
కడప సిటీ/కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15, 16వ తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి.. ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరవుతారు. పట్టు వస్త్రాలను సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు.
రాత్రికి కడప నగరానికి చేరుకుని, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 16వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.