వరుసగా మూడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకాలు తప్పలేదు. ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.
వరుసగా మూడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకాలు తప్పలేదు. తొలి రెండు రోజులు సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు సభను హోరెత్తించి వాయిదా వేయిస్తే మూడోరోజు బుదవారం నాడు పాకిస్థాన్ సైనికులు జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లోకి చొచ్చుకొచ్చి మరీ భారత సైనికులను హతమార్చిన వైనంపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఉభయ సభలను అట్టుడికించింది.
దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే పాకిస్థాన్ చెలరేగిపోతోందని, పదే పదే మన దేశం మీద దాడులకు పాల్పడుతూ జవాన్ల విలువైన ప్రాణాలను హరిస్తోందని బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజీనామా చేసి తీరాల్సిందేనని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని దునుమాడారు. రాజ్యసభలో రక్షణమంత్రి ఆంటోనీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని పార్లమెంట్‌లో బీజేపీ డిమాండ్ చేసింది. విపక్షాల గలభాతో లోక్‌సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.