Menopause Awareness Campaign
-
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్‌ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్‌లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి -
Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
ఏడాది వరకు నెలసరి రాకపోతే అప్పుడు దాన్నిమెనోపాజ్ గా పరిగణిస్తారు. సాధారణంగా 45 నుంచి 52 ఏళ్ల మధ్య మెనోపాజ్ వస్తుంది. తొలి లక్షణంగా నెలసరి క్రమం తప్పుతుంది. అంటే రెండు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి వస్తూంటుంది. తర్వాత ఒంట్లో వేడి ఆవిర్లు, నిద్రలేమి, గుండె దడ, అలజడి, ఆందోళన, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం, జీవనాసక్తి తగ్గడం, బరువు పెరగడం, ఒంటరితనం వంటివీ ఉంటాయి. మూడు, నాలుగేళ్ల వరకు కొనసాగే ఈ దశను ప్రీమెమెనోపాజల్ స్టేజ్ అంటారు. అయితే ఆ ఫేజ్‌లో ఉన్న అందరికీ ఆ లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరు ఏ లక్షణమూ లేక సాఫీగా ఆ దశను దాటేయవచ్చు. లక్షణాలు ఉంటే జీవనశైలిలో మార్పులు, యోగా, ఎక్సర్‌సైజ్‌తో మేనేజ్ చేయవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యమైన విషయం.. మెనోపాజ్ అని నిర్ధారణ అయ్యాక స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను కలవాలి. మెనోపాజ్ తర్వాత.. స్త్రీ మేనికి మెరుపు, నిగారింపునిచ్చేవి ఫిమేల్ హార్మోన్సే. మెనోపాజ్ తర్వాత వాటి ఉత్పత్తి లేక గ్లో కూడా తగ్గిపోతుంది. చర్మం సాగి, ముడతలు పడుతుంటుంది. వెజైనా పొడిబారి పోతుంది. లైంగికాసక్తి తగ్గిపోతుంది. బ్లోటింగ్ ఉంటుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలూ మొదలయ్యే చాన్స్ ఉంటుంది. అయితే వీటన్నిటికీ భయ పడాల్సిన పనిలేదు. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలి. డాక్టర్ సూచనల మేరకు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. వెజైనల్ డ్రైనెస్ సమస్య కోసం ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ మెడిసిన్స్ తీసుకోవచ్చు లేదా జెల్లీని ఉపయోగించొచ్చు. ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. మసాలా, వేపుళ్లకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. హెల్త్ చెకప్స్ మరచిపోవద్దు. మామోగ్రఫీ, పాప్‌స్మియర్ పరీక్షలు తప్పనిసరి. ఇంకో విషయం.. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ వచ్చింది. కాబట్టి.. పెద్దమనిషి అయిన అమ్మాయిల నుంచి 45 ఏళ్ల మహిళల వరకు ఈ వాక్సిన్ను తీసుకోవచ్చు. లైంగిక జీవితం మొదలుకాకముందే ఈ వాక్సిన్ తీసుకుంటే మంచిది. మెనోపాజ్ మూడు రకాలుగా వస్తుంది. ఒకటి.. సహజంగా వయసుతో వచ్చేది. రెండు.. వయసుతో సంబంధం లేకుండా జీవనశైలిలో మార్పులు, పొల్యుషన్, పెస్టిసైడ్స్ ఫుడ్ లాంటి వాటితో 40 ఏళ్లలోపే వచ్చే అర్లీ మెనోపాజ్. మూడవది.. శస్త్రచికిత్స ద్వారా గర్భసంచి, అండాశయాలను తొలగించడం వల్ల, క్యాన్సర్‌కు వాడే కొన్నిరకాల మందులు, రేడియేషన్ వల్ల కృత్రిమంగా వచ్చే మెనోపాజ్ మెనోపాజ్ లక్షణాల్లో ఒకటైన హాట్ ఫ్లషస్ను యూరప్, ఉత్తర అమెరికా దేశాలలో 60–90 శాతం మంది స్త్రీలు ఎదుర్కొంటున్నారని, వారితో పోలిస్తే ఆసియా ఖండంలో 10–20 శాతం మంది మహిళలు మాత్రమే ఈ సమస్యతో సతమతమవుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకు ఆసియా ఖండంలోని ఆహారపు అలవాట్లు అంటే వారు తీసుకునే ఆహారంలోని ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ దేశాల్లో మెనోపాజ్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నవారు కౌన్సెలింగ్, జీవనశైలిలో మార్పులతో ఆ దశను సమర్థంగా ఎదుర్కొంటున్నారట. ధూమపానం, ΄ పొగాకు, ఊబకాయం, స్పైసీ ఫుడ్, పొగలుగక్కే ఆహారం తినడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, మద్యం, థైరాయిడ్ గ్రంథి లోపాలు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివన్నీ హాట్ఫ్లషస్కి ప్రేరకాలు (ట్రిగర్) గా పనిచేస్తాయి. అయితే జీవన శైలిలో మార్పులు, వైద్య సలహా సూచనలతో ఆ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు నువ్వులు, గడ్డి నువ్వులు, అవిసె గింజలు, సోయా బీన్స్, ముల్లంగి, నట్స్, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటితోనూ మెనోపాజ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.మెనోపాజ్ అనేది సవాళ్లతో కూడిన మార్పు!‘శాస్త్రీయ అవగాహన ఉంటే సమర్థవంతంగా ఆ సవాళ్లను ఎదుర్కోవచ్చు.. ఆ మార్పును ఆస్వాదించొచ్చు’ అని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్లు డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ ఆలియా రెడ్డి!శిల్పా శెట్టి మొదలు ట్వింకిల్ ఖన్నా, శ్వేతా బచ్చన్ (జయ బాధురి, అమితాబ్ బచ్చన్ల కూతురు), టెలివిజన్ హోస్ట్ మినీ మాథూర్ లాంటి వాళ్లందరూ హాట్ ఫ్లషస్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొన్నవారే. ఆ లక్షణాల గురించి అవగాహనలేక చాలా ఇబ్బందులు పడ్డారట. వాళ్ల మూడ్ స్వింగ్స్‌ని చూసి కుటుంబ సభ్యులు నివ్వెర΄ోయేవారని, తామెందుకలా ప్రవర్తిస్తున్నామో అర్థంకాక .. ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఆందోళన చెందారని చెప్పారు. ఆ బాలీవుడ్ సెలెబ్స్ అందరూ ఇప్పుడు మెనోపాజ్ అవేర్నెస్ ప్రచారకర్తలుగా మారారు. మెనోపాజ్ దశ, లక్షణాల మీద విస్తృతంగా చర్చిస్తూ మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రీయ అవగాహన పెంచుకుంటూ.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే.. మెనోపాజ్ అన్నది స్త్రీ జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. దాన్నో జబ్బుగా పరిగణించకుండా శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటూ కుటుంబం ఆమెకు అండగా నిలబడాలి. జీవిత భాగస్వామి ఆమెకు ఓ ఫ్రెండ్‌గా మారాలి. పిల్లలు అమ్మ మానసిక పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆమెకు అనుకూలంగా మెలగాలి. ఇలాంటి వాతావరణం ఉంటే.. అది ఆమెకు హార్మోన్స్ కన్నా ప్రభావంతంగా పనిచేస్తుంది. మెనోపాజ్ మీద సమాజంలోనూ అవగాహన పెరగాలంటే ఆరోగ్యశిబిరాల్లో దాని మీద చర్చించాలి. మీడియా కథనాల ద్వారా ప్రచారం జరగాలి. అంతేకాదు మహిళ ఆరోగ్యాన్ని పాఠ్యాంశాల్లోనూ భాగం చేయాలి. – శిరీష చల్లపల్లి ఉమనోపాజ్ అర్థం చేసుకుందాం: నిర్వహణ సరస్వతి రమ -
Menopause: పాజ్ కాదు..కొత్త ఫేజ్...!
మార్పును అంగీకరిస్తేనే మనోనిబ్బరం, శక్తి తెలుస్తాయి.. స్త్రీలకు మెనోపాజ్ అలాంటి మార్పే! దాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి! అలా అంగీకరించాలంటే ఆ దశ మీద ముందు అవగాహన రావాలి. అవగాహన రావాలంటే మౌనం వీడాలి! ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రముఖ గాయని సునీత ముందుకు వచ్చారు.పాజ్ కాదు.. కొత్త ఫేజ్!‘‘మెనోపాజ్ మనకు చాలా దూరం అనుకునేవాళ్లలో నేనూ ఒకదాన్ని. కానీ అది మన శరీరంలో ఓ వలయంలా తిరుగుతూ మెల్లగా మన జీవితాన్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఒకరోజు హఠాత్తుగా మనలో చిత్రమైన ఒత్తిళ్లు మొదలవుతాయి. మూడ్ మారిపోవడం, అసహనం, చర్మం ముడతలు పడటం, నిద్రలేమి, ఒంటరితనపు వేదన.. ఇవన్నీ ఓ పెద్ద సవాలుగా మారుతాయి. అదే మెనోపాజ్. పైకి ఉచ్చరించలేని మౌనంగా భరించే మార్పు. అదొక భయంకరమైన ప్రయాణం. మన చేయిపట్టుకునే వాళ్లు లేక ఒంటరితనం ఆవహిస్తుంది. దిగులు తోడవుతుంది.అదృష్టమే.. కాని అరుదు!మెనోపాజ్ దశకు చేరేప్పటికి జీవితం నెమ్మదిస్తుంది. పిల్లలు సెటిలవుతారు. భర్తా బిజీ అయిపోతాడు. మన ఉద్యోగంలో పెద్దగా మార్పు కనపడదు. వీటన్నిటికి తోడు మెనోపాజ్ ఇబ్బందులు.. అంతా అయిపోయిందనే భావన. మనల్ని మనమే సహించలేని రోజులు, భర్తకు చెబితే అసహనంగా చూసే క్షణాలుంటాయి. పిల్లలతో షేర్ చేసుకోనివ్వని బిడియం. స్నేహితులతో మాట్లాడదామంటే వారు ఇంకా ఆ దశకు చేరనివారే! అమ్మ కూడా అర్థంచేసుకోలేదేమో అనిపిస్తుంటుంది.. ‘మా రోజుల్లో..’ అంటూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా నాస్టాల్జియాలోకి వెళ్లే ఆమె మాటలను వింటుంటే! మెనోపాజ్ స్టేజీని అర్థం చేసుకుని అండగా నిలబడే వాళ్లుంటే అదృష్టమే! కాని అది అరుదు! అందుకే మనల్ని మనమే సముదాయించుకోవాలి.. మోటివేట్ చేసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన మెడికేషన్ తీసుకోవాలి. మెనోపాజ్‌ను కొత్త ఫేజ్‌గా భావించాలి. అప్పటిదాకా నిర్వర్తించిన బాధ్యతల నుంచి వెసులుబాటు దొరికిందని ఆనందపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ స్వేచ్ఛను ఆస్వాదించాలి. మన శక్తిసామర్థ్యాలకు ఓ అవకాశం అనుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, అభిరుచులు, ఆసక్తులతో జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. వదిలేయకండి.. ఎంత సెల్ఫ్మోటివేషన్తో ఉన్నా కుటుంబం, ఫ్రెండ్స్ నుంచి ఆమెకు సపోర్ట్ అవసరమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లు తనతో మాట్లాడాలి.. తను అనుభవిస్తున్న స్థితి గురించి అడగాలని కోరుకుంటుంది. తనను వినాలని ఆశపడుతుంది. అందుకే ఆమెతో మాట్లాడాలి.. ఆమెను వినాలి.. ఆత్మీయంగా హత్తుకోవాలి. ఇవన్నీ ఆమెకు దివ్యౌషధాలు. కుటుంబ సభ్యులు ఆమెను వినడం వల్ల వాళ్లకు మెనోపాజ్ దశ పట్ల అవగాహన పెరిగి.. వర్క్‌ప్లేస్‌లోని మహిళలను అర్థంచేసుకుని సహానుభూతి చూపించగలుగుతారు. దీనివల్ల ఆడవాళ్లలో బిడియం పోయి.. ధైర్యం వస్తుంది. తమ ఇబ్బందుల గురించి చెప్పగలుగుతారు. ఆ స్టేజ్ ఎలా ఉంటుందో అమ్మాయిలూ గ్రహించగలుగుతారు. అప్పుడు ఆటోమేటిగ్గా మెనోపాజ్ పట్ల ఉన్న సైలెన్స్ బ్రేక్ అయ్యి అవేర్నెస్ పెరుగుతుంది. అందుకే ఆ దశను అనుభవిస్తున్న ఆడవాళ్లను ఒంటరితనానికి వదిలేయకండి. అప్పటిదాకా ఇంటిని.. ఇంట్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆమెకు తోడుగా నిలబడండి. ఈ ప్రయాణం మనది అనే భరోసానివ్వండి!’’ అంటూ ముగించారు సునీత. మెనోపాజ్ అనేది స్త్రీ జీవితంలో సహజమైన దశ. ఆ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల గురించి తరచూ మాట్లాడుతూ.. చర్చిస్తూ ఉంటేనే దానిపట్ల అవగాహన పెరుగుతుంది. మెనోపాజ్‌ను అనుభవిస్తున్న మహిళే కాదు కుటుంబ సభ్యులూ దాన్ని అంగీకరించాలి. ఆమె దైనందిన జీవితం సాఫీగా సాగడానికి తగిన సపోర్ట్ అందించాలి. మహిళలు కూడా తమ పట్ల వ్యక్తిగత శ్రద్ధను మరచిపోవద్దు. – జూహీ చావ్లా, నటి, పర్యావరణ ప్రేమికురాలు.మెనోపాజ్ అనేది సహజమైన స్థితి. దాన్ని అంగీకరించి.. కొత్త అభిరుచులు, కొత్త అవకాశాలు, కొత్త పనులతో ఆ దశలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ ట్రాన్సిషన్‌తో సరికొత్త జీవితాన్ని ఆరంభించాలి తప్ప అంతా అయిపోయిందనే నిరాశకు లోనుకాకూడదు. – నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’లోంచి!– శిరీష చల్లపల్లి -
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం
ప్యూబర్టీ, మాతృత్వంలాగే స్త్రీ జీవితంలో మెనోపాజ్ కూడా శారీరక, మానసిక మార్పులతో కూడిన సహజమైన దశ! అయితే... ఇది సాఫీగా సాగిపోయే దశ కాదు. కొన్ని హార్మోన్ల ఉత్పత్తి మందగించి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అవి స్త్రీ దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇంత తీవ్రమైన అంశం మన సాంస్కృతిక నేపథ్యం కారణంగా సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ సైలెన్స్ మెనోపాజ్ మీద అవగాహన కొరవడేలా చేస్తాయి. ఎంతలా అంటే సమాజం సంగతి అటుంచి మెనోపాజ్ ఎఫెక్ట్స్ మీద ఆ దశను అనుభవిస్తున్న స్త్రీలకే తెలియనంతగా! అందుకే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి... మెనోపాజ్ మీద విస్తృతమైన చర్చ కొనసాగాలి. అప్పుడే సమాజం ఆమెను అర్థం చేసుకోగలుగుతుంది. తన వంతు మద్దతు అందించగలుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో మెనోపాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది.‘నేనిప్పుడు ఫ్రిజ్ డోర్ ఎందుకు తెరిచానబ్బా..?’ ఎంత చించుకున్నా అరుంధతికి గుర్తు రావడం లేదు. ‘ముందిక్కడి నుంచి వెళ్లు...’ చిన్న విషయానికే పెద్దగా అరిచేసింది ప్రతిమ. కంగుతిన్నాడు భర్త. ఆఫీస్‌లో సీరియస్ వర్క్‌లో ఉన్న అపర్ణ ఒక్క ఉదుటన లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్వసాగింది. ఎందుకంత దుఃఖం వచ్చిందో తెలియదు ఆమెకు. పనిమీద ఏకాగ్రత కుదరట్లేదు వైశాలికి. మాలతికి జాయింట్ పెయిన్స్, నీలిమకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటోంది. విజయ డిప్రెసివ్‌గా ఫీలవుతోంది. దిగులు వెంటాడుతోంది. కారణం లేకుండానే ఆందోళన చెందుతోంది ప్రేమ. జీవనాసక్తి లేదు. గిరిజ అయితే కళావిహీనంగా మారిపోయింది. రజితకు ఉన్నట్టుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. క్షణంలో జ్వరమొచ్చినట్టుగా అయిపోతోంది. వీణకు నిద్ర కరవైంది. దాంపత్య జీవితం పట్లా ఆసక్తి పోయింది. దాంతో భర్త ఆమెను సాధిస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు.పైన చెప్పిన మహిళలవే కాదు 40– 50 మధ్య వయస్సు వనితలందరివీ దాదాపు అవే సమస్యలు! మెనోపాజ్ ఎఫెక్ట్స్! చిత్రవిచిత్రమైన ఆ పరిస్థితి అనుభవిస్తున్న వాళ్లకే అర్థంకాకపోతే కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బందికేం అర్థమవుతుంది.. వాళ్ల సహకారమెలా అందుతుంది! దీని మీద అవగాహన కల్పించేందుకు రమావైద్య, ఊర్వశి ఝా అనే వైద్యులు 1995 (ముంబై)లోనే తమ ప్రయత్నాన్నిప్రారంభించారు ‘ద ఇండియన్ మెనోపాజ్ సొసైటీ’ని స్థాపించడం ద్వారా ఇది ఇప్పటికీ తన సేవలను అందిస్తూనే ఉంది. జర్నలిస్ట్, రచయిత, మహిళా హక్కుల కార్యకర్త శైలీ చోప్రా కూడా ‘మెనోపాజ్’ మీద అవగాహన కల్పించేందుకు, దానికి సంబంధించిన మెడికల్ కేర్, కమ్యూనిటీ సపోర్ట్‌ను కూడగట్టేందుకు ఉద్యమిస్తున్నారు. మెనోపాజ్‌కి సంబంధించి విప్లవమే రావాలి అంటూ ఆమె రోడ్ షోస్ చేస్తున్నారు. గైనకాలజిస్ట్‌ల ప్రకారం వరుసగా పన్నెండు నెలలు నెలసరి రాకపోతే మెనోపాజ్ వచ్చినట్టే! రుతుక్రమంలోని స్త్రీలు తప్పించుకోలేని దశ అది! కానీ మన సాంస్కృతిక నేపథ్యం దీనిగురించి మాట్లాడనివ్వకుండా చేస్తోంది. దానిమీద విస్తృతమైన చర్చ జరిగితేనే అదో వినకూడని మాటలా కాకుండా సాధారణమైన అంశగా మారుతుంది. మెనోపాజ్ ఫేజ్‌లోని మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచన మొదలవుతుంది. ఆ దశలో వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం మొదలు శారీరక వ్యాయామం, ధ్యానం, ఎమోషనల్ బ్యాలెన్స్ లాంటివాటి మీద ఎరుక వస్తుంది. అప్పుడే మెనోపాజ్ ప్రభావాన్ని స్త్రీ సమర్థంగా ఎదుర్కోగలదు. ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ సాక్షి ఫ్యామిలీ కూడా శారీరక, మానసిక వైద్యనిపుణుల విశ్లేషణలు, వివరాలు, సలహాలు, సూచనలతో నేటినుంచి మెనోపాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను మొదలుపెడుతోంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019– 21) డేటా ప్రకారం..ప్రీమెచ్యూర్, అర్లీ మెనోపాజ్ గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతోంది. దానికి పేదరికం, నిరక్షరాస్యత వంటివి కారణాలుగా చూపెడుతోంది. మద్యపానం, ధూమపానం, పోషకాహారలోపం, బహిష్టు సమయంలో అపరిశుభ్రంగా ఉండటం, అనారోగ్య పద్థతులు అనుసరించడం కూడాప్రీమెచ్యూర్ మెనోపాజ్‌కి కారణాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక సంతానం,18 ఏళ్లకే తొలి కాన్పు, పన్నెండేళ్లు లేదా అంతకంటే చిన్నవయసులో రుతుక్రమం ప్రారంభం అవడం లాంటి వాటివల్లా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రిస్క్ పెరగొచ్చని తెలుపుతున్నాయి. దేశంలోని మిగిలినప్రాంతాల కన్నా బిహార్‌లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేట్ ఎక్కువగా కనబడుతోందని సర్వేల సారాంశం. అలాగే యాభై పైబడ్డాక కూడా నెలసరి కొనసాగిన వాళ్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువ.నలభై ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వచ్చేస్తే దాన్నిప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. మన దేశంలో 2.2 శాతం మంది మహిళలు ప్రిమెచ్యూర్ మెనోపాజ్‌లో ఉన్నట్లు అంచనా. నలభైనుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసులో గనుక మెనోపాజ్ దశ మొదలైతే దాన్ని అర్లీ మెనోపాజ్ అంటారు. ఈ దశలో ఉన్న మహిళల సంఖ్య 16. 2 శాతం.దేశంలో మెనోపాజ్ సగటు వయసు నలభై ఆరున్నరేళ్లు. అయితేప్రాంతాల వారీగా ఈ సగటు వయసులో తేడాలున్నాయి. దక్షిణ భారతదేశంలో 46 ఏళ్లు. ఉత్తర భారతంలో 45.5, మధ్య భారతంలో 47.8, పశ్చిమ భారతంలో 46.2, తూర్పు భారతంలో 47.3 ఏళ్లు.ముందు తరాల వారితో పోలిస్తే.. మెనోపాజ్ సింప్టమ్స్‌కి ఆధునిక జీవన శైలి, అధిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, రోజులో ఎక్కువ సమయం ఫోన్లలో గడపడం వంటివన్నీ కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.మెనోపాజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి ప్రతి మహిళా అవగాహన పెంచుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్‌లోని తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిస్పృహకు లోను కారాదు. – షబానా ఆజ్మీ, నటిమెనోపాజ్ దశలోని మహిళలు ముందు తమ పట్ల తాము శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల గురించి నిస్సంకోచంగా కుటుంబంతో చర్చించి, సపోర్ట్ అడగాలి. ఎమోషనల్ చాలెంజెస్‌కి డీలా పడిపోకుండా కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని నార్మలైజ్ చేసుకోవాలి. – ప్రీతి జింటా, నటి– సరస్వతి రమ(చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!)