
తొలిరోజు హాజరు నామమాత్రం
● వేసవిలో ఇంటర్ తరగతులపైవిద్యార్థుల అనాసక్తి
● ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
సాక్షి,పాడేరు: జిల్లాలోని జూనియర్ కాలేజీలు మంగళవారం తెరుచుకున్నాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమైనప్పటికీ విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. విద్యారంగంలో సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ ఒక్కరికీ రుచించడం లేదనేది తేటతెల్లమవుతోంది. ఏటా వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ తాజా పరిణామాలతో ఇటీవలే పరీక్షలు రాసి.. వేసవి సెలవుల మూడ్‌లోకి వెళ్లిన విద్యార్థులను కాలేజీలకు రండి అని కబురు పంపినా, వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు 17 గురుకుల కళాశాలలు, 19 కేజీబీవీలు,ఐదు హైస్కూల్ ప్లస్ విద్యాలయాలు ఉన్నాయి.ఈ విద్యాలయాల్లో ఆరు వేలమంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు.వారంతా తొలిరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులకు హాజరుకావాల్సి ఉండగా, కేవలం 10శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 30 మంది, హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 24 మంది ఇంటర్ విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.