరులోఓట్లు పారేదీ నీళ్లతోనే
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెం ట్‌ల పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో సాగునీటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు పార్లమెంట్‌ల పరిధిలో ఉన్న కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తోపాటు కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల, గట్టు, ఆర్డీఎస్ పథకాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. నెట్టెంపాడుతో గద్వాల, బీమాతో వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కోయిల్‌సాగర్‌తో మహబూబ్‌నగర్, కల్వకుర్తితో వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, శంషాబాద్ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తంగా వీటితో 8.77లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంలో.. ఇప్పటికే 6.50లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. ఈ ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో నీరందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అదీగాక ఈ ప్రాజెక్టుల కింద దాదాపు 700 చెరువులను నింపారు.
పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనే 10లక్షల ఎకరాల మేర సాగునీరందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ప్రాజెక్టుల కింద 6.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించిన ఘనత తమదేనని చెప్పుకోవడంలో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో ఏకంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13 స్థానాల్లో గెలిచారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొట్లాడిన కొల్లాపూర్ కాంగ్రెస్ నేత బీరం హర్షవర్దన్‌రెడ్డి ఒక్కరే గెలిచారు. అయితే ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పాలమూరు ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గానికి నీరందిస్తామన్న హామీతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటామని ప్రభుత్వం నుంచి అందిన హామీ మేరకే పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు.