
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల అన్యాక్రాంతం, మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి జరిగిన భూముల అక్రమాలపై విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం నివేదికను సమర్పించనున్నారు. ఈ వ్యవహారంపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పవర్దన్‌ల కమిటీ విచారణ చేపట్టి సింహాచలం, విజయనగరం ప్రాంతాల్లో పర్యటించింది. పంచగ్రామాలను సందర్శించి.. అక్కడ ప్రజల నుంచి వివరాలు సేకరించింది. విశాఖ దేవదాయ శాఖ ఉపకమిషనర్ కార్యాలయంలో సింహాచలం దేవస్థానం రికార్డులు, ఆస్తుల జాబితా ప్రాపర్టీ రిజిస్టర్‌లను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక రూపొందించింది. దీన్ని రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావుకు శుక్రవారం సమర్పించనుంది.