
వీరఘట్టం/పాలకొండ: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం (81) సోమవారం రాత్రి 7.30 గంటలకు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగృహం పాలకొండలో శ్వాసకు సంబంధించి సమస్య ఎదురుకావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని జెమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
దివంగత సీఎం వైఎస్సార్‌తో అప్పట్లో నేరుగా మాట్లాడే వ్యక్తి పాలవలస. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ కాగా, ఆయన కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. సతీమణి పాలవలస ఇందుమతి రేగిడి జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
వైఎస్ జగన్ పరామర్శ
రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్‌ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్‌లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు.