Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Sri Rama Navami Wishes To Telugu People1
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామ‌చంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆద‌ర్శ‌నీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామ‌చంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆద‌ర్శ‌నీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.#SriRamaNavami— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2025

Ex DYCM Amjad Basha Brother Ahmed Basha Arrest2
కూటమి కుట్ర.. మాజీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్‌

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన చంద్రబాబు సర్కార్‌.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్‌ చేసింది. అహ్మద్‌ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అయితే, అహ్మద్‌ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్‌ చేసింది.

Delhi Priyanka Roller Coaster Accident Full Details3
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో సరదాగా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లడమే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. పార్క్‌లో జరిగిన ప్రమాదంలో తనకు కాబోయే భార్య చనిపోయింది.వివరాల ప్రకారం.. నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంక(24)తో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ తిరిగిన తర్వాత అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. హ్యాపీ మూమెంట్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది.దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా నిఖిల్‌ కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతిచెందిన ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. Delhi | A 24-year-old woman, Priyanka lost her life after falling from a roller coaster ride at Fun and Food Village in the Kapashera area of Delhi yesterday. She reportedly lost her balance and fell from the ride, sustaining severe injuries. Despite being rushed to a nearby…— ANI (@ANI) April 5, 2025

Sakshi Editorial On TDP Chandrababu Govt By Vardhelli Murali4
వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్‌!

‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్‌ సిక్స్‌’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్‌’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలిస్తారో గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఐదొందలకు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ... రైతులకు సంపూర్ణ రుణ మాఫీ. ఎన్నికల నాటికే 87 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరించారు. కానీ, ఏరు దాటడమే ముఖ్య మని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు.ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్‌ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ రైతుల సగటు రుణభారం రూ.2,45,554గా ఉన్నట్టు ఈ సమాధానం వెల్లడించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రైతుల రుణభారం అధికంగా ఉన్నది. ఇది చంద్రబాబు గద్దె దిగేనాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది?జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 2001 జూలై – 2002 జూన్‌ మధ్యకాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇది కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తయారుచేసిన లెక్కే. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినదే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు, క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బూటకపు హామీల అమలు తీరుకూ, జగన్‌ సంక్షేమ పథకాల అమలు తీరుకూ మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది ‘సూపర్‌ సిక్స్‌’. పది నెలల తర్వాత కూడా ఈ ఆరు పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌ను అందజేసి మమ అనిపించుకున్నారు. ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70 వేల కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్‌లో 17 వేల కోట్లే కేటాయించడాన్ని బట్టి రెండో సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి ‘పీ–ఫోర్‌’ అనే దానధర్మాల కార్యక్ర మాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. ఇక ‘సూపర్‌ సిక్స్‌’ జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్య క్రమాలన్నీ ఒక ఎత్తు – తాను పెంచి అమలుచేస్తున్న పెన్షన్‌ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండూ సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. కానీ ఈ పోలిక నిజమేనా? ‘సూపర్‌ సిక్స్‌’తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంపు ఒక్కదాన్నే చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేస్తున్నది. అది కూడా సంపూర్ణంగా కాదు! ఎస్సీ, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్‌ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ పది నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది.ఐదేళ్ళ పదవీకాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 2,73,756 కోట్ల రూపా యలను జనం ఖాతాల్లో వేసింది. ఇతర పథకాల (నాన్‌–డీబీటీ) ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్ళలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92 వేల కోట్లు. ఈ కాలంలో వరసగా రెండేళ్లు కోవిడ్‌ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్‌ సర్కార్‌ 66 లక్షల పైచిలుకు మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు సుమారుగా రెండు వేల కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో మూడు లక్షలమందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పెరుగుదల నెలకు ఏడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్‌ సర్కార్‌ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చుపెట్టిన 92 వేల కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవ రైనా ప్రశ్నిస్తే ‘ఎర్ర బుక్కు’లో పేరు రాసుకుంటారట!‘సూపర్‌ సిక్స్‌’ హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే ‘పీ–ఫోర్‌’ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌). దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి పది శాతం సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఉద్ధరించాలట! సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద, ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతే తేడా! కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధికాదాయ వర్గాలవారు ఎనిమిది లక్షల మందేనట! మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్‌కార్డు లున్న కుటుంబాలు కోటీ నలభై ఎనిమిది లక్షలు. చంద్రబాబు ‘పీ–ఫోర్‌’ సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ గణాంకాలను ఉటంకించారు.ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య ఈ లెక్కన రెండు శాతం కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్యే ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్థోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటూఇటుగా ఒక్కశాతం మందే పేదల బాధ్యత తీసు కోవాలి. తెల్లకార్డుల సాక్షిగా పేదలు 90 శాతం మంది. ఇందు లోంచి 70 శాతాన్ని తొలగిస్తూ 20 శాతం మంది పేదలను మాత్రమే ‘పీ–ఫోర్‌’ స్కీములోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలున్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ‘ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే! సభకొచ్చారు. మధ్య లోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు (సంపన్నులు) మాత్రం కూర్చునే ఉన్నార’ని పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చు కున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదనీ, ముందుచూపు ఉండదనీ, డబ్బున్నవాళ్లే పద్ధతైనవాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలు వస్తాయి. పేదల పట్ల చంద్ర బాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. చాలా ఉదంతాలున్నాయి. ఎస్‌.సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి.2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్‌ 135 ప్రకారం కార్పొరేట్‌ కంపెనీలన్నీ వాటి లాభాల్లో రెండు శాతానికి తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్ట బద్ధమైన బాధ్యత. దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశ వ్యాప్తంగా సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కింద 15 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే వెయ్యి కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పనిచేస్తే రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో రావచ్చు. ఈ సొమ్ముతో ఇరవై శాతం మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలో చిస్తున్నారు.ప్రతి పౌరునికీ జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి, వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చు నేలా చేసి, ‘ఒక అయ్యగారి సాయం పదివేలు, ఒక దొరగారి సాయం ఇరవై వేలం’టూ వేలం పాటలు పాడటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందుచూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయుంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీపడగలిగే లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి. దిద్దుబాటా... ఇంకో పొరపాటా?ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్‌ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్‌’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్‌ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్‌ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్‌ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్‌ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్‌’గా) పరిగణించేవారు. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ‘హైదరాబాద్‌ స్టేట్‌’ ఇండియన్‌ యూని యన్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్‌ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మలచాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయిలోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్‌సీయూకు చీఫ్‌ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగిపోయింది.మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్‌ అనుమతి కూడా లేకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరాలను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే!రద్దును సవాల్‌ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభు త్వానివేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికా రులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్‌ ద్వారా కమ్యూ నికేట్‌ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్‌ కట్టించింది.ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్‌ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లుబాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్‌ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్‌ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్‌లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందుపరిచారు.వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్‌ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 400 ఎకరాలే కాదు, మొత్తం రెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్‌’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్‌ వర్సిటీకి ఫ్యూచర్‌ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్‌ తెలుసుకోవానికి ప్రయోగించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్‌ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్‌ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Affordable homes sales drop by 9pc between January March Knight Frank5
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్‌..

ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 50 లక్షల లోపు ధర ఉండే అఫోర్డబుల్‌ గృహాల అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో విక్రయాలు 21,010 యూనిట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, సరఫరా తగ్గడం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది.నివేదిక ప్రకారం రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఖరీదు చేసే రెసిడెన్షియల్‌ సెగ్మెంట్లో కూడా విక్రయాలు 6 శాతం తగ్గి 26,832 యూనిట్లకు క్షీణించాయి. మార్చి త్రైమాసికంలో ఎక్కువగా ప్రీమియం కేటగిరీపైనే గృహాల కొనుగోలుదారులు దృష్టి పెట్టినట్లు రిపోర్ట్‌ పేర్కొంది. రూ. 1 కోటి పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు పెరగడం ఇందుకు నిదర్శనంగా వివరించింది.హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై తదితర 8 నగరాల్లో నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం..రూ. 1–2 కోట్ల రేటు ఉన్న గృహాల విక్రయాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరాయి. అలాగే రూ. 2–5 కోట్ల కేటగిరీలో 28 శాతం వృద్ధి చెంది 13,735 యూనిట్లు, రూ. 5–10 కోట్ల విభాగంలో విక్రయాలు ఏకంగా 82 శాతం పెరిగి 3,448 యూనిట్లుగా నమోదయ్యాయి.రూ. 10–20 కోట్ల కేటగిరీలో అమ్మకాలు రెట్టింపై 658 యూనిట్లకు చేరాయి. రూ. 20–50 కోట్ల విభాగంలోనూ రెండు రెట్లు పెరిగి 92 యూనిట్లుగా నమోదయ్యాయి. రూ. 50 కోట్ల పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు అనేక రెట్లు పెరిగి 169 యూనిట్లకు చేరాయి.రూ. 2 కోట్ల ధర శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరడం.

Man From Odisha Accuses Wife of Mental Harassment, Jumps Before Train6
నా భార్య నన్ను టార్చర్‌ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’

భువనేశ్వర్‌ : ‘నాకు పెళ్లై రెండేళ్లవుతుంది. పెళ్లైన నాటి నుంచి నా భర్య నన్ను మానసికంగా వేధిస్తోంది. ఆమె వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇక నాకు చావే శరణ్యం’ అంటూ ఓ భర్త కదులుతున్న ట్రైన్‌ ఎదురు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ దుర్ఘటన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈస్ట్‌ కోస్ట్‌ డివిజన్‌ రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం ఖోర్ధాజిల్లా కుంభార్బస్తా (Kumbharbasta) కు చెందిన రామచంద్ర బర్జెనా కదులుతున్న ట్రైన్‌ నుంచి ప్రాణాలు తీసుకున్నాడు. దుర్ఘటనకు ముందు ఓ వీడియోను తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు.ఆ వీడియోలో ‘నేను రామచంద్ర బర్జెనాను. నేను కుంభార్బస్తాలో ఉంటాను. ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అందుకు కారణం నా భార్య రూపాలీనే. రూపాలీ నన్ను మెంటల్‌ టార్చర్‌ చేస్తోంది. ఇక నేను బ్రతకలేను’ అని విలపిస్తూ వీడియోలో చెప్పాడు. వీడియో తీసిన అనంతరం, నిజిఘర్-తపాంగ్ రైల్వే ట్రాక్ సమీపంలో కదులుతున్న రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు రామచంద్ర, రూపాలీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికో కుమార్తె. అయితే, పెళ్లైన నాటి నుంచి భార్య రూపాలి.. భర్త రామచంద్రను మానసికంగా వేధిస్తుండేది. అది సరిపోదున్నట్లు మెట్టినింట్లో చిచ్చుపెట్టేది. ఇవన్నీ తట్టుకోలేక రామచంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రామచంద్ర ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రామచంద్ర తీసిన వీడియో ఆధారంగా భార్య రూపాలీని అరెస్ట్‌ చేశారు. Odisha: Unable to endure relentless torture from his wife, a young man tragically ended his life. The incident occurred in Kumarabasta village of Khordha district. The deceased has been identified as Ramchandra Badjena. Before his death, Ramchandra posted a video on social media,… https://t.co/hmwt0hzaEx— ସତ୍ୟାନ୍ୱେଷୀ/सत्यान्वेषी/Satyanweshi (@imsatyanweshi) April 5, 2025 రామచంద్ర ఆత్మహత్య తర్వాత అతని తల్లిదండ్రులు.. కోడలు రూపాలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నా కుమారుడు రామచంద్రకు రూపాలీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి కూడా మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేశాం. పెళ్లైన నాటి నుంచి రూపాలీ నా కొడుకుని చిత్ర హింసలు పెట్టేది. పాప పుట్టింది. తరుచూ మెట్టి నుంచి పుట్టింటికి వెళ్లేది. పుట్టింటికి వెళ్లకపోతే నన్ను నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండేది. అయినప్పటికీ, అత్త కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రూ.20లక్షలు అప్పుగా ఇచ్చాం. కానీ రూపాలీ తీరు మారలేదు. నా కొడుకు ఆమె చేతిలో నరకాన్ని అనుభవించాడు. ఆమె క్రూరత్వానికి ఫలితం ఇదే. మాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Actress Abhinaya Wedding Date Will Be Confirmed7
అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్‌)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్‌ బిజీగా ఉన్నారట. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్‌లోనే ఎక్కువగా పాపులర్‌ అయింది. ఇక్కడ 'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్‌లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.అభినయ, సన్నీ వర్మల వివాహాం ఏప్రిల్‌ 16న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్‌ హాల్‌లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. అభినయ పుట్టుకతోనే మాటలు రావు, వినిపించవని తెలిసిందే. అయినప్పటికీ తన టాలెంట్‌తో సినిమాల్లో రాణించింది. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినయ పంచుకుంది. తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

Kerala employee walking on knees Failing Reach targets8
మీరు ఉద్యోగం సరిగా చేయడం లేదు.. ‘కుక్కలా నడవండి’ అంటూ..

తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారికి అప్పగించిన టార్గెట్స్‌ రీచ్‌ కాకపోవడంతో వారికి వేధింపులకు గురిచేశారు. శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. కేరళలో కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థకు రాష్ట్రంలో పలుచోట్ల బ్రాంచ్‌ ఉన్నాయి. ఈ ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సదరు మార్కెటింగ్‌ కంపెనీల్లో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, సంస్థలో ఉద్యోగులకు యాజమాన్యం టార్గెట్స్‌ నిర్ధేశించింది. కచ్చితంగా టార్గెట్స్‌ రీచ్‌ కావాలనే నియమం విధించారు. దీంతో, టార్గెట్‌ పూర్తి చేయని ఉద్యోగులను సదరు సంస్థ వేధింపులకు గురిచేసింది.ఉద్యోగులను శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా.. అతడిని మరో వ్యక్తి మోకాళ్లపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ.. నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తిచేయని ఉద్యోగులపై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.100% literate State Kerala: Shocking video claiming to be of Employees of a company getting punished for missing Sales Targets goes viral....allegedly they were forced to Crawl, Lick spit & Bark like dogs. pic.twitter.com/0nnHje5oNO— Megh Updates 🚨™ (@MeghUpdates) April 5, 2025ఇక, దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ అమానవీయ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని కార్మికశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే, యజమాని మాత్రం ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది. దీనిపై ఉద్యోగులు ఇప్పటివరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

IPL 2025: Rajasthan Royals thrash Punjab Kings by 50 runs9
రాయల్స్‌ ఘనవిజయం

మూల్లన్‌పూర్‌: తొలి రెండు మ్యాచ్‌లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్‌ రాయల్స్‌ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్‌ పరాగ్‌ (25 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. జైస్వాల్, సామ్సన్‌ తొలి వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్‌ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేయగా, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్‌వెల్‌ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) ఫెర్గూసన్‌ 67; సామ్సన్‌ (సి) అయ్యర్‌ (బి) ఫెర్గూసన్‌ 38; పరాగ్‌ (నాటౌట్‌) 43; నితీశ్‌ రాణా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) యాన్సెన్‌ 12; హెట్‌మైర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) అర్ష దీప్ 20; జురేల్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–35–1, యాన్సెన్‌ 4–0–45–1, ఫెర్గూసన్‌ 4–0–37–2, మ్యాక్స్‌వెల్‌ 1–0–6–0, చహల్‌ 3–0–32–0, స్టొయినిస్‌ 4–0–48–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్షి (బి) ఆర్చర్‌ 0; ప్రభ్‌సిమ్రన్‌ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) ఆర్చర్‌ 10; స్టొయినిస్‌ (సి) అండ్‌ (బి) సందీప్‌ 1; వధేరా (సి) జురేల్‌ (బి) హసరంగ 62; మ్యాక్స్‌వెల్‌ (సి) జైస్వాల్‌ (బి) తీక్షణ 30; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 10; సూర్యాంశ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) సందీప్‌ 2; యాన్సెన్‌ (సి) హెట్‌మైర్‌ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్‌ 1; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–25–3, యు«ద్‌వీర్‌ 2–0–20–0, సందీప్‌ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1.

Sri rama navami celebrations in bhadrachalam10
సీతారాముల కల్యాణము చూతము రారండి!

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో నేడు సీతారాముల కల్యాణం జరగనుంది. ఆ వివాహ వేడుక వివరాలు.. భజంత్రీలు, కోలాటాలతో స్వాగతం..ఉదయం 9:30 గంటల తర్వాత శంఖు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతమ్మతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకొస్తారు. కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. జై శ్రీరామ్‌ నినాదాల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్లు చేరుకుంటారు. మండప శుద్ధికల్యాణ మండపానికి చేరుకున్న సీతారాములు, లక్ష్మణుడిని అక్కడ వేంచేపు చేస్తారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. పుణ్యాహవచన మంత్రాలతో కల్యాణ వేడుకలకు ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణం, వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.రాముడి ఎదురుగా సీతమ్మ..శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటివరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెడతారు. శ్రీరాముడు సింహాసనంపై ఆసీనులు కాగా సీతమ్మ గజాసనంపై ఆసీనులవుతారు. సీతారాముల వంశగోత్రాల ప్రవరలు చెబుతారు.సీతారాములు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత ద్వాదశ దర్భలతో తయారుచేసిన యోక్త్రంతో సీతమ్మకు యోక్త్రా బంధనం చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భస్థ దశలో కలిగే దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. మరోవైపు శ్రీరాముడు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడనే దానికి సూచనగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. యజ్ఞోపవీతధారణ, యోక్త్రాబంధన కార్యక్రమాలు జరిగిన తర్వాత శ్రీరాముడి పాదప్రక్షాళనతో వరపూజ నిర్వహిస్తారు.అలంకరణలుకల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. సీతారాములకు తేనె, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేస్తారురాష్ట్ర ప్రభుత్వం తరఫున, శృంగేరీ పీఠంలతో పాటు భక్తరామదాసు, తూము నర్సింహదాసు వంశస్తుల తరఫున వధూవరులకు పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.కన్యాదానంవేదమంత్రాలను ఉచ్ఛరిస్తూ కన్యాదానం సందర్భంగా భూదానం, గోదానం చేస్తారు. అనంతరం మహాసంకల్పం, చూర్ణిక పఠనం గావిస్తారు. మంగళాష్టకాలు జపిస్తూ శ్రీరాముడికి సంబంధించి ఎనిమిది శ్లోకాలను, సీతమ్మకు సంబంధించి ఎనిమిది శ్లోకాలను పఠిస్తారు. ఈ మంగళాష్టకంలో వధూవరులకు సంబంధించిన ఏడు తరాల వివరాలను, ఘనతలను తెలియజేస్తారు. అభిజిత్‌ లగ్నంలో..చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్‌ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది, సాధారణంగా నవమి రోజున అభిజిత్‌ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయిస్తారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/«ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేస్తారు. అనంతరం మంగళ హారతి అందిస్తారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. తలంబ్రాలు..ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ భద్రాచల రామయ్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్‌ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము!ఆలయ నిర్మాణం సహా సీతారాములకు ఆభరణాల తయారీమ్యూజియంలో కంచర్ల గోపన్న ఆభరణాలుభద్రాచలం: హస్నాబాద్‌ (పాల్వంచ) తహసీల్దార్‌గా పని­చేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీసీతారాముల ఆల­యం నిర్మించాడని తెలిసిందే. అయితే, ఆయన ఆల­యాన్ని నిర్మించడమే కాకుండా.. సీతారామ లక్ష్మణులకు పలు ఆభర­ణాలను ఆ సమయంలోనే తయారు చేయించా­డు. వీటిని ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భక్తు­లకు అందు­బాటులో ఉంచారు. ప్రధాన ఉత్సవాలైన ము­క్కో­టి, శ్రీరామనవమి రోజుల్లో ఈ ఆభరణాలను మూలవ­రు­లు, ఉత్సవ విగ్రహాలకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.భద్రశిల మహత్మ్యం భద్రగిరిపై శ్రీ సీతారామచంద్రస్వామి వారి కరుణా కటాక్షాల కోసం భద్ర మహర్షి కఠోర తపస్సు చేశాడు. రామాలయం ప్రాంగణంలో గర్భగుడి వెనుక ఇప్పటికీ భద్రుని శిల.. చరిత్రకు నిదర్శనంగా దర్శనమిస్తోంది. ఆ మహర్షి కఠోర తపస్సుకు సంతుష్టుడైన శ్రీరామన్నారాయణుడు.. శంఖుచక్రాలతో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి అవతారంలో సాక్షాత్కరించిన తపో భూమి భద్రాచలమని భక్తులు భావిస్తారు. ఇంతటి చారిత్రక నేపథ్యం గల ఈ శిలను తాకేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. భద్రుడికి గుడి కట్టించి పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం తొలుత భద్రగిరి, అనంతరం భద్రాచలంగా ప్రఖ్యాతి గాంచింది. అదరహో... శిల్పకళా నైపుణ్యంజగదభిరాముడికి భద్రాచలంలో జరిగే కల్యాణం ఎంతో ప్రత్యేకమైంది. ఈ కల్యాణం నిర్వహించే మండపం మొత్తాన్ని శిలతోనే నిర్మించారు. దీనిపై రామాయణ ఇతివృత్తాలకు చెందిన అనేక అపురూప శిల్పాలను చెక్కారు. ఈ శిల్పాలను నాటి మ­ద్రాస్, ప్రస్తుత చెన్నైకి చెందిన గణపతి స్థపతి నేతృత్వంలో చె­క్కారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా అలంకరించి కల్యాణా­న్ని ఇదే వేదికపై జరుపుతారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని.. మొదట్లో ఆలయంలోని పొగడ చెట్టు ముందున్న రామకోటి స్తూపం వద్ద నిర్వహించేవారు. ఆ తర్వాత చిత్రకూట మండపంలో వేదిక నిర్మించి కల్యాణం జరిపేవారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెర­గడంతో.. రామాలయానికి సమీపంలో 1960 మే 30న ప్రస్తుత కల్యాణ మండపానికి అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళితో శంకుస్థాపన జరిగింది. దీన్ని 1964 ఏప్రిల్‌ 6న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డితో ప్రా­రంభించి.. అదే రోజు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆ తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకం సంద­ర్భంలో.. 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కల్యా­ణ మండపం ప్రాంగణంలో.. స్టేడియం మాదిరిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టే­డి­యంలో ప్రస్తుతం 35 వేలమంది భక్తులు కూర్చుని స్వామి­వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంది.సుదర్శన చక్ర దర్శనం.. సర్వ పాపహరణంభద్రగిరిపై కొలువుదీరిన మూలమూర్తులకు ఎంతటి ప్రత్యేకత ఉందో.. ప్రధాన ఆలయంపైను­న్న గోపురంపై సుదర్శన చక్రానికీ అంతే ప్రత్యేకత ఉంటుంది. భక్త రామదాసు రామా­ల­యాన్ని ప్రత్యే­క రాతి శిల్పాలతో నిర్మించాక.. ఆల­య శిఖరంపై విమాన ప్రతిష్ట కోసం సుదర్శన చక్రం తయారు చేయించాలని నిర్ణయించారు. ఇలా సుదర్శన చక్రా­న్ని ఎంతమందితో తయారు చేయించినప్పటికీ అది భిన్నం (ముక్కలు) అయి­పోయేదట. భక్త రామ­దాసు చివరకు రామయ్య తండ్రిని ప్రార్థించగా.. స్వామివారు స్వప్నంలో కనిపించి మానవుడు నిర్మించిన ఏదీ ఇందుకు పనికిరాదని, గోదావరి నదిలో సుదర్శన చక్రం ఆవిర్భవించి ఉందని చెప్పినట్లు పురాణం చెబు­తోంది. దీంతో నాలుగు వందల మంది గోదావరి నదిలో దానికోసం వెతికినా.. కనిపించలేదు. రామదాసు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రస్వామి వారిపై కీర్తనలు ఆలపించగా.. సుదర్శన చక్రం గోదావరి నదిలో దొరికిందట. ఇలా గోదావరి నదిలో దొరికిన సుదర్శన చక్రాన్ని ఆలయ గర్భగుడిపై భక్త రామదాసు ప్రతిష్టించారు.రాములోరి మొదటి కల్యాణం గర్భగుడిలోనే..నేడు తెల్లవారుజామున రెండు గంటలకే పూజలు మొదలుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సాధారణ రోజుల్లో తెల్లవారు­జామున నాలుగు గంటల తర్వాత సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఆ తర్వాత తిరువా­రాధన, మంగళాశాసనం, అభిషేకం తదితర పూజ­లు నిర్వహిస్తారు. కానీ శ్రీరామనవమిని పురస్కరించుకుని గర్భగుడిలో ఉన్న సీతారాములను రాత్రి రెండు గంటల సమయంలోనే మేల్కొల్పుతారు. ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయంలో భద్రాచలం ఆలయం గర్భగుడిలో ఉన్న మూల విరాట్‌లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరుపుతారు. 40 నిమిషాల వ్యవధిలోనే ఈ తంతును ముగిస్తారు.ఆ రోజుల్లో పొగడ చెట్టు నీడలో..శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడలో సీతారాముల కల్యాణం నిర్వహించేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో పొగడ చెట్టు నుంచి బేడా మండపంలోకి పెళ్లి వేదికను మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. బేడా మండపంలో అంతమంది వీక్షించే పరిస్థితి లేకపోవడంతో ఆలయ ప్రాంగణం నుంచి బయట కల్యాణం జరి­పిం­చా­లని నిర్ణయించారు. దీంతో ఉత్తర ద్వారానికి ఎదురుగా నవమి కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాన్ని 1964లో నిర్మించారు. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎత్తైన కల్యాణ మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా చుట్టూరా భక్తులు చేరి చూసేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1988లో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.పెళ్లి పెద్దలుగా..శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వేద పండితులను భద్రాచలం తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన వారిలో కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి ఇంటిపేర్లు గల కుటుంబాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాలే వంశపారంపర్యంగా, వంతుల వారీ­గా నవమి వేడుకల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతా­రాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్స­వా­లలో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయ­నకు సూచనలను అందించే వ్యక్తిని బ్రహ్మగా పే­ర్కొంటారు. వీరిద్దరికి సహాయకులుగా ఇద్దరు చొ­ప్పున నలుగురు రుత్వికులు ఉంటారు. పూజా సా­మగ్రి అందించేందుకు నలుగురు పరిచారకులు ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధర్వులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరిని ఉత్సవాలలో భాగస్వామ్యం చేస్తూ కల్యాణ తంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా స్థానాచార్యులు స్థలశాయి పెద్దన్న పాత్రను నిర్వర్తిస్తారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement