
పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు తగ్గడం వాస్తవం
ఇందుకు బాబు సర్కార్ ఓకే!
స్పష్టం చేస్తున్న జల్ శక్తి శాఖ 2024–25 నివేదిక.. ప్రాజెక్టులో 53.46 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ అంగీకరించినట్లు గురువారం విడుదల అయిన కేంద్ర జల్ శక్తి శాఖ 2024–25 వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా నిర్ధారిస్తూ కేంద్ర కేబినెట్ 2024, ఆగస్టు 28న ఆమోదించిందని పేర్కొంది. ప్రాజెక్టుకు మిగిలిన కేంద్ర గ్రాంట్‌ను రూ.12,157.53 కోట్లకు పరిమితం చేసిందని తెలిపింది. పోలవరం జాతీయ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 53.46 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మస్తున్నారు. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించి ఆయకట్టును స్థిరీకరించడం.. విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు సరఫరా చేయడం, 611 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చడం దీని లక్ష్యం.
⇒ విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. 2014, ఏప్రిల్ 1 నాటికి మిగిలిన పనులను వంద శాతం వ్యయాన్ని భరించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) ఖరారు చేసింది. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా తేలి్చంది.
భూసేకరణ వివరాలు చూస్తే
పోలవరం ప్రాజెక్టు కోసం 1,55,464.88 ఎకరాల భూమి సేకరించాలి. అందులో ఇప్పటికే 1,13,124.17 ఎకరాలు సేకరించారు. 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం అటవీ, ప్రభుత్వ భూమి మినహా మిగతా 65,205.26 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకూ 50,108.44 ఎకరాల భూమి సేకరించారు.
పునరావాసం ఎలా అంటే..
41.15 మీటర్ల కాంటూర్ వరకూ 8 మండలాల్లో 90 గ్రామాల పరిధిలోని 172 ఆవాసాల్లోని 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, 12,797 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. 25,263 కుటుంబాలకు పునరావాసం
కల్పించాలి. 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయాలంటే 67,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి.
ఎత్తు తగ్గితే ఏమవుతుంది..
పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు తగ్గితే, పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీల నుంచి 115.44 టీఎంసీలకు తగ్గిపోతుంది. అప్పుడు అది డ్యాం హోదాను కోల్పోయి, కేవలం నీటి నిల్వ కేంద్రంగా మిగులుతుంది. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న 7.20 లక్షల ఆయకట్టులో కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే ఒక పంటకు నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. – నిపుణుల మాట
53. 46 శాతం పురోగతి ఇలా...
⇒ కుడి కాలువ 92.75%
⇒ ఎడమ కాలువ 72.62%
⇒ హెడ్‌వర్క్స్ 74.27%
⇒ పునరావాసంృ భూసేకరణ 22.58%