
గిరిజన రైతులు పథకాలు అందిపుచ్చుకోవాలి
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను గిరిజన రైతులు అందిపుచ్చుకోవాలని, ఇందుకు ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం నిర్వహించిన వ్యవసాయశాఖ ప్రైమరీ సెక్టార్ సమావేశంలో పీవో మాట్లాడారు. గిరిజన రైతులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని, అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన రైతుల జాబితాను, చనిపోయిన గిరిజన రైతుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఈ ఏడాది వ్యవసాయ వృద్ధి రేటు పెంచే విధంగా రైతులకు సూచనలు , సలహాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు.సచివాలయాల సిబ్బందిని వ్యవసాయాభివృద్ధికి వినియోగించుకోవాలని తెలిపారు. వీడీవీకేల ద్వారా జీడిమామిడి పిక్కలను కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఏడీఏ సీహెచ్ కె.వి. చౌదరి, పీఏవో ఎల్.రాంబాబు, డీడీ షరీష్, కె.సావిత్రి, ఏవో కె.లక్ష్మణ్‌రావు, వెంకటేశ్వర్లు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. స్థానిక పీఎంఆర్‌సీ ప్రాంగణంలో గల వివిధ కార్యాలయాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సెలవు రోజుల్లో మినహా పనిదినాల్లో తప్పనిసరిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.