
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
కూటమి నేతలు తమను మభ్యపెట్టి నిర్బంధించారని వెల్లడి
త్రిపురాంతకం ఎంపీపీ ఉప ఎన్నిక అనంతరం అనూహ్య పరిణామం
పార్టీ కార్యాలయానికి వచ్చిన వారికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆహ్వానం
యర్రగొండపాలెం: తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమేనని, ఇకపై ఈ పార్టీలోనే కొనసాగుతామని ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చిన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి, కంకణాలపల్లి, దూపాడు, వెల్లంపల్లి, సంగం తండాకు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎనిబెర ఏసోబు, బోయలపల్లి చిన్న ఏసు, గార్లపాటి శార, దూదేకుల సిద్ధయ్య, రమావత్ మార్తాబాయి స్పష్టం చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు, ప్రలోభాల వల్ల ఎంపీపీ ఎన్నికలో కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చామని చెప్పారు.
ఈ ఎన్నికలో టీడీపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో ఆదివారం వారు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద విలేకరులకు వివరించారు. టీడీపీ అభ్యర్థి చల్లా జ్యోతి భర్త ఎల్లారెడ్డి తన ఇంటిలో ఏర్పాటు చేసిన క్యాంపులో తమను నిర్బంధించాడని తెలిపారు.
టీడీపీ కండువాలు కప్పుకోవాలని బలవంతం చేశారని, అందుకు తాము అంగీకరించక పోవడంతో భోజనం చేసే సమయంలో, ఆలయాలకు తీసుకెళ్లి దేవుళ్లపై ప్రమాణం చేయించుకున్నారన్నారు. దీంతో చేసేదిలేక వారు చెప్పినట్లు జ్యోతికి మద్దతుగా చేతులు ఎత్తామని పశ్చాత్తాపపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు ధన దాహంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.