పాత కుట్ర.. కొత్త సిరా! | Jail Superintendent reports that Chaitanya Reddy did not meet Dastagiri in jail | Sakshi
Sakshi News home page

పాత కుట్ర.. కొత్త సిరా!

Published Sat, Feb 8 2025 5:26 AM | Last Updated on Sat, Feb 8 2025 6:52 AM

Jail Superintendent reports that Chaitanya Reddy did not meet Dastagiri in jail

వైఎస్‌ వివేకా హంతకుడు దస్తగిరి ద్వారా బాబు పన్నాగం

డాక్టర్‌ చైతన్యరెడ్డి తనకు కడప జైలులో రూ.20 కోట్లు ఆఫర్‌ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు 

వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు 

గతంలో ఇదే ఆరోపణలతో దస్తగిరి వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు  

దస్తగిరిని జైలులో చైతన్యరెడ్డి కలవలేదని నివేదిక ఇచ్చిన జైలు సూపరింటెండెంట్‌ 

కూటమి ప్రభుత్వం వచ్చాక ఐజీ స్థాయి అధికారి విచారణలోనూ అదే నిర్ధారణ 

అయినా సరే తప్పుడు ఫిర్యాదుతో తాజాగా అక్రమ కేసు నమోదు 

గతంలోనే నివేదిక ఇచ్చిన ఘటనపై దిగువ స్థాయి అధికారితో మళ్లీ విచారణ 

సీఎం చంద్రబాబుతో నర్రెడ్డి సునీత భేటీ తరువాత వేగం పుంజుకున్న కుట్ర కథ 

సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు సర్కారు రంగంలోకి దిగింది! తానే స్వయంగా వైఎస్‌ వివేకాను హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అక్రమ కేసు నమోదు చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దస్తగిరి గతంలో న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కొట్టివే సినప్పటికీ... అదే ఫిర్యాదుపై తాజాగా కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయడం అందుకు నిదర్శనం. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం రూపుదిద్దుకున్న కుట్ర కార్యాచరణను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. 

బెడిసికొట్టిన పన్నాగం..
వైఎస్‌ వివేకా హంతకుడు దస్తగిరి ద్వారా నర్రెడ్డి సునీత దంపతులు గతంలో వేసిన పన్నాగం బెడిసికొట్టింది. 2023 నవంబరులో తాను కడప జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి తనను కలసి బెదిరించినట్లు దస్తగిరి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు. జైలులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ సందర్భంగా చైతన్య రెడ్డి జైలులోకి తన బ్యారక్‌ వద్దకు రూ.20 కోట్లు తెచ్చి లోబరుచుకునేందుకు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించాడు. 

ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణతో అసలు విషయాలు వెల్లడయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కడప జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌ దీనిపై సమగ్ర నివేదిక సమర్పించారు. జైలులో ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు నిర్వహించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇతర జైళ్లలో నిర్వహించిన వైద్య శిబిరాల వివరాలను సైతం నివేదించారు. దస్తగిరి రిమాండ్‌ ఖైదీగా జైలుకు రాకముందు కూడా డాక్టర్‌ చైతన్య రెడ్డి ఖైదీలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 

జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న దస్తగిరిని చైతన్యరెడ్డిగానీ ఇతరులుగానీ కలువ లేదని స్పష్టం చేశారు. జైలులో అన్ని ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిలో అటువంటి దృశ్యాలేవీ రికార్డు కాలేదన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. జైలుకు రూ.20 కోట్లు తీసుకెళితే సీసీ టీవీ కెమెరాల్లో నమోదు కావాలి కదా? అని ప్రశ్నిస్తే దస్తగిరి తరపు న్యాయవాది సమాధానం చెప్పలేకపోయారు. ఈ క్రమంలో దస్తగిరి అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 

కూటమి సర్కారు వచ్చాక మరోసారి స్పష్టం...
గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే కుట్రను మరోసారి తెరపైకి తెచ్చారు. చైతన్యరెడ్డి కడప జైలులో దస్తగిరిని కలిశారన్న ఫిర్యాదుపై విచారించాలని జైళ్ల శాఖ ఐజీ శ్రీనివాసరావును ఆదేశించారు. 2024 నవంబరు 25న ఆయన కడప జైలుకు వచ్చి విచారించగా.. దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించినట్లుగానీ కనీసం కలిసినట్లుగానీ నిర్ధారణ కాలేదు. అదే విషయాన్ని ఆయన ప్రభుత్వానికి నివేదించారు. దాంతో చంద్రబాబు కుట్ర మరోసారి బెడిసికొట్టింది.

అయినా తప్పుడు ఫిర్యాదు... అక్రమ కేసు
వైఎస్‌ వివేకా హత్య వెనుక అసలు వాస్తవాలు వెల్లడి కాకూడదన్నదే నర్రెడ్డి సునీత దంపతుల లక్ష్యంగా మారింది. అందుకే దేవిరెడ్డి శివశంకర్‌రెడిని లక్ష్యంగా చేసుకుని అక్రమ ఫిర్యాదులు, అక్రమ కేసుల పరంపర కొన సాగించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కొన్నాళ్ల క్రితం నర్రెడ్డి సునీత కలిశారు. అప్పటి నుంచి కుట్ర కార్యాచరణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో దస్తగిరి గతంలో ఇచ్చిన తప్పుడు ఫిర్యాదునే మరోసారి తెరపైకి తెచ్చారు.

2023 నవంబరులో తాను కడప జైలులో ఉండగా డాక్టర్‌ చైతన్య రెడ్డి బెదిరించారని.. రూ.20 కోట్లు ఆఫర్‌ చేసి లొంగదీసుకునేందుకు యత్నించారని పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 3న అర్ధరాత్రి 11.30 గంటలకు దస్తగిరి ఫిర్యాదు చేయడం... ఆ వెంటనే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండానే పోలీసులు చైతన్యరెడ్డితో పాటు ఇతరులపై అక్రమ కేసు నమోదు చేయడం అంతా పక్కా కుట్రతో చకచకా సాగిపోయాయి. 15 నెలల క్రితం జరిగిందని దస్తగిరి చెబుతున్న ఉదంతంపై కనీసం ప్రాథమిక విచారణ జరపా­లని కూడా పోలీసులు భావించక పోవడం విస్మ­యం కలిగిస్తోంది. 

పైగా గతంలో న్యాయస్థానం కొట్టివేసిన పిటిషన్‌లోని అభియోగాల ఆధారంగా హడావుడిగా అర్ధరాత్రి కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమేనని స్పష్టమవుతోంది. అనంతరం ఈ కుట్రకు మరింత పదును పెడుతూ దస్తగిరి ఫిర్యాదుపై విచారించాలని జైళ్ల శాఖ ఎస్పీ రాహుల్‌ను ఆదేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత నవంబరులో జైళ్ల శాఖ ఐజీ శ్రీనివాసరావు ఇదే ఫిర్యాదుపై విచారించారు. దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నవి అవాస్తవాలని నిగ్గు తేల్చారు. 

కానీ అదే ఆరోపణలపై టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి దర్యాప్తు చేసిన ఉదంతంపై.. ఆయన కంటే కింది స్థాయి అధికారి అంటే ఎస్పీ రాహుల్‌తో విచారణకు ఆదేశించడంపై పోలీసు వర్గాలు విస్తుపోతున్నాయి. మరోసారి విచారించాలని భావిస్తే గతంలో విచారించిన ఐజీ స్థాయి కంటే ఉన్నత స్థాయి అధికారికి ఆ బాధ్యతలు అప్పగించాలి. 

కానీ ఐజీ కంటే చిన్న స్థాయి అధికారి అయిన ఎస్పీతో విచారించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే తమ మాట వినే అధికారితో విచారణ తంతు ముగించి అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్రగా వెల్లడవుతోంది. కాగా దస్తగిరిని జైళ్లశాఖ ఎస్పీ రాహుల్‌ శుక్రవారం విచారించారు. డాక్టర్‌ చైతన్యరెడ్డి, ఏఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement