weak trend
-
జీడీపీ.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ3లోనూ (2024 అక్టోబర్–డిసెంబర్) బలహీన ధోరణి ప్రదర్శించింది. జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నమోదైన ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.6 శాతం (తాజా సవరణకు ముందు 5.4 శాతం) నుంచి, డిసెంబర్ క్వార్టర్లో 6.2 శాతానికి పుంజుకున్నప్పటికీ.. క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)క్యూ3లో నమోదైన 9.5 శాతం రేటుతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు, ఆర్బీఐ అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువగానే నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పనితీరు బలహీనపడడం వృద్ధి రేటును తక్కువ స్థాయికి పరిమితం చేసింది. పట్టణ వినియోగం కూడా బలహీనంగానే కొనసాగింది. అదే సమయంలో వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకుతోడు ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచడం.. మెరుగైన వర్షాలకుతోడు పండుగల సీజన్లో గ్రామీణ వినియోగం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలి చాయి. డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసింది. నాలుగేళ్ల కనిష్టం.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5% వృద్ధిని (స్థిర కరెన్సీలో రూ.188 లక్షల కోట్లు) సాధిస్తుందని ఎన్ఎస్వో తన ద్వితీయ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో ఇది 6.4 శాతంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి కానుంది. క్రితం ఆర్థిక సంవత్సరం 9.2 శాతం కంటే కూడా తక్కువ. ఎన్ఎస్వో తాజా అంచనాల మేరకు జీడీపీ 6.5 శాతానికి పుంజుకోవాలంటే చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగైన పనితీరు చూపించాల్సి ఉంటుంది. రంగాల వారీ పనితీరు.. → స్థూల విలువ జోడింపు (జీవీఏ/ఆర్థిక కార్యకలాపాల తీరు) డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా ఉంది. → వ్యవసాయ రంగం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి పుంజుకున్నది. డిసెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు బలపడి 5.6 శాతం వృద్ధిని చూపించింది. అంతకుముందు త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) ఇది 4.1 శాతంగా ఉంటే, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 1.5 శాతమే కావడం గమనించొచ్చు. → తయారీ రంగంలో వృద్ధి సెపె్టంబర్ క్వార్టర్లో ఉన్న 2.1 శాతం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 3.5 శాతానికి చేరింది. అయినప్పటికీ క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో 14 శాతం వృద్ధి రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువే. → మైనింగ్‌లో వృద్ధి 1.4%కి పడిపోయింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 4.7%. → సేవల రంగం వృద్ధి రేటు క్యూ3లో 7.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 8.3 శాతం కావడం గమనార్హం. క్యూ4లో బలమైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడంతోపాటు, ఎగుమతులు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి. – అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు -
మూడు వారాల కనిష్టానికి పసిడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రెండ్ బలహీనంగా ఉండటం, జ్యువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల గతవారం బంగారం ధ ర మూడు వారాల కనిష్ట స్థాయికి చేరింది. ఈ వారంలో (సెప్టెంబర్ 17) అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు సమావేశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,098 డాలర్లకు తగ్గింది. ఆగస్ట్ 11 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. వారం ప్రారంభంలో పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా ముంబైలో 99.9 స్వచ్ఛత బంగారం ధర రూ.26,565 వరకు పెరిగి, చివరకు వారాంతానికి వచ్చేసరికి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా అంతక్రితం వారంతో పోలిస్తే రూ.435 తగ్గి రూ.26,110 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా రూ.26,415 వరకు పెరిగి, చివరకు రూ.435 క్షీ ణించి రూ.25,960 వద్ద ముగిసింది. పసిడి దిగుమతుల వెల్లువ..: అంతర్జాతీయంగా బంగారం ధ రలు తగ్గడంతో దేశంలోకి బంగారం దిగుమతులు బాగా పెరిగాయి. ఆగస్ట్‌లో బంగారం దిగుమతులు 120 టన్నుల మార్క్‌ను అధిగమించాయి. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే గరిష్ట స్థాయి. జూలై నెలలో బంగారం దిగుమతులు 89 టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఆగస్ట్ నెలలో బంగారం దిగుమతులు 50 టన్నులుగా ఉన్నాయి. -
రూపాయి మరింత డౌన్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో బలహీన ట్రెండ్‌తో పాటు డాలర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ మంగళవారం మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మరో 21 పైసలు క్షీణించి 62.76 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. కరెంటు అకౌంటు లోటు గణాంకాల విడుదలకు ముందు మార్కెట్ వర్గాలు ఆచితూచి వ్యవహరించడం సైతం రూపాయి తగ్గుదలకు కారణమైంది. ఫారెక్స్ మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదలైన గణాంకాల ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కరెంటు అకౌంటు లోటు.. రెట్టింపయ్యింది. 8.2 బిలియన్ డాలర్ల మేర పెరిగి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 1.6 శాతానికి చేరింది. సోమవారంనాడు రూపాయి మారకం విలువ 39 పైసలు క్షీణించింది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికన్నా ముందుగానే వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయన్న ఆందోళనలు మార్కెట్లను కుదిపేస్తుండటం రూపాయి మీద కూడా ప్రభావం చూపుతోంది.